తెలంగాణలో సీడబ్ల్యూసీ.. కీలక మార్పులకు వేదిక

తెలంగాణలో సీడబ్ల్యూసీ.. కీలక మార్పులకు వేదిక

హైదరాబాద్​లో మొదటిసారి జరుగుతున్న కాంగ్రెస్​వర్కింగ్​ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు మూలం కానుంది. అప్రజాస్వామిక రాజకీయాలకు అంతంపలికే భూమిక పోషించబోతున్నది. ఈ సమావేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ, మతసామరస్యం, ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, ఫెడరలిజం తదితర అంశాలపై ప్రధానంగా చర్చ ఉంటుంది. బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ విధానాలు దేశంలో రాజకీయ వ్యవస్థనే కలుషితం చేస్తున్నాయి. ఫెడరల్​స్ఫూర్తికి భిన్నంగా ప్రభుత్వాలను కూల్చడం, ప్రాంతీయ పార్టీల అస్థిత్వం దెబ్బతీయడం, వాటిని లొంగదీసుకొని రాజరికాన్ని తలపించే సామ్రాజ్యవాద దృక్పథంతో ముందుకు పోవడం.. ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం.

75 ఏండ్ల స్వతంత్ర భారతం ‘రాజదండంను’ ఆశ్రయించింది. సెంగోల్​తో దేశంలో అధికార మార్పిడి ప్రజాస్వామ్యానికి బదులుగా రాజరికానికి మార్చినట్లుగా అర్థం చేసుకోవాలి. ప్రెసిడెన్షియల్ ​ఫామ్​ఆఫ్​డెమోక్రసీ మీదనే మక్కువ ఉన్న బీజేపీ క్రమంగా రాజరిక దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నది. ఇండియా దటీజ్​ భారత్​గా రాజ్యాంగంలో పొందుపరిచిన దేశాన్ని  ‘‘భారత్’గా మార్చడం అని ప్రగల్భాలు చెప్పుకోవడం విడ్డూరంగా కనిపించినా అది ఆర్ఎస్ఎస్​ఎత్తుగడగా భావించాలి. భరతుడు పాలించిన ప్రాంతం కాబట్టి భారత దేశం. అందుకే సనాతన మూలాలున్న ‘భారత్’ అనే పదాన్ని రాజ్యాంగబద్ధం చేసుకున్నాయి. కానీ ‘ఇండియా’ కూటమి ఇండియా అనే పేరు పెట్టుకుంది కాబట్టి ఇండియా అనేది ఇంగ్లీష్​వాళ్లు పెట్టిన పేరు అని ఇండియాను ఇవాళ భారత్​ను చేస్తున్నారు. చివరకు దేశాన్ని కూడా 
విభజిస్తున్నారు.

రాజకీయ స్వార్థం కోసమే..

ఇండస్​వ్యాలీ సివిలైజేషన్ గా, సింధు లోయ నాగరికత, హిందూ నాగరికతగా, హిందూస్థాన్​గా కూడా పిలిచే దేశాన్ని ‘భారత్’గా మాత్రమే పిలువాలని అంటున్నారు. రాముడు పాలించిన రాజ్యం.. రామ రాజ్యం అన్నారు. హిందువులు జీవించే ప్రాంతం హిందూస్థాన్​ అన్నారు. అన్నీ మరిచి చివరకు ఇండియా కూటమిని వ్యతిరేకించడానికి, రాజకీయ స్వార్థం కోసమే ‘భారత్’ అని అంటున్నారు. అయోధ్య, సెంగోల్, భారత్​తో దేశంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని భావించిన బీజేపీ ప్రజలు సంయమనంతో ఉండటాన్ని చూసి భరించలేకపోతున్నది.

అందుకే జమిలి, వన్​ నేషన్​ వన్​ ఎలక్షన్, మినీ జమిలి అంటూ కొత్త రాగం ఎంచుకున్నది. దానికి ఎన్​డీఏ పక్షాలు, ఎన్​డీఏ రహస్య మిత్రపక్షాలైన టీ(బీ)ఆర్ఎస్​ లాంటి పార్టీలు మద్దతునిస్తున్నాయి. దేశంలో ప్రజలు కోరుకునే ఏ అంశాన్ని పట్టించుకోని ప్రభుత్వం వాళ్ల రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తుంది. 9 ఏండ్ల పాలనలో ఏరోజూ పట్టించుకోని ఓబీసీ బిల్లు, మహిళా రిజర్వేషన్​బిల్లు తీసుకొస్తామని ప్రచారం చేసుకుంటున్నది. కనీసం తన పాలనాసమయంలో ఓబీసీ జన గణన కూడా చేయలేకపోయింది. ఇలాంటి కీలక సందర్భంలో సీడబ్ల్యూసీ నూతన సమావేశం తెలంగాణలో జరుగుతున్నది. బీజేపీకి కూడా తెలంగాణ ఎన్నికలు కీలకం కాబట్టి అంతర్గతంగా బీఆర్ఎస్ కు​మద్దతిస్తూ జమిలి ఎన్నికలకు గ్రీన్​ సిగ్నల్​ఇచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తేవాలని చూస్తున్నది. పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న బీఆర్ఎస్​ ప్రభుత్వాన్ని కాపాడేందుకు జమిలి రూపంలో ఊరట కల్పించాలని తద్వారా తెలంగాణతోపాటు చత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో కాంగ్రెస్​ అనుకూలతను దెబ్బతీయాలని చూస్తున్నది.

ALSO READ: ప్రాంతీయ పార్టీల అవినీతి మరకలు

తెలంగాణలో మొదటిసారి..

కర్నాటక ఎన్నికల్లో అంతా తానై పని చేసినా మోదీకి కలిసి రాకపోవడం వల్ల ఇక ఇతర రాష్ట్రాల ఎన్నికలైనా, జాతీయ ఎన్నికలైనా మోడీ మ్యాజిక్​పనికి రాదనుకుందో ఏమో కానీ జమిలి, భారత్, మహిళ, బీసీ నినాదాలతో హోరెత్తించి 2024 గండం గట్టెక్కాలని బీజేపీ చూస్తున్నది. ఒకదానికి ఒకటి పొంతనలేని ఆలోచనలతో దేశాన్ని అధో:గతిపాలు చేయాలని చూస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్ డీఏ పాలనకు చరమగీతం పాడే దిశగా సీడబ్ల్యూసీ కార్యాచరణ ఉంటుంది.

ఇండియా కూటమి బలోపేతం ప్రధాన లక్ష్యంగా సాగుతూ దేశ ప్రధాన సమస్యలను ఈ సమావేశం స్పృశిస్తుంది. తెలంగాణ గడ్డమీదమొదటిసారిగా జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశం తెలంగాణ కాంగ్రెస్​ పార్టీకి కొత్త జవసత్వాలు ఇస్తుంది. సమావేశం తర్వాత జరిగే బహిరంగ సభలో తెలంగాణ తల్లిగా భావించే సోనియా గాంధీ స్వయంగా 5 గ్యారంటీ పథకాలు ప్రకటంచి తెలంగాణ ప్రజల్లో భరోసా నింపుతారు.. ఇచ్చిన మాట తప్పకుండా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ,​ సోనియా గాంధీ రుణం తెలంగాణ ప్రజలు తీర్చుకుంటారు. 

ఉన్నపలంగా బీఆర్ఎస్​‑బీజేపీ వైరం పెరగొచ్చు!

బీజేపీకి రహస్య బినామీగా ఉన్న బీఆర్ఎస్ ను తుక్కుగూడ నుంచే తుక్కుతుక్కు చేసే ప్రణాళిక టీకాంగ్రెస్​ నాయకత్వం రూపకల్పన చేసింది. బీజేపీకి దన్నుగా నిలబడుతున్న బీఆర్ఎస్​కు, వైఎస్సార్​సీపీకి కూడా ఒక సవాల్​గా సీడబ్ల్యూసీ సమావేశం కానుంది. పేరుకు ప్రత్యక్ష పొత్తు లేదు గానీ సామంతుల కంటే ఎక్కువగా వ్యవహరించడం దక్షిణాదిలో ప్రత్యేకించి తెలుగు రాజకీయాల్లో ప్రజలకు నచ్చట్లేదు. ప్రాంతీయ పార్టీలను అణగదొక్కే వాటిని లొంగదీసుకొని బీజేపీ ఆయా రాష్ట్రాల్లో పరోక్షంగా పాలన సాగిస్తున్నది. అక్కడ మళ్లీ తానే ప్రతిపక్షంగా వ్యవహరించాలని చూస్తున్నది. అలాంటి ప్రాంతంలో తెలంగాణ ఒకటి. ఇక్కడ వీరిద్దరి వైరం విచిత్రంగా ఉన్నది. మళ్లీ ఈ మధ్య లిక్కర్​కేసు తెరమీదకు రావడం చూస్తుంటే.. కవిత అరెస్టు ఉండొచ్చనే అనుమానమూ కలుగుతున్నది. ఉన్నపలంగా బీజేపీ– బీఆర్ఎస్​వైరం పెరగొచ్చు. ఎంఐఎం పార్టీ మత వైరుధ్యాలు పెంచవచ్చు.

బీజేపీని పెంచడానికి నిజాం–రజాకర్​అంశాలు రావొచ్చు. ఏది ఏమైనా ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పొలిటికల్​డ్రామాలు చూస్తూనే ఉన్నారు. ఒకవైపు దేశంలో జరుగుతున్న రాజకీయ అస్తవ్యస్తం మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ డ్రామాలకు రేపటి సీడబ్ల్యూసీ సమావేశం తెరవేస్తుంది. అమృత్​కాలంలో జరుగుతున్న సీడబ్ల్యూసీ మళ్లీ ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, ఇండియాను సంరక్షించుకోవడానికి భవిష్యత్​ కార్యాచరణ తీసుకుంటుందని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. 

 

- డా. అద్దంకి దయాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీపీసీసీ