బండి ఉన్నోళ్లకు పెట్రో షాక్..

బండి ఉన్నోళ్లకు పెట్రో షాక్..

న్యూఢిల్లీ :పెట్రోల్, డీజిల్‌‌ ధరల వడ్డన స్టార్ట్‌‌ అయింది. వాహనదారులకు గుండె గుభేల్‌‌మనిపిస్తూ.. బడ్జెట్‌‌ తర్వాత బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలు బాగాపెరిగాయి. ఒక్కరోజులోనే పెట్రోల్ ధర 25 పైసలు పెరగగా.. డీజిల్ ధర 24 పైసలు వాత పెట్టింది. సౌదీ ఆయిల్ స్థావరాలపై డ్రోన్ అటాక్స్ జరిగిన తర్వాత​అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పెరగడంతో, ఆ ప్రభావం వినియోగదారులపై పడుతోంది.

ఢిల్లీలో లీటరు పెట్రోల్ కాస్ట్‌‌ రూ.72.42 ఉంటే,ముంబైలో అత్యధికంగా రూ.78.10లు, చెన్నైలో రూ.75.26గా, కోల్‌‌కతాలో రూ.75.14గా ఉంది. డీజిల్ ధర కూడా ఢిల్లీలో లీటరుకు రూ.65.82 పలికింది. ముంబైలో రూ.69.04, చెన్నైలో రూ.69.57, కోల్‌‌కతాలో రూ.68.23కు పెరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 5న ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో ఫ్యూయల్‌‌పై ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఈ మేర పెరగడం ఇదే తొలిసారి.

ఇప్పుడున్న నిల్వలతో రెండు నెలలు ఉండొచ్చు…

1990–91లో గల్ఫ్‌‌ సంక్షోభం ఏర్పడినప్పుడు కూడా క్రూడాయిల్ ధరలు ఇలానే పెరిగాయి. ఆ సమయంలో ఇండియా వద్ద మూడు రోజులకు సరిపడా ఆయిల్ రిజర్వ్‌‌లు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయిల్ దిగుమతి చేసుకోకుండా రెండు నెలలు పాటు ఉండొచ్చని రిపోర్ట్‌‌లు చెబుతున్నాయి. 430 బిలియన్ డాలర్ల ఫారెక్స్ రిజర్వ్‌‌లున్న ఇండియా.. పెరుగుతున్న ధరలను తట్టుకుని మెరుగ్గానే నిలబడగలదని పేర్కొంటున్నాయి.

ఇండియన్ రిఫైనరీలు సుమారు 60 రోజులకు సరిపడా స్టాక్‌‌ను స్టోర్ చేస్తున్నాయి. ఒకవేళ సప్లయిలో అవాంతరాలు వస్తే..  ఇండియా ఈ స్టోరేజ్ కెపాసిటీతో నిలదొక్కుకోగలదని రిపోర్ట్‌‌లు పేర్కొన్నాయి. ఇండియాలో మొత్తం 5.33 మిలియన్ టన్నుల క్రూడాయిల్‌‌ను స్టోర్ చేసేందుకు మూడు స్టోరేజ్ సౌకర్యాలున్నాయి. విశాఖపట్నంలో ఉన్న ఒకటి ఇప్పటికే 1.33 మిలియన్ టన్నులతో ఫుల్ అయి ఉంది. మంగళూరులో ఉన్న 1.50 మిలియన్ టన్నుల కెపాసిటీకి డీల్ కుదిరింది. కర్నాటకలోని పదూర్‌‌‌‌లో 2.5 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉంది. మొత్తం 5.33 మిలియన్ టన్నుల స్టోరేజ్ కెపాసిటీలో 55 శాతం ఇప్పటికే ఆయిల్‌‌తో ఫిల్ అయి పోయింది. మరో 6.5 మిలియన్ టన్నుల ఫెసిలిటీస్‌‌ను ఒడిశాలోని ఛండిఖోల్‌‌, పదూర్‌‌‌‌లో కట్టడానికి ప్రభుత్వం చూస్తోంది.

ఈ స్టోరేజ్‌‌ ఫెసిలిటీస్‌‌లో క్రూడాయిల్‌‌ను నింపడానికి ఫారిన్ ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వం గతేడాదే ఒప్పందం కుదుర్చుకుంది. ఆయిల్‌‌ స్టోర్‌‌‌‌ చేయడానికి ఫారిన్ కంపెనీలకు అనుమతి ఇవ్వడంతో, కేంద్రం రూ.10 వేల కోట్లు సేవ్ చేస్తోంది. అంటే పెరుగుతోన్న ధరల ప్రభావం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆయిల్ ఇంపోర్టర్ అయిన ఇండియాపై అంత పెద్ద ప్రభావం చూపదని తెలుస్తోంది.

కీ పాయింట్స్‌‌‌‌…

సౌదీపై డ్రోన్ అటాక్స్ తర్వాత క్రూడాయిల్ రేట్లు సుమారు 20 శాతం పెరిగాయి. ఇండియా ఆయిల్ అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. ప్రభుత్వ రంగ ఫ్యూయల్ రిటైలర్లు  ఇంటర్నేషనల్‌‌‌‌ ఆయిల్​ ధరలు, ఫారెక్స్​ రేట్ల ప్రకారం ఇండియాలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను నిర్ణయిస్తారు. ప్రస్తుతం మన దగ్గర 2 నెలలకు సరిపడా ఆయిల్​ నిల్వలు ఉన్నాయి. ఇంటర్నేషనల్‌‌‌‌ పరిణామాలను పరిశీలిస్తున్నామని ఆయిల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.ధరలు పెరగడం తమకు ఆందోళనకరంగానే ఉందన్నారు.

వచ్చే నెలలోనే మహారాష్ట్ర, జార్ఖాండ్, హర్యానా రాష్ట్రాలకు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం  ప్రభుత్వానికి రాజకీయంగా రిస్క్‌‌‌‌. అందువల్ల ఎన్నికలు పూర్తయ్యేవరకు పెట్రోల్​ రేట్లు పెంచకపోవచ్చు.