ఐటీసీ కలుషిత నీటితో గోదావరిలోని మొసళ్లు, జీవాలు చస్తున్నయ్

ఐటీసీ కలుషిత నీటితో గోదావరిలోని మొసళ్లు, జీవాలు చస్తున్నయ్
  •     పక్షులు, జంతువులకు కూడా ముప్పు .. 
  •     వానాకాలంలో భద్రాద్రిలో స్నానాలు చేసే భక్తులకు చర్మ రోగాలు 
  •     30 కిలోమీటర్ల పరిధిలోని గ్రామస్తులకూ వ్యాధులు  
  •     పట్టించుకోని పీసీబీ

సాగునీటిని, తాగునీటిని అందిస్తూ ప్రాణాధారగా పేరుపొందిన గోదావరితో ఇప్పుడు భద్రాచలం పరిధిలోని జీవాలకు ముప్పు ఏర్పడింది. ఐటీసీ (ఇండియన్​టుబాకో కంపెనీ) పేపర్ ఇండస్ట్రీ ఈ నదిలో కలుపుతున్న రసాయన వ్యర్థ జలాలతో జలచరాలు, పక్షులు, జంతువులు రోగాల బారిన పడి కన్నుమూస్తున్నాయి. జనాలు చర్మవ్యాధులతో సతమతమవుతున్నారు. ఖర్చు తగ్గించుకోవడం కోసం వ్యర్థ జలాలను ట్రీట్​మెంట్​చేయకుండా పైపులు వేసి డైరెక్ట్​గా నదిలోకి కలుపుతుండడంతో ఈ పరిస్థితి నెలకొన్నది. తాజాగా రెడ్డిపాలెం వద్ద మడుగులో బుధవారం ఐదేండ్ల వయస్సున్న పెద్ద మొసలి కళేబరం తేలి కనిపించింది. ఇలా ఈ ఏడాది ఇప్పటివరకు ఐదు వరకు మొసళ్లు బలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా పీసీబీ నోరు మెదపడం లేదు.  

భద్రాచలం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఐటీసీ  పేపర్​తయారీ పరిశ్రమను 1975లో  ఏర్పాటు చేశారు. పేపర్​ ఉత్పత్తిలో భాగంగా విడుదలయ్యే రసాయన వ్యర్థ జలాలను వాటర్​ ట్రీట్​మెంట్​ ప్లాంట్​లో శుద్ధి చేయాల్సి ఉంటుంది. తర్వాతే ఆ నీళ్లను గోదావరిలో కలపాలి.  కానీ, సదరు సంస్థ ఈ పని చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. ఖర్చు ఎక్కువవువుతుందని ఇతర మార్గాలను ఎంచుకున్నది. సారపాకలోని పరిశ్రమ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం వద్ద ఉన్న గోదావరిలోకి పైపులు వేసి మరీ రసాయన వ్యర్థ జలాలను తరలిస్తున్నది. రోజూ సుమారు 50 వేల లీటర్ల వరకు నదిలో కలిపేస్తుందన్న ఆరోపణలున్నాయి. పట్టించుకునేవారు లేకపోవడంతో ఏడాది మొత్తం కొనసాగిస్తోంది. వర్షాకాలంలో ఈ పరిశ్రమ కలిపే వ్యర్థ జలాలు గోదావరి ప్రవాహంతో పాటు కొట్టుకుపోయి భద్రాద్రిలో స్నానాలు చేసే భక్తుల చర్మరోగాలకు కారణమవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ నీటిని తాగుతున్న భద్రాద్రి పరిధిలోని 30 గ్రామాల ప్రజలు వ్యాధుల బారిన కూడా పడుతున్నారని తెలుస్తోంది.  

ఎండాకాలంలో గుట్టు రట్టు 

ఎండాకాలంలో గోదావరిలో నీళ్లు అడుగంటిపోతాయి. ఈ టైంలో ఐటీసీ పరిశ్రమ సారపాక నుంచి పైపుల ద్వారా రెడ్డిపాలెంలోని గోదావరిలోకి పంపే రసాయన వ్యర్థ జలాలు మడుగులా తయారవుతున్నాయి. ఇందులో నీళ్లు తాగే పశువులు, పక్షులు, మేకలకు రోగాలొస్తున్నాయి. చేపలు చనిపోతున్నాయి. పశువులను గోదావరి తీరానికి తీసుకెళ్తుండగా అవి అక్కడే మేత మేసి మడుగులో నీళ్లు తాగి వ్యాధులు సోకి చనిపోతున్నాయి. మేకలు, గొర్రెలకు కూడా రోగాలు సోకడంతో వైద్యం చేయించాల్సి వస్తోంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నా తాజాగా మొసళ్లు కూడా కన్నుమూయడం కలకలం సృష్టిస్తున్నది. వర్షాకాలంలో గోదావరి ప్రవాహం ఉంటుంది కాబట్టి మొసళ్లు పక్కనే ఉన్న మడుగుల్లో ఉంటాయి. వేసవికాలంలో ఈ మడుగుల్లోని నీళ్లు ఎండిపోవడంతో ఐటీసీ వల్ల ఏర్పడే  మడగులోకి చేరుతున్నాయి. దీంతో వ్యర్థ జలాల ఎఫెక్ట్​తో కన్నుమూస్తున్నాయి. ఇలా ఇప్పటివరకు నాలుగు మొసళ్లు చనిపోయినట్టు సమాచారం. శుక్రవారం ఐదేండ్ల వయస్సున్న పెద్ద మొసలి  బలయ్యింది. దీంతో అశ్వాపురం రేంజర్ డ్వాలియర్ సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్ర ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. గోదావరి జలాల శాంపిల్స్​తీసుకున్నారు. టెస్టింగ్ కోసం హైదరాబాద్​లోని సీసీఎంబీ ల్యాబ్​కు పంపించారు.  అలాగే మొసలి కళేబరానికి గురువారం పోస్టుమార్టం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.  

మొసళ్ల ఉనికికి ప్రమాదం

ఐటీసీ కలుషిత జలాల వల్ల గోదావరిలో మొసళ్ల ఉనికికే ప్రమాదం వచ్చి పడింది. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద మొసళ్ల సంరక్షణకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. వీటికి అంతర్జాతీయంగా డిమాండ్​ ఉన్న నేపథ్యంలో  వేటపై నిషేధం విధించింది. సంరక్షణకు చట్టాలు తీసుకొచ్చింది. ప్రస్తుతం సారపాక–-రెడ్డిపాలెం మధ్య ఉన్న వాగులో వరుసగా మొసళ్లు ప్రాణాలు విడుస్తుండడంతో  వాటిని రక్షించాలని జంతు ప్రేమికులు డిమాండ్ ​చేస్తున్నారు. పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించిన ఐటీసీ రసాయన వ్యర్థ జలాలను గోదావరిలో కలిపే ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్​ చేస్తున్నారు. 

చట్టాలు పట్టించుకుంటలేరు

ఇంత జరుగుతున్నా ఐటీసీ పర్యావరణ చట్టాలను బేఖాతర్​ చేస్తోంది. 1986  పర్యావరణ చట్టం, 2006 ఈఐఏ(ఎన్విరాన్​మెంట్​ ఇంపాక్ట్ ఎసెస్మెంట్​) నోటిఫికేషన్ ప్రకారం పరిశ్రమలు రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను గోదావరిలో నేరుగా కలపకూడదు. కానీ దీన్ని ఐటీసీ పట్టించుకోవడం లేదు. గతంలో ఫిర్యాదుల వచ్చినా లైట్ తీసుకుంది. పైగా  తమ దగ్గరున్న వాటర్​ ట్రీట్​మెంట్ ప్లాంట్లలో రసాయన వ్యర్థ జలాలను శుద్ధి చేసే  గోదావరిలోకి వదులుతున్నామని, దగ్గర్లోని పంట పొలాలకు కూడా సరఫరా చేస్తున్నామని చెబుతోంది. ఇదంతా తెలిసినా ..కాలుష్య నియంత్రణ మండలి ఆఫీసర్లు మాత్రం తూతూ మంత్రంగా తనిఖీలు చేసి తమ దారిన తాము పోతున్నారు.  

మొసళ్ల కళేబరాలు కనిపిస్తున్నయ్​..

మేకలను కాసేందుకు రోజూ గోదావరికి వెళ్తా. అక్కడ మొసళ్ల కళేబరాలు కనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఇప్పటివరకు చాలావరకు మొసళ్లు చనిపోయాయి. మా మేకలు కూడాఈ నీళ్లు తాగి రోగాలపాలవుతున్నాయి. కొన్ని చనిపోతున్నాయి. వాటికి మందులు  వాడుతున్నం. నీళ్ల దగ్గరకు పోతే  వాసన వస్తోంది. ఇంతకుముందు గోదావరిలో చాలా పక్షులు కనిపించేవి..అప్పుడప్పుడు కొన్ని చనిపోయి కనిపిస్తున్నాయి. చాలామటుకు రావడం లేదు.  - బూరం రామారావు, మేకల కాపరి, రెడ్డిపాలెం

టెస్ట్ చేస్తున్నాం

ఐటీసీ గోదావరిలో కలిపే నీటిని ప్రతీ నెల టెస్ట్ చేస్తున్నాం. ట్రీట్​మెంట్ చేశాకే వదలాలని పరిశ్రమకు సూచిస్తున్నాం. రోజూ 40వేల నుంచి 50వేల లీటర్ల నీటిని గోదావరిలో కలిపేందుకు ప్రభుత్వమే అనుమతిచ్చింది. మొసళ్లు ఎందుకు చనిపోతున్నాయో తెలియదు. ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది.  - రవిశంకర్​, ఈఈ, పొల్యూషన్​ కంట్రోల్​బోర్డు