ప్రీపెయిడ్ టాస్క్ల పేరిట ఫ్రాడ్.. రూ.2.80 లక్షలు కొట్టేసిన సైబర్ చీటర్స్

ప్రీపెయిడ్ టాస్క్ల పేరిట ఫ్రాడ్.. రూ.2.80 లక్షలు కొట్టేసిన సైబర్ చీటర్స్

బషీర్​బాగ్, వెలుగు: ప్రీపెయిడ్ టాస్క్ ల పేరిట ఓ ప్రైవేటు ఉద్యోగిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన  ప్రకారం.. సిటీకి చెందిన 29 ఏండ్ల వ్యక్తి నంబర్ ను స్కామర్స్ ఓ టెలిగ్రామ్ గ్రూపులో యాడ్ చేశారు. ఇందులో ఓ ఇద్దరు అడ్మిన్ లుగా వ్యవహరిస్తూ గ్రూపులో టాస్క్ లు ఎలా పూర్తి చేయాలి? రివార్టులు ఎలా పొందాలని వివరిస్తూ మెసేజ్ లు పోస్టు చేశారు. 

అనంతరం బాధితుడి నంబర్ ను మరో గ్రూపులో యాడ్ చేసి , టాస్క్ లను యూపీఐ ద్వారానే చేయాలని సూచించారు. గ్రూపులోని సభ్యులు టాస్క్ లను పూర్తి చేసి , లాభాలు వస్తున్నట్లు స్క్రీన్ షాట్స్ పంచుకోవడంతో బాధితుడికి నమ్మకం కలిగి, ప్రీపెయిడ్ టాస్క్ లను డబ్బులు చెల్లించి పూర్తి చేశాడు. అయినా లాభాలు చెల్లించకపోవడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. 

ఆ తర్వాత స్కామర్స్ పెద్ద మొత్తంలో చెల్లించి, టాస్క్ పూర్తి చేయాలని ఒత్తిడి చేశారు. ప్రీపెయిడ్ టాస్క్ లు మధ్యలో వదిలేస్తే ఇప్పటివరకు చేసిన పెట్టుబడి కోల్పోతారని బెదిరించారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు మొత్తం రూ.2.80 లక్షలు పోగొట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్​లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.