30 వేల ఎకరాల్లో యాసంగి సాగు.. ఈ నెల 31 వరకే జూరాల నీరు

30 వేల ఎకరాల్లో యాసంగి సాగు.. ఈ నెల 31 వరకే జూరాల నీరు

వనపర్తి, వెలుగు:    జిల్లాలోని జూరాల, భీమా ప్రాజెక్టుల కింద యాసంగిలో రైతులు సాగు చేసిన పంటలకు వారానికి ఒక తడి కూడా అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల, చిన్నంబావి, పానగల్ మండలాల్లో 30 వేల ఎకరాల్లో రైతులు యాసంగి పంటలను సాగు చేసుకున్నారు. ఆయకట్టు భూములకు కాలువల ద్వారా సాగునీటిని రెగ్యులర్​గా అందించాల్సి ఉన్నా, నీటి కొరత కారణంగా వారానికి ఒక తడి చొప్పున వారబందీ చేశారు. మరోవైపు జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతుండడంతో ఈ నెల 31 వరకే సాగు నీటిని అందించనున్నారు. ఆ తరువాత కేవలం తాగునీటి పథకాల కోసం నీటిని నిల్వ చేస్తారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఉమ్మడి జిల్లా తాగు నీటి అవసరాలకు జూరాల నీరు అత్యవసరం కానుంది. దీంతో జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల నిలిపేయనున్నారు. ఏప్రిల్  15 వరకు కాలువ నీళ్లు వస్తేనే పంటలు పండుతాయని, లేదంటే దిగుబడి పూర్తి గా పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

భూగర్భజలాలు అడుగంటినయ్..

గోపన్ దిన్నె రిజర్వాయర్ తో పాటు బీమా ఫేస్ 2,  జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా  వచ్చే నీటితో యాసంగి పంటలు సాగు చేస్తున్న రైతులు, పంట చివర్లో బావులు, బోర్ల ద్వారా నీరు పారించుకోవచ్చని భావించారు. ఇటీవల ఎండలు ముదరడంతో భూగర్భ జలాలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో పంటలు సరిగా పారడం లేదని రైతులు అంటున్నారు.

కాలువలు సరిగా లేకనే..

కాలువలు సరిగా లేకపోవడంతో బీమా ప్రాజెక్టు నీళ్లు చివరి ఆయకట్టుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. భీమా ఫేస్–2లో 1.09 లక్షల ఎకరాలకు నీరందాలి. అయితే ప్రాజెక్టు నిర్వహణ సరిగా లేక 50 వేల ఎకరాలకు కూడా సాగునీరు సరిగా అందడం లేదు. కాలువల రిపేర్లు లేక నీరు ముందుకు సాగటం లేదు. భీమా ఆయకట్టు రైతులు మినప, మొక్కజొన్న, జొన్న, పెసర పంటలను సాగు చేసుకున్నారు. మరికొద్ది చోట్ల కూరగాయలు, మామిడి తోటలకు ఈ నీళ్లే అందిస్తున్నారు. ఈ పంటలన్నీ ప్రస్తుతం సాగునీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి ఉంది. చిన్నంబావి మండలంలోని తూముకుంట, కొండేరు, బొల్లారం, వీపనగండ్ల, గోవర్ధనగిరి, గోపన్ దిన్నె, బెక్యెం, మియాపూర్, వెలగొండ, పెద్దదగడ, చిన్నదగడ, కొప్పునూరు, వెల్టూరు, అయ్యవారిపల్లి, చిన్నమర్రు, పెద్దమర్రు, సంగినేనిపల్లి, కొల్లూరు, వెల్టూరు తదితర గ్రామాల్లో సాగునీరు అందక రైతులు తిప్పలు పడుతున్నారు.

పంటలు ఎండకుండా చూడాలి

ఎండలు ముదరడంతో చివరి ఆయకట్టు భూములకు ఎక్కువ నీళ్లు అవసరమవుతున్నాయి. మరో నెల రోజులు నీరు అందిస్తేనే పంటలు చేతికొస్తాయి. జూరాల, భీమా ప్రాజెక్టుల ద్వారా నిరంతరం నీరు అందించి పంటలను కాపాడాలి.

–నర్సింహారెడ్డి, సర్పంచ్, వీపనగండ్ల

జూరాలలో నీళ్లు తగ్గడంతోనే..

జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతుండడంతో ఈ నెల 31వరకే సాగునీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు సూచించాం. జూరాల నుంచి తాగునీటి అవసరాలకు నీళ్లను తీసుకుంటున్న దృష్ట్యా నీటి విడుదలపై ఆంక్షలు విధించారు. పంటలు ఎండకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

- జగన్మోహన్ రెడ్డి, ఈఈ, జూరాల ప్రాజెక్ట్