సిద్దిపేట జిల్లాలో పెరుగుతున్న సైబర్​ నేరాలు

సిద్దిపేట జిల్లాలో పెరుగుతున్న సైబర్​ నేరాలు
  • 14 నెలల్లో 237 కేసులు నమోదు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో సైబర్​ నేరాలు పెరుగుతున్నాయి. గతంలో మాదిరి పబ్లిక్​ పిన్​ నంబర్లు, ఓటీపీలు బయటకు చెప్పడం లేదు. దీంతో నేరగాళ్లు కొత్తతరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్​లైన్​లో జాబ్​ల కోసం, యాప్​ల కోసం, వస్తువుల కోసం సెర్చ్​ చేసేటప్పుడు ఫిషింగ్(నకిలీ)​ వెబ్​సైట్ల ద్వారా దోచుకుంటున్నారు.  ఆన్​లైన్​ ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీ, హానీట్రాప్​లతోనూ అమాయకుల అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. 

ఒకే రోజు  నేరగాళ్ల చేతికి 3.09 లక్షలు..

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం ఒక్క రోజే ఐదుగురు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి  రూ. 3.09 లక్షలు పోగొట్టుకున్నారు.  గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని ఓ వ్యక్తికి బిట్​కాయిన్​  ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టాలంటూ గుర్తు తెలియని నంబర్​ నుంచి  వాట్సాప్ మెసేజ్​ వచ్చింది. తర్వాత సైబర్​ నేరగాడు రంగంలోకి దిగి మాటల్లో దించాడు. అతడి సూచన మేరకు పెట్టుబడి కింద  రూ. 1,45,000 చెల్లించాడు. తర్వాత ఫోన్​ చేస్తే స్విచ్ఛాఫ్​ వచ్చింది.  చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వ్యక్తి ఇన్​స్టాగ్రామ్​లో ఓ  పోస్ట్ చూసి పార్ట్ టైమ్ జాబ్ కోసం వెబ్​సైట్​లో పేరు నమోదు చేసుకున్నాడు. టాస్కుల కోసం ముందుగా డబ్బు కట్టాలని, తర్వాత కమిషన్ తో పాటు డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చని చెప్పడంతో రూ.86,256 డిపాజిట్ చేశాడు.  కానీ టాస్క్ లు  అయిపోయినా డబ్బు రాకపోవడంతో మోసపోయాడు. సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి  క్రిప్టో ట్రేడ్ కోసం మొదట రూ.5వేలు,  సెక్యూరిటీ డిపాజిట్  కోసంరూ. 15వేలు గుంజారు. అప్పటికే రూ.53,500 ఇవ్వడం, అదే పనిగా  డబ్బులు  అడుగుతుండడంతో మోసపోయానని గ్రహించాడు. సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని ఓ వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తి  కాల్ చేసి, ‘మేము  అజియో కంపెనీ నుంచి  ఫోన్  చేస్తున్నాం.. ఎంపిక చేసిన వ్యక్తులకు  ఆఫర్లు ఇస్తున్నాం.. మీరు రూ. 6135 పంపితే  మేము 50వేలతో పాటు ఆఫర్ కింద  డెల్ కంపెనీ  ల్యాప్​టాప్​, ఐ ఫోన్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు.  కానీ పైసలు పంపాక ఎవరూ రెస్పాండ్​ కాలేదు.  తొగుట పోలీస్ స్టేషన్ పరిధిలో ని ఒక వ్యక్తికి   లింకప్​ పంపి,  అందులో డబ్బును  జమ చేస్తే కమిషన్ వస్తుందని చెప్పగా రూ.18,420 చెల్లించి మోసపోయాడు. ఈ నెల 3న సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో  ఒకే రోజు నలుగురు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి రూ. 1.90 లక్షలు పోగొట్టుకున్నారు. 

14 నెలల్లో 237 కేసులు.. 

గడిచిన 14 నెలల్లో  సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో 237 సైబర్ కేసులు నమోదు కాగా, వాటిలో 125 కేసుల్లో  రూ.25 లక్షలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇవన్నీ పోలీసుల దృష్టికి వచ్చినవి మాత్రమే. సైబర్​నేరగాళ్ల చేతుల్లో మోసపోయి, బయటకు చెప్పుకోలేనివాళ్లు చాలా మంది ఉంటున్నారు. 

1930 నంబర్​కు కాల్​చేయాలి

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయామని తెలిసిన వెంటనే 1930కి కాల్​ చేయాలి. దీంతో అకౌంట్లలోని పైసలు ఫ్రీజ్  చేసే అవకాశం ఉంటుంది. సైబర్ నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నా కొందరు అమాయకంగా నమ్మి పైసలు పోగొట్టుకుంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు  ఫోన్ చేస్తే వారికి ఎలాంటి సమాచారం ఇవ్వరాదు. 

- ఎన్. శ్వేత,  పోలీస్​ కమిషనర్​, సిద్దిపేట

  •  సిద్దిపేటకు చెందిన తరుణ్ తేజ్ వాట్సాప్ కు కొత్త నంబర్​నుంచి మెసేజ్​వచ్చింది. పార్ట్ టైం జాబ్ ఉందని, టెలిగ్రామ్ ద్వారా ఇన్వెస్ట్​ చేస్తే పెద్ద మొత్తంలో కమిషన్ వస్తుందని అందులో ఉంది. పార్ట్ టైం జాబ్ తో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఆశపడిన తరుణ్​ తేజ్ రిజిస్ట్రేషన్​ చేసుకొని కొంత మొత్తం ఇన్వెస్ట్​ చేశాడు. ఆ వెంటనే ఆయన అకౌంట్  నుంచి ఏకంగా 9లక్షల76వేల240  డబ్బులు డెబిట్​ అయ్యాయి.  మోసపోయానని  గ్రహించిన తరుణ్​ తేజ్   వెంటనే  నేషనల్​ హెల్ప్ లైన్ నెంబర్  1930 నెంబర్ కు ఫిర్యాదు చేయగా, ఆ మొత్తాన్ని ఫ్రీజ్​చేయగలిగారు.
  • మర్కుక్ గ్రామానికి చెందిన సార నర్సయ్యకు కొత్త నంబర్​నుంచి ఫోన్​ వచ్చింది. ఆన్​లైన్​లో ఓ కంపెనీ ఫోన్  డిస్కౌంట్ లో దొరుకుతుందని  సైబర్ నేరగాడు చెప్పిన మాటలు నమ్మి  అతడు పంపించిన ఫోన్ నెంబర్ కు  31,678 రూపాయలను ఫోన్​పే చేశాడు. తర్వాత ఫోన్ డెలివరీ గురించి ఆరా తీయడానికి ఫోన్​ చేస్తే   స్విచ్ ఆఫ్  వచ్చింది . తాను మోసపోయాననే అనుమానంతో సార నర్సయ్య  వెంటనే నేషనల్​ హెల్ప్ లైన్ నెంబర్  1930 కి  ఫిర్యాదు చెయ్యగానే వారు  స్పందించి  రూ.4780  ఫ్రీజ్​చేశారు. 
  • సిద్దిపేట పట్టణానికి  చెందిన సీ హెచ్ దినేష్ అనే వ్యక్తి  ఆన్ లైన్​లో లోన్ యాప్ గురించి సెర్చ్ చేయగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అతడి సూచన మేరకు   ధని లోన్ యాప్ కు దినేష్​  ప్రాసెస్ చార్జెస్ కింద రూ. 5320  ఫోన్ పే చేశాడు. తర్వాత ఆ నెంబర్​కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో  అనుమానం వచ్చిన దినేష్​  నేషనల్​హెల్ప్ లైన్ నెంబర్  1930 నెంబర్ కు ఫోన్ చేసి  ఫిర్యాదు చెయ్యగానే వారు వెంటనే స్పందించి  రూ.5320  ఫ్రీజ్​చేశారు.