పైలట్​ మండలంలో ‘దళిత బంధు’ తీరిది!

పైలట్​ మండలంలో  ‘దళిత బంధు’  తీరిది!
  • కార్లు, ట్రాక్టర్లు ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు 
  • షెడ్లు కట్టి ఎదురు చూస్తున్న మిగతా యూనిట్ల లబ్ధిదారులు 
  • చాలా వరకు  గ్రౌండింగ్​పనులు ఏడియాడనే..
  • నిజాంపేటలో  రూ. 47 కోట్ల ఫండ్స్​ పెండింగ్​

కామారెడ్డి , వెలుగు:  ‘దళిత బంధు’  పైసలివ్వకపోవడంతో జిల్లాలోని పైలట్ ​మండలంలో యూనిట్ల గ్రౌండింగ్​పెండింగ్​ పడింది. శాంక్షన్​ అయిన అన్ని యూనిట్లకు పూర్తిస్థాయిలో ఫండ్స్​ రాక వచ్చిన వాటినే పంచి అధికారులు చేతులు దులుపుకున్నారు.  బర్లు, గొర్లు తీసుకునేందుకు ముందుకొచ్చిన లబ్ధిదారులు షెడ్లు కట్టించి యూనిట్ల గ్రౌండింగ్​ కోసం  ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో దళిత బంధు స్కీమ్​ పైలట్ ప్రాజెక్ట్​గా 4 మండలాలను ఎంపిక చేయగా.. ఇందులో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్​ మండలం ఒకటి.   

నిజాంసాగర్​లో ఇదీ పరిస్థితి 

జిల్లాలోని జుక్కల్​ నియోజక వర్గంలోని నిజాంసాగర్​ మండలం దళిత బంధు పైలట్​ప్రాజెక్టుకు ఎంపికైంది. ఈ మండలంలో  1,297  దళిత కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొదటి విడతగా 1,050 కుటుంబాలకు వారు ఎంపిక చేసుకున్న యూనిట్లు అందించామని ఆఫీసర్లు తెలిపారు. అయితే 1,050 మంది లబ్ధిదారులకు రూ. 10 లక్షల చొప్పున రూ.105 కోట్లు ఫండ్స్​కావాల్సి ఉంటుంది.  లబ్ధిదారులు గూడ్స్​ వెహికల్స్, ట్రాక్టర్లు,  కార్లు, జేసీబీలు, వరికోత మిషన్లు, టెంట్​హౌజ్, సెంట్రింగ్,​ పిష్​ ఫాండ్​, బర్రెలు , గొర్రెల పెంపకం యూనిట్లను ఎంచుకున్నారు.  3 నెలల కింద  కార్లు, గూడ్స్​ వెహిల్స్​, ట్రాక్టర్లు, జేసీబీలు, వరి కోత మిషన్లను లబ్ధిదారులకు అందజేశారు.  గొర్రెలు, బర్రెల యూనిట్ల కోసం  400 మంది ఎంపిక చేసుకున్నారు.  బర్రెలు, గొర్రెల యూనిట్లు కోరుకున్న వారికి ఇంకా ఫండ్స్​ ఇస్తలేరు. 

షెడ్ల నిర్మాణం కాంట్రాక్టర్​కు..

షెడ్ల నిర్మాణం పనులు కాంట్రాక్టర్​కు అప్పగించారు.  12 x20 సైజులో షెడ్ల నిర్మాణం చేపట్టారు.   మండలంకు చెందిన ఓ కాంట్రాక్టర్​ ఈ పనులు చేస్తున్నారు. ఒక వేళ లబ్ధిదారులు తమకు నచ్చినట్లుగా పెద్దగా నిర్మించుకుంటే ఆ కాంట్రాక్టరే మెటీరియల్​ సప్లై చేస్తున్నారు.  అకౌంట్​లో ఎంత మేర సొమ్ము జమ అయ్యింది?  ఎంత ఖర్చయ్యింది?  అనే విషయాలు లబ్ధిదారులకు చెప్తలేరు.

మూడు నెలలయినా ఇవ్వలే

 బర్రెలు తెచ్చుకుంటానని చెప్పా. షెడ్లు నిర్మించారు.  ఇంకా బర్లు మాత్రం రాలేదు. వెహికల్స్​ మాత్రమే ఇచ్చారు.  బర్రెలను కూడా త్వరగా ఇస్తే  బాగుండు. బ్యాంక్​ ఖాతాలో పైసలున్నాయంటున్నరు.. ఇస్తలేరు.

-  ప్రకాశ్, నిజాంసాగర్

షెడ్డు నిర్మించుకున్నా..

బర్రెలు ఇస్తమంటే షెడ్డు నిర్మించుకున్నా..  మూడు నెలలైనా బర్లు రాలే.. ఆఫీసర్లు మమ్ములను తీసుకెళ్లి  బర్లు ఇప్పిస్తమన్నారు.  మహారాష్ట్ర, ఏపీ నుంచి బర్రెలు తీసుకెళ్లమని మధ్యవర్తులు ఫోన్​చేస్తున్రు..  ఆఫీసర్లు చెప్తే వెళ్లి తీసుకుంటాం.

-  లక్ష్మయ్య, ఆరేడు

 ఫండ్స్​ పెండింగ్​..

నిజాంసాగర్​ మండలానికి  రూ.105  కోట్లు  కావాల్సి ఉండగా రూ. 60 కోట్లు వచ్చాయి. ఇంకా రూ.45 కోట్లు కావాలి.  నియోజక వర్గానికి 100 మంది చొప్పున 350 మందికి రూ.35 కోట్లకు గాను రూ.33 కోట్లు వచ్చాయి.  ఇప్పటి వరకు సెలక్ట్ చేసిన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో వారి అకౌంట్లలో పైసలు జమ చేయాలంటే ఇంకా రూ.47 కోట్ల ఫండ్స్​ఇవ్వాలి. ప్రభుత్వం ఇప్పటికైనా ఫండ్స్​ రిలీజ్​ చేస్తే  లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న  యూనిట్లు పూర్తిగా గ్రౌండింగ్​అయ్యే అవకాశం ఉంది.