ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అడవుల్లో చెట్లు నరికే వారిపై క్రిమినల్​ కేసులు పెడతామని కలెక్టర్​ అనుదీప్​ హెచ్చరించారు. కలెక్టరేట్  నుంచి పోడు సర్వేపై ఎస్పీ వినీత్,​ రెవెన్యూ, ఫారెస్ట్, పంచాయతీరాజ్​ ఆఫీసర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ 2,99,477.79 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 1,13,218.86 ఎకరాల్లో సర్వే పూర్తయినట్లు చెప్పారు. 1,86,258.93 ఎకరాల్లో సర్వే ఈ నెల 25లోగా పూర్తి చేయాలన్నారు. చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, రావికంపాడు, పెనగడప గ్రామాల్లో ప్లాంటేషన్లలో మొక్కలు నరికి వేయడం సరైంది కాదన్నారు. వారిపై కేసులు పెట్టడంతో పాటు రికవరీ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. డీఎఫ్​వో రంజిత్​ నాయక్, అడిషనల్​ కలెక్టర్​ కె. వెంకటేశ్వర్లు, భద్రాచలం ఏఎస్పీ రోహిత్​రాజ్, ఎఫ్డీవో  నీరజ్​కుమార్​, డీఆర్వో అశోక్​ చక్రవర్తి పాల్గొన్నారు. 

హాస్పిటల్స్​లో మెనూ పాటించాలి

గవర్నమెంట్​ హాస్పిటల్స్ లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్​ కాంట్రాక్టర్​ను ఆదేశించారు. కలెక్టరేట్​లో వివిధ శాఖల అధికారులతో సోమవారం రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లందు గవర్నమెంట్​ హాస్పిటల్​లో రోగులకు కాంట్రాక్టర్​ మెనూ ప్రకారం భోజనం అందించడం లేదన్నారు. 

రోడ్లను ఆక్రమించుకుంటున్రు

కొత్తగూడెం పట్టణంలోని లేపాక్షి రోడ్, గాజుల రాజం బస్తీ, విశ్వనాథకాలనీల్లో కొందరు వ్యక్తులు రోడ్లను ఆక్రమించుకున్నారని పలువురు కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లారు. గ్రీవెన్స్​లో కలెక్టర్​ ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. జూలూరుపాడు, ఇల్లందు తహసీల్దార్లు గిరిజనుల పట్ల దుసురుగా ప్రవర్తిస్తున్నారని భారతీయ సర్వ సమాజ్​ మహాసంఘ్​ ఆధ్వర్యంలో కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేశారు. రోడ్డు సౌకర్యం కల్పించాలని, రేషన్​ ఇవ్వడం లేదని, ఉపాధి పని  కల్పించడం లేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండలం​ సిరిగుండం(నారాయణరావుపేట) గ్రామానికి చెందిన ఆదివాసీలు కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేశారు. పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం రెండేండ్లుగా గ్రామ సభలను నిర్వహించడంలేదని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేశ్​​కలెక్టర్​కు కంప్లైట్​ ఇచ్చారు. 

నీలాద్రి అభివృద్ధికి రూ.2 కోట్లు

పెనుబల్లి, వెలుగు: రూ.2 కోట్లతో నీలాద్రి ఆలయ అభివృద్ధి చేపట్టినట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. మండలంలోని నీలాద్రి అటవీ ప్రాంతంలోని నీలాద్రీశ్వరుడి ఆలయంలో కార్తీక  సోమవారం సందర్భంగా అభిషేకం, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజర్వ్​ ఫారెస్ట్​ ఏరియాలోని ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ అనుమతితో రెండెకరాల భూమి కేటాయించినట్లు చెప్పారు. అనంతరం వియంబంజర్​ ఆర్అండ్​బీ గెస్ట్​ హౌస్​లో ఆర్అండ్​బీ అధికారులతో రోడ్డు పనుల నిర్మాణాలపై సమీక్ష  నిర్వహించారు. నీలాద్రి ఆలయ చైర్మన్​ పసుమర్తి వెంకటేశ్వరరావు, ఈవో పాకాల వెంకటరమణ, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్​రావు, ఆర్అండ్​బీ​ఈఈ హేమలత, డీఈశంకర్​రావు, జేఈ ప్రకాశ్, టీఆర్ఎస్​ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు పాల్గొన్నారు.

గ్రీవెన్స్ లో ఫిర్యాదుల వెల్లువ

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం సిటీలోని జడ్పీ హాల్ లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో కలెక్టర్  వీపీ గౌతమ్  జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. 100 ఫిర్యాదులు రాగా, 65 అప్లికేషన్లు డబుల్  బెడ్రూమ్, రేషన్ కార్డ్స్, దళితబంధు, రైతుబంధు, ఆసరా పింఛన్లకు సంబంధించనవే ఉన్నాయి. 35 దరఖాస్తులు ధరణి సమస్యలపై వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు ఎన్  మధుసూధన్, స్నేహలత మొగిలి, డీఆర్వో శిరీష, ఆర్డీవో రవీంద్రనాథ్​ పాల్గొన్నారు.

అనుమానాస్పదంగా లెక్చరర్​ మృతి

వైరా, వెలుగు: గురుకుల కాలేజీలో లెక్చరర్​గా పని చేస్తున్న లింగాల హర్షిత(40) సోమవారం అనుమానాస్పదంగా చనిపోయింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వైరా మున్సిపాలిటీ పరిధిలోని దిద్దుపూడి గ్రామానికి చెందిన ఆమె  మహబూబాబాద్  జిల్లా తొర్రూర్  సోషల్ వెల్ఫేర్  రెసిడెన్షియల్  గురుకుల జూనియర్  కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తుంది.  నాలుగేండ్ల క్రితం  భర్తతో విడాకులు తీసుకొని వైరా మున్సిపాలిటీలోని టీచర్స్ కాలనీలో ఇంటిని కొనుగోలు చేసి ఒంటరిగా ఉంటోంది. తనకు పిల్లలు లేకపోవడంతో ఒక పాపను దత్తత తీసుకొని చదివిస్తోంది. ఒంటరిగా ఉన్న హర్షితతో అదే గ్రామానికి చెందిన మక్కెల నరసింహారావు సహజీవనం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆమె వద్ద డబ్బులు తీసుకొని లావాదేవీలు చేస్తున్నాడు. 3 రోజులుగా డబ్బుల విషయమై గొడవ జరుగుతుందని దత్తపుత్రిక సైనీ తెలిపింది. ఆదివారం అర్ధరాత్రి నరసింహారావు తమ్ముడు వీరన్న, భార్య నరసమ్మ దాడి చేయడంతో అస్వస్థతకు గురై హర్షిత చనిపోయింది. హర్షిత మృతికి నరసింహారావు కుటుంబసభ్యులే కారణమని కొణిజర్ల పోలీసులకు ఆమె కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని సీఐ సురేశ్, ఎస్ఐ యయాతి రాజు పరిశీలించారు. 

రూ.14.71 లక్షలకు కుచ్చుటోపి

తల్లాడ, వెలుగు: బ్యాంకులో డబ్బులు డిపాజిట్​ చేస్తే ఆఫర్​లో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి రూ.14.71 లక్షలు కాజేసిన వ్యక్తిపై సోమవారం తల్లాడ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం ప్రకారం.. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన దారా మంగతాయారు ఫ్యాన్సీ స్టోర్  నడుపుకుంటోంది. నూతనకల్  గ్రామానికి చెందిన కొల్లోజు వీరాచారి ఎస్బీఐ బ్రాంచిలో రూ.30 లక్షలు డిపాజిట్ ఉన్నాయని, డబ్బులు డిపాజిట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి విడతల వారీగా రూ14.71 లక్షలు వసూలు చేశాడు. మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి సురేశ్​ తెలిపారు.

రామయ్యకు ముత్తంగి సేవ

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి సోమవారం ముత్తంగి సేవ జరిగింది. ముత్యాలు పొదిగిన వస్త్రాలను స్వామికి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఉదయం గోదావరి నుంచి తీర్థబిందె తెచ్చి అంతరాలయంలో సుప్రభాత సేవ చేశారు. తర్వాత స్వామి మూలవరులు, ఉత్సవమూర్తులు, సుదర్శనుడు, లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామికి ముత్యాలు పొదిగిన వస్త్రాలను అలంకరించి ముత్తంగి సేవను వేదోక్తంగా జరిపారు. కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం జరిపించారు. భక్తులు కంకణాలు ధరించి స్వామి వారి కల్యాణ క్రతువులో పాల్గొని తరించారు. 

భక్త జనసంద్రంగా గోదావరి తీరం

భద్రాచలం, వెలుగు: కార్తీక సోమవారం వేళ గోదావరి తీరం భక్తజన సంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరి స్నానఘట్టాల వద్దకు చేరుకున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు నదీమాతల్లి ఒడిలో వదిలి పూజలు చేశారు. అనంతరం శివాలయాల్లో కార్తీక దీపాలు వెలిగించి, శివుడికి అభిషేకాలు చేశారు. వైష్ణ, శైవ క్షేత్రాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

రెండో రోజూ విద్యార్థినుల ఆందోళన

కామేపల్లి, వెలుగు: హెచ్ఎంను తిరిగి రప్పించే వరకు ఆందోళన చేస్తామని కామేపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు తెలిపారు. హెచ్ఎం నాగేశ్వరావు బదిలీని రద్దు చేయాలని సోమవారం రెండో రోజు ఆందోళన చేశారు. కామేపల్లి ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థినులకు మద్ధతు తెలిపిన పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్వీ రాకేశ్​ మాట్లాడుతూ విద్యా సంవత్సరం మధ్యలో హెచ్ఎంను బదిలీ చేయడమేమిటని ప్రశ్నించారు. 

పోడు భూముల కబ్జాపై విచారణ చేయాలి

పెనుబల్లి, వెలుగు: మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో 72 మంది పోడు రైతుల భూములు కబ్జా చేసిన వ్యక్తిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ వీపీ గౌతమ్​ను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. సోమవారం కలెక్టరేట్​లో బాధితులతో కలిసి సమస్యను వివరించారు. 72 మంది రైతులకు 74 ఎకరాలను సమానంగా పంచి హక్కు పత్రాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లారు. లక్కినేని వినీల్, మందడపు అశోక్  పాల్గొన్నారు.

మెకానిక్ కు ఆర్థికసాయం

ఖమ్మం టౌన్, వెలుగు: సిటీకి చెందిన టూ వీలర్ మెకానిక్ చిన్నబోయిన నరేశ్​ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఖమ్మం కార్పొరేషన్ టూ వీలర్స్ యూనియన్ అధ్యక్షుడు వంగాల కొండలరావు సోమవారం తోటి మెకానిక్ లతో కలిసి రూ.50 వేల ఆర్థికసాయం అందించారు. యూనియన్  అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రమేశ్, ​మురళి, శ్రీను, బ్రహ్మం, శేషు, అలీ, గంగరాజు, హరి, వెంకట్, లాలయ్య పాల్గొన్నారు.