తెలంగాణ కొత్త డీజీపీగా 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. 2026 మే 1వ తేదీ (శుక్రవారం) హైదరాబాద్ లక్డీకాపూల్ లో ఉన్న స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉదయం 11.05 గంటలకు అధికారులు, కుటుంబ సభ్యుల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఏప్రిల్ 30న శివధర్ రెడ్డి పదవీ విరమణ తర్వాత సీవీ ఆనంద్ కొత్త డీజీపీగా బాధ్యతలు తీసుకున్నారు.
తెలంగాణ స్థానికుడు, రాష్ట్ర పోలీస్ కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ తన కెరీర్ తొలినాళ్లలో పలు జిల్లాల్లో ఎస్పీగా విజయవాడ, సైబరాబాద్ , హైదరాబాద్ వంటి కీలక పోలీస్ కమిషనరేట్లకు కమిషనర్‌గా, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా, ఏసీబీ డీజీగా, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
పనిచేసిన ప్రతి చోటా తనదైన ముద్రవేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర డీజీపీగా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నూతన పోలీసింగ్ నిర్వహిస్తారని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
