టీఆర్ఎస్ లీడర్ల మధ్య మాటల తూటాలు

టీఆర్ఎస్ లీడర్ల మధ్య మాటల తూటాలు
  • ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 150 ఓట్లు
  • పొంగులేటే కారణమని టీఆర్ఎస్ లీడర్ల ఆరోపణలు
  • పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు
  • మాజీ ఎంపీపై మాటల తూటాలు
  • సోషల్ మీడియాలో కౌంటర్లిస్తున్న మాజీ ఎంపీ వర్గం

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్​లో క్రాస్​ఓటింగ్​కథ ఇంకా సమసిపోలేదు. ఈ విషయంలో లీడర్ల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో ప్రధాన లీడర్ల మధ్య సఖ్యత లేదు. ఒకరంటే ఒకరికి పడడం లేదు. ఈ అంతర్గత కుమ్ములాటలు కొన్ని రోజుల కింద జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కనిపించాయి. టీఆర్ఎస్​కు మెజారిటీ ఉన్నప్పటికీ పార్టీ నుంచి కాంగ్రెస్​ కు దాదాపు 150 ఓట్లు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్18 ఎమ్మెల్సీ స్థానాలను గెల్చుకున్నా, ఖమ్మంలో క్రాస్ ​ఓటింగ్ హైకమాండ్​కు కొంత అసంతృప్తిని మిగిల్చింది. ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎంతో జరిగిన మీటింగ్​లో ఉమ్మడి జిల్లా లీడర్లంతా క్రాస్​ఓటింగ్ పై కేసీఆర్​ కు కంప్లయింట్ చేశారు. దీనికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే ప్రధాన కారణమని చెప్పారు. ఇదంతా జరిగి దాదాపు రెండు వారాలవుతున్నా ఆ వేడి మాత్రం చల్లారడం లేదు. ఇప్పటికీ జిల్లా లీడర్లు  సందర్భం వచ్చిన ప్రతిసారీ పొంగులేటిని టార్గెట్ చేస్తున్నారు. దీనికి సోషల్ మీడియా లో మాజీ ఎంపీ అనుచరులు కౌంటర్లు ఇస్తుండడం చర్చనీయాంశంగా మారింది. 
అందరూ టీఆర్​ఎస్​లోకే..అందుకే...
ఉమ్మడి జిల్లాలో ముఖ్య లీడర్లంతా ఒక్కొక్కరుగా టీఆర్ఎస్​లో చేరడంతో వర్గ విభేదాలు మొదలయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో వచ్చిన రిజల్ట్స్​తో గొడవలు బయటపడ్డాయి. 2014 ఎన్నికల్లో మాదిరిగానే 2018 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్​ కారు గుర్తుపై ఉమ్మడి జిల్లాలో ఒక్కరే గెలిచారు. దీనిపై ఓ ప్రెస్​మీట్​లో సీఎం కేసీఆర్​మాట్లాడుతూ సొంత పార్టీలో వెన్నుపోట్ల వల్లే ఖమ్మంలో ఓడిపోయామని కామెంట్ చేశారు. మాజీ మంత్రి తుమ్మల కూడా పాలేరులో తన ఓటమికి సొంత పార్టీ వారే కారణమని కార్యకర్తల మధ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పటి నుంచి పార్టీలో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. పార్టీ హైకమాండ్​ పరిస్థితులను చక్కదిద్దేందుకు చేసిన కొన్ని ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయ్యాయి. అదే టైమ్​లో ఒకరిపై ఒకరు సోషల్ మీడియా కేంద్రంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.  
పొలిటికల్ ​బ్రోకర్స్​ అంటూ ఘాటు వ్యాఖ్యలు  
ఎమ్మెల్సీ రిజల్ట్స్ వచ్చిన రోజే ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రెస్​ మీట్ లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, విప్​ రేగా కాంతారావు, హరిప్రియ, ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధు పాల్గొని క్రాస్​ ఓటింగ్ పై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. తాజాగా సత్తుపల్లిలో జరిగిన తాతా మధు సన్మాన సభలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో పొలిటికల్ బ్రోకర్లు తయారయ్యారంటూ సీరియస్​ కామెంట్​ చేశారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి నిబద్దతతో పని చేయాలన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ టీఆర్ఎస్​ కు తూట్లు పొడిచే కొందరి చౌకబారు రాజకీయాలపై హైకమాండ్ కన్నేసి ఉంచిందని హెచ్చరించారు. దీనికి వాట్సాప్​, ఫేస్​బుక్కుల్లో పొంగులేటి వర్గీయులు కౌంటర్​ ఇస్తున్నారు. ‘వ్యక్తిగత అవకాశాలు, అవసరాల కోసం పార్టీలు మారిన వారు తమ అస్తిత్వాన్ని  కాపాడుకునేందుకు ఇతరులపై నిందలు వేస్తున్నారు’ అటూ ఫైరయ్యారు. ‘ఓటుకు నోటు నుంచి బయటపడేందుకు పార్టీ ఫిరాయించిన వారు, సొంత మండలంలో 16 స్థానిక సంస్థల ఓట్లు ఉంటే 12  కాంగ్రెస్​ కు పోలైనట్లు బహిరంగ చర్చ నడుస్తుంటే సమాధానం చెప్పకుండా ఇతరుల మీదకు నెపాన్ని నెడుతున్న వారే నీతిబాహ్యమైన రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు. 
అన్ని నియోజకవర్గాల్లో ఇదే లొల్లి 
ఉమ్మడి జిల్లాలో చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి గెలిచి టీఆర్ఎస్​ లో చేరిన ఎమ్మెల్యేలు ఉండగా, అక్కడ పోటీచేసి ఓడిపోయిన టీఆర్ఎస్​ నేతలు మాజీలయ్యారు. పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు వర్సెస్​ కందాల ఉపేందర్​ రెడ్డి, వైరాలో రాములు నాయక్​ వర్సెస్​ మదన్​లాల్, ఇల్లందులో హరిప్రియ వర్సెస్​ కోరం కనకయ్య, కొత్తగూడెంలో వనమా వేంకటేశ్వరరావు వర్సెస్​ జలగం వెంకట్రావు, పినపాకలో రేగా కాంతారావు వర్సెస్​ పాయం వేంకటేశ్వర్లుకు పడడం లేదు. 
పాయంపై రేగా పోస్టు
తాజాగా ఫేస్​ బుక్​ కేంద్రంగా పినపాక ఎమ్మెల్యే, విప్​ రేగా కాంతారావు పెట్టిన వరుస పోస్టులు కూడా వర్గపోరును బయటపెట్టాయి. నియోజకవర్గంలో తనకు, మాజీ ఎమ్మెల్యేకు మధ్యనే వచ్చే ఎన్నికల్లో పోటీ ఉంటుందని పోస్టు పెట్టారు. ప్రత్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఏ పార్టీ నుంచి అయినా పోటీలో ఉండొచ్చని పోస్టులో స్పష్టం చేశారు. డైరెక్టుగా పేరు చెప్పకున్నా పాయం వేంకటేశ్వర్లు గురించే ఈ పోస్టులు పెట్టారని పార్టీ లీడర్లు చెప్పుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇలాంటి గొడవలను ఇప్పటికైనా సరిదిద్దాలని పార్టీ అభిమానులు కోరుతుంటే, అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే మరింత నష్టం జరుగుతుందనే అంచనాతోనే అధిష్టానం కాలయాపన చేస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.