
- గుజరాత్‌లోని అంకలేశ్వర్ వద్ద పట్టుకున్న పోలీసులు
- సహకరించిన ముగ్గురు, మరో నిందితుడు పరారీలోనే..
- వివరాలు వెల్లడించిన సీపీ అవినాష్ మహంతి
గచ్చిబౌలి, వెలుగు: చందానగర్ ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. తాజాగా మరో ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీరి నుంచి 1,915 గ్రాముల బంగారు పూత ఉన్న వెండి ఆభరణాలు, ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్కమిషనరేట్లో మాదాపూర్ డీసీపీ డా. వినీత్‌తో కలిసి సీపీ అవినాష్ మహంతి శనివారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 12న ఆరుగురు వ్యక్తులు ముఖాలకు మాస్కులు ధరించి చందానగర్ గంగారంలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న ఖజానా జ్యువెలరీలోకి చొరబడ్డారు.
కత్తులతో జ్యువెలరీ సిబ్బందిని బెదిరించారు. బంగారు ఆభరణాలు ఉన్న లాకర్ కీ ఇవ్వాలని డిప్యూటీ మేనేజర్సతీశ్కుమార్పై కాల్పులు జరిపారు. అనంతరం డిస్ప్లేలలో ఉన్న 10 కేజీల బంగారు పూత పూసి ఉన్న వెండి ఆభరణాలను తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో నింపుకొని అక్కడి రెండు బైకులపై పటాన్‌చెరు వైపు పరారయ్యారు. ఈ దోపిడీపై చందానగర్ పోలీసులు 12 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి.. మహరాష్ట్ర, కర్నాటక, బీహార్ రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలించారు.
ఈ నెల 15న పుణెలోని జెజురి ప్రాంతంలో అశీశ్కుమార్సింగ్, దీపక్ కుమార్‌షాను అదుపులోకి తీసుకున్నారు. 19న పుణెలోని పింప్రి వద్ద అనిశ్కుమార్సింగ్, ప్రిన్స్కుమార్రజాక్అరెస్ట్ చేశారు. తాజాగా శనివారం ఈ దోపిడీ కేసులో ప్రధాన నిందితులు ప్రిన్స్ కుమార్‌భారతి, రోహిత్కుమార్రజాక్ను గుజరాత్‌లోని
అంకలేశ్వర్ ప్రాంతంలో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మూడు గంటల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేశారు..
దోపిడీ తర్వాత ఆరుగురు నిందితులు రెండు బైక్‌లపై పటాన్‌చెరు వైపు పారిపోయి, మూడు గంటల్లోనే రాష్ట్ర సరిహద్దులు దాటేసినట్లు సీపీ తెలిపారు. ఒక బైక్‌ను బీదర్‌లో, మరొకటి పుణెలో వదిలేసి వేర్వేరుగా పరారయ్యారు. ఈ దోపిడీకి ప్రిన్స్ కుమార్ భారతి స్కెచ్ వేశాడు. ప్రిన్స్ఇప్పటికే ఆర్మ్స్ యాక్ట్, దోపిడీ, ఎన్‌డీపీఎస్ కేసుల్లో నిందితుడిగా ఉండగా, రెండు కేసుల్లో పరారీలో ఉన్నాడు. రోహిత్ కుమార్ రజాక్ బీహార్‌లో ఆర్మ్స్ యాక్ట్, దోపిడీ కేసుల్లో నిందితుడు ఉన్నారు. వీరిద్దరిని నుంచి త్వరలోనే గన్స్, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుంటామని సీపీ తెలిపారు. ఈ దోపిడిలో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరికి సహకరించిన మరో ముగ్గురిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు.