
హనుమకొండ, వెలుగు: ఎస్ బీఐ క్రెడిట్ కార్డు ఆఫీసర్ నంటూ కాల్స్ చేసి అమాయకుల అకౌంట్లు ఖాళీ చేస్తున్న సైబర్ నేరస్తుడికి హనుమకొండ థర్డ్ అడిషనల్ కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. వరంగల్ సైబర్ క్రైమ్స్ డీఎస్పీ కలకోట గిరి కుమార్ తెలిపిన ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రం జామ్ తారా జిల్లా కేంద్రానికి చెందిన బిదూర్ మహతో సైబర్ నేరాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందట కేయూ పీఎస్ పరిధిలో ఉండే అర్చన అనే యువతికి కాల్ చేసి ఎస్ బీఐ క్రెడిట్ కార్డుకు సంబంధించిన ఆఫీసర్ నంటూ పరిచయం చేసుకున్నాడు.
అనంతరం ఓటీపీ ద్వారా ఆమె అకౌంట్ నుంచి రూ.63,837 కొల్లగొట్టాడు. దీంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేయూ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం జామ్ తారాలో ఉన్న నిందితుడు బిదూర్ మహతోను గుర్తించి, పీటీ వారెంట్ పై ఇక్కడికి తీసుకొచ్చారు. బుధవారం హనుమకొండ థర్డ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా.. నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు.