పంట దిగుబడి పెంచే సెన్సర్​

పంట దిగుబడి పెంచే సెన్సర్​

పెద్ద వానల వల్లనో, ఎరువుల మోతాదు ఎక్కువ తక్కువయ్యో ఒక్కోసారి పంట సరిగా పండదు. పండిన ధాన్యాన్ని అమ్మి అప్పులు కట్టే రైతులు మనదగ్గర చాలామందే. ఆరుగాలం కష్టపడే రైతుల ముఖాల్లో నవ్వు చూడాలనుకున్నాడు. అందుకోసం పంట దిగుబడి పెంచే ‘క్రాప్​ సెన్సర్’​ తయారుచేశాడు నాసాలో పనిచేసిన సైంటిస్ట్​ పరాగ్​ నర్వేకర్​. నాసాలో సైంటిస్ట్​గా పనిచేసి రిటైరయ్యాక దేశానికి ఏదైనా ఉపయోగపడే ఇన్నొవేషన్స్​ చేయాలనుకున్నాడు పరాగ్. నాసిక్​లోని సహ్యాద్రి ఫామ్​ సంస్థతో కలిసి ‘క్రాప్​ సెన్సర్’​ తయారు చేశాడు. దానికి లక్షన్నర రూపాయలు ఖర్చయ్యింది. ఎక్కువమంది రైతులకి ఈ టెక్నాలజీని అందించడం కోసం ఈ సెన్సర్​ని పదివేలకే తీసుకొచ్చాడు పరాగ్. 
శాటిలైట్​ డేటా సాయంతో
“ఇప్పటికీ మనదేశానికి వ్యవసాయరంగమే వెన్నెముక. పంట దిగుబడి పెరగడం కోసం వాళ్లు కొనగలిగిన ధరలోనే టెక్నాలజీని తీసుకురావాలి అనుకున్నా. అమెరికా, యూరప్​ దేశాలతో పోల్చితే వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించే రైతులు మనదగ్గర చాలా తక్కువ. అందుకే, ఆ దేశాల్లో వాడుతున్న టెక్నాలజీని తక్కువ ధరకే రైతులకు అందించాలనుకున్నా.  ఎరువుల వాడకం, వాతావరణాన్ని బట్టి నీళ్ల తడి పెట్టడం వంటి విషయాల్లో రైతులకు నేను తయారుచేసిన ‘క్రాప్​ సెన్సర్’​ ఉపయోగపడుతుంది.  ఎప్పుడు ఏ పంట వేయాలి?, ఏ టైంలో ఎరువులు చల్లాలి?,  ఏ రకమైన సాగు పద్ధతుల్ని పాటించాలి? వంటి విషయాలు తెలుసుకోవచ్చు” అని చెప్పాడు ఈ సైంటిస్ట్.  ఈ క్రాప్ సెన్సర్‌‌ శాటిలైట్​ డేటా సెట్​సాయంతో వాతావరణాన్ని అంచనా వేయొచ్చు. వీటిని పొలంలో పెట్టుకుంటే వాతావరణ పరిస్థితుల్ని రైతులు తెలుసుకొని దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
ముందే తెలుసుకుంటున్నాం
‘‘ఈ ‘క్రాప్​ సెన్సర్’​ల వల్ల ఎప్పుడు వాన పడుతుందో, ఎంత కురుస్తుందో ముందే తెలుస్తుంది. పంట ఎప్పుడు వేయాలి? పంటకి మందులు ఎప్పుడు కొట్టాలి? అనేది తెలుస్తోంది” అని చెప్పాడు సహ్యాద్రి ఫామ్​ రైతు రమేష్​ గుంజా.