ఐటీ అడ్డాలో పని కరువు…

ఐటీ అడ్డాలో పని కరువు…

కర్ణాటకలోని బెంగళూరు.. దేశవ్యాప్తంగా వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న ఐటీ సిటీ. కానీ అక్కడ డైలీ లేబర్ల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. వారికి తగినంత పని దొరకడం లేదు. నెల రోజుల్లో కనీసం పది రోజులు కూడా కూలీ దొరకని పరిస్థితి. డీ మానిటైజేషన్ తర్వాతే ఇలా మారిందని వారు తమ గోడు చెప్పుకుంటున్నారు. బెంగళూరులో ఇన్ఫార్మల్ సెక్టార్ కార్మికుల పరిస్థితులపై ‘ఇండియా స్పెండ్’ ఓ రిపోర్టు ప్రచురించింది.

కురుబరహళ్లి.. కూలీల అడ్డా

బెంగళూరులోని కురుబరహళ్లి కూలీల అడ్డాగా పేరు పొందింది. చిన్న రోడ్లు, భారీ ట్రఫిక్ తో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఉదయం 7.30 నుంచి కూలీల సందడి మొదలవుతుంది. రోజూ కనీసం వెయ్యి నుంచి 1500 మంది వరకు కూలి పని కోసం అక్కడ ఎదురు చూస్తుంటారు. అందులో ప్లంబర్లు, పెయింటర్లు, కార్పెంటర్లు, బేల్దార్లు ఉంటారు. మహిళలైతే కాంక్రీట్ మిక్సింగ్​కు, ఇటుకలు మోసేందుకు, ఇంకేమైనా హెల్పింగ్​కు వెళ్తారు. లేబర్ కాంట్రాక్టర్లు బైకులపై వచ్చి వర్కర్లను తీసుకెళ్తారు. అక్కడ అధికారిక కనీస వేతనం పురుషులకు రూ.600, మహిళలకు రూ.300. మధ్యాహ్నం వరకు ఇలా ఎదురు చూస్తారు. 2.00 తర్వాత అడ్డా ఖాళీ అవుతుంది. పని దొరకని వాళ్లు కాళ్లీడ్చుకుంటూ ఇంటికి వెళ్తారు.

వారానికి రెండు మూడు రోజులే..

మండ్యా జిల్లా నుంచి బెంగళూరుకు వలస వచ్చాడు 36 ఏళ్ల స్వామి. తన ముగ్గురు అమ్మాయిలకు కాన్వెంట్ చదువు చెప్పించాలని పని కోసం వచ్చాడు. వారానికి రెండు, మూడు రోజులే పని దొరుకుతుందని, కనీసం ఆ మాత్రమైనా దొరుకుతున్నందుకు సంతోషమన్నాడు. 2016లో నోట్ల రద్దు తర్వాత పరిస్థితి తలకిందులైందని స్వామి చెప్పుకొచ్చాడు.‘‘అప్పట్లో నేను, నా భార్య కలిసి నెలకు రూ.25 వేల వరకు సంపాదించేవాళ్లం. నెలలో కనీసం 20 రోజులు పని దొరికేది. ప్రస్తుతం 10 వేల నుంచి 15 వేలు రావడం కష్టమవుతోంది. కనీసం 10 రోజులు కూడా పని దొరకడం లేదు” అని చెప్పాడు.

2018లో కోటి మందికిపైనే

2016లో అర్బన్ కర్నాటకలో 3 లక్షల నుంచి నాలుగు లక్షల మంది వర్కర్లకు నిర్మాణ రంగంలో ఉపాధి దొరికింది. ఒక్క బెంగళూరులో నిర్మాణ రంగంలో దాదాపు 5 లక్షల మంది కార్మికులు ఏళ్లుగా పని చేస్తున్నారు. గతంలో మెట్రో రైల్ నిర్మాణం ప్రారంభం కావడంతో పక్క రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల కార్మికులు భారీగా వలస వచ్చారు. అయితే ‘డీ మానిటైజేషన్’ ప్రకటన వెలువడిన తర్వాత వీరందరి జీవితాలు తలకిందులయ్యాయి. తర్వాత వచ్చిన గూడ్స్, సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వల్ల ఇది మరింత తీవ్రమైంది. 2018లోనే దాదాపు కోటి పది లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే కన్సల్టెన్సీ వెల్లడించింది. ఏప్రిల్​లో అజీమ్ ప్రేమ్​జీ వర్సిటీ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం నోట్ల రద్దు తర్వాత రెండేళ్లలో 50 లక్షల మంది అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్లు ఉద్యోగాలు కోల్పోయారు.