పోలీస్ స్టేషన్లలో అటకెక్కుతున్న సైబర్ క్రైమ్ కేసులు

పోలీస్ స్టేషన్లలో అటకెక్కుతున్న సైబర్ క్రైమ్ కేసులు
  • 3  నెలలుగా బందోబస్తులకే పరిమితమైన పోలీసులు
  • ఇతర రాష్ట్రాలకు వెళ్లలేకపోతుండటంతో ఇన్వెస్టిగేషన్‌‌‌‌కు బ్రేక్‌‌‌‌
  • గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో ఈ ఏడాది 8 వేలకు పైగా కేసులు నమోదు

హైదరాబాద్‌‌‌‌,వెలుగు: సైబర్ క్రైమ్ కేసుల్లో పోలీసుల దర్యాప్తు పడకేసింది. ప్రతి రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నా దర్యాప్తుపై అడుగు ముందుకు పడటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సైబర్‌‌‌‌‌‌‌‌క్రైమ్‌‌‌‌ పీఎస్‌‌‌‌లతో పాటు లా అండ్‌‌‌‌ ఆర్డర్ పోలీస్‌‌‌‌స్టేషన్లలో ఏర్పాటు చేసిన సైబర్ సెల్‌‌‌‌లో కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌ వచ్చిన నాటి నుంచి సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాల ఇన్వెస్టిగేషన్‌‌‌‌కు బ్రేక్‌‌‌‌ పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు తీసుకుంటున్నారే తప్ప కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్‌‌‌‌స్టేషన్లలోనూ ఇదే  పరిస్థితి నెలకొంది.

సైబర్ నేరాల్లో సిటీ సెకండ్ ప్లేస్..

సైబర్ నేరాల్లో దేశంలోనే హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో గతేడాది 9,148 కేసులు రిజిస్టర్ అయ్యాయి. వీటిలో కేవలం10 శాతం కేసులు మాత్రమే పోలీసులు ట్రేస్ చేశారు. సైబరాబాద్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌లో అత్యధికంగా 4,850 కేసులు నమోదయ్యాయి. ఇదే తరహాలో ఈ ఏడాది కూడా 3 కమిషనరేట్ల పరిధిలో భారీ సంఖ్యలో సైబర్ నేరాలు రిజిస్టర్ అవుతున్నాయి. ప్రధానంగా వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌హోమ్, ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ఫ్రాడ్స్‌‌‌‌తో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ అడ్డాగా దోపిడీలు పెరిగిపోయాయి. ఎస్‌‌‌‌ఎమ్‌‌‌‌ఎస్‌‌‌‌ల ద్వారా లింక్స్‌‌‌‌ పంపించి సైబర్ నేరగాళ్లు అందినంత దోచేస్తున్నారు. బాధితులు అలర్ట్ అయ్యేలోగా రూ.లక్షలు కొట్టేస్తున్నారు.

లా అండ్ ఆర్డర్ పోలీసులకు టెక్నికల్ స్కిల్స్‌‌‌‌ కొరత

ఈ ఏడాది మూడు కమిషనరేట్ల పరిధిలో  దాదాపు 8 వేలకు పైగా కేసులు రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. రూ.లక్ష లోపు నమోదవుతున్న కేసులను సైబర్ క్రైమ్ పోలీసులు కాకుండా లా అండ్ ఆర్డర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, సైబర్ క్రైమ్ పోలీసులతో పోలిస్తే లా అండ్ ఆర్డర్ పోలీసులకు బందోబస్తులు, సాధారణ నేరాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతుంటాయి. ఈ క్రమంలో పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌కు వచ్చే సైబర్ నేరాల దర్యాప్తును పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో పాటు లా అండర్‌‌‌‌ ‌‌‌‌ఆర్డర్ పోలీసులకు టెక్నికల్‌‌‌‌ స్కిల్స్‌‌‌‌ తక్కువగా ఉండడం ఇన్వెస్టిగేషన్‌‌‌‌లో సవాల్‌‌‌‌గా మారింది.

పది కేసులుంటేనే దర్యాప్తు

లా అండ్ ఆర్డర్ పోలీసులకు అంతర్రాష్ట ముఠాలను గుర్తించి పట్టుకోవడం సాధ్యం కావడం లేదు. ఇతర రాష్ట్రాల్లో ఉండే వారిని అరెస్ట్ చేయాలన్నా కనీసం వారం రోజుల సమయం పడుతోంది. ఎస్‌‌‌‌ఐ సహా దాదాపు ఐదుగురు కానిస్టేబుల్స్‌‌‌‌ ఆయా రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కేసుల్లో పోలీసుల ట్రావెలింగ్‌‌‌‌, షెల్టర్ సహా ఇతర సదుపాయాల కోసం భారీగా ఖర్చవుతోంది. దీంతో ఒకే రాష్ట్రంలోని నేరగాళ్లతో లింకైన సుమారు 10 కేసులు ఉంటే తప్ప ఇన్వెస్టిగేషన్‌‌‌‌ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే మిగతా కేసుల దర్యాప్తులోనూ ఆలస్యం జరుగుతోంది.