మోదీ నిర్ణయాల వల్లే విద్యుత్ రంగంలో సంక్షోభం : మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శలు

మోదీ నిర్ణయాల వల్లే విద్యుత్ రంగంలో సంక్షోభం : మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శలు
  • 1,362 జూనియర్ లైన్​మెన్​లకు నియామక పత్రాలు

హైదరాబాద్, వెలుగు :  ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాల వల్లే దేశంలోని పలు రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం నెలకొందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ కృషితో రెప్పపాటు కూడా కోత లేకుండా కరెంట్ సరఫరా చేస్తున్నామన్నారు. టీఎస్ ఎస్పీడీసీఎల్ లో కొత్తగా నియమితులైన1,362 మంది జూనియర్ లైన్ మెన్ లకు శనివారం రాత్రి ఎస్ఆర్ నగర్ లోని జెన్కో ఆడిటోరియంలో మంత్రి నియామకపు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని రూ. లక్ష కోట్లతో అభివృద్ధి చేసుకున్నామని అన్నారు.

విద్యుత్ రంగం అభివృద్ధిపై కేసీఆర్ ఉద్యమకాలంలోనే ప్రణాళికలు వేసుకున్నారని చెప్పారు. రాష్ట్ర విద్యుత్ శాఖలో 22,774 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని, డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా 13,000 మందిని నియమించామన్నారు. మరో 670 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, సదరన్ డిస్కం సీఎండీ రఘుమా రెడ్డి, హెచ్ఆర్ డైరెక్టర్ పర్వతం, డైరెక్టర్లు టి.శ్రీనివాస్, జే శ్రీనివాస్ రెడ్డి, స్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.