
- వర్షాలతో ఖరాబైన రోడ్లకు రిపేర్లు చేసిన ఆఫీసర్లు
- కాళేశ్వరంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్ష
జయశంకర్ భూపాలపల్లి/మహదేవ్‌పూర్, వెలుగు: జయశంకర్భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు తరలివస్తున్నారు. గురువారం 8వ రోజు సైతం భక్తుల రద్దీ నెలకొంది. కాళేశ్వరంలో చిరుజల్లులు కురుస్తూ ఆకాశం మేఘావృతమై ఉండడంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు రాక మొదలైంది. ప్రత్యేక పూజలు, పుణ్యస్నానాలు, హారతులతో సరస్వతి ఘాట్ పరిసరాలు సందడిగా మారాయి.
సినీ హీరో అల్లు అర్జున్ తల్లి, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే సత్యనారాయణ తదితరులు పుష్కరస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం కురిసిన భారీ వర్షంతో నిలిచిపోయిన షటిల్ బస్ సేవలను పునరుద్ధరించారు. వానలకు ఖరాబైన మట్టి రోడ్లను గురువారం రిపేర్ చేసిన ఆఫీసర్లు, తాత్కాలిక బస్టాండ్ నుంచి సరస్వతి ఘాట్, ఆలయ పరిసరాల వరకు ఉచిత షటిల్ బస్సులు నడిపించారు.
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రివ్యూ..
సరస్వతి పుష్కరాల నిర్వహణపై గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ఈవో ఆఫీస్లో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, దేవస్థానం ఈవో మహేశ్తో వివిధ అంశాలపై చర్చించారు. వచ్చే నాలుగు రోజులు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత, వైద్యం, రవాణా, తాగునీరు, పారిశుధ్యం, వర్షాలతో విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని సూచించారు