ఒక్కో యూనిట్  పది మందికి..! దళితబంధు పథకం అమలులో అధికార పార్టీ నేతల లీలలు

ఒక్కో యూనిట్  పది మందికి..! దళితబంధు పథకం అమలులో అధికార పార్టీ నేతల లీలలు
  • గ్రామానికి రెండు, మూడు యూనిట్లే రావడంతో దళితుల నుంచి వ్యతిరేకత
  • ఉన్నంతలో ఎక్కువ మందిని సంతృప్తి పరిచే వ్యూహం
  • యూనిట్ తీసుకున్నోళ్లు మిగిలినోళ్లకు డబ్బులివ్వాలని ఆదేశాలు

ఖమ్మం, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల వేళ దళితబంధు పథకం పలుచనవుతోంది. మొన్నటిదాకా ఒక్కో కుటుంబానికి  ఒక్కో యూనిట్ అన్నవాళ్లే  ఇప్పుడు  ఫలహారంలా పంచుతున్నారు.  గ్రామాల్లో దళిత కుటుంబాలు ఎక్కువగా ఉండడం, ఊరికి రెండు, మూడుకు మించి దళితబంధు యూనిట్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో దళితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎన్నికల ముందు ఈ వ్యవహారం అధికారపార్టీకి తలనొప్పిగా మారడంతో లీడర్లు కొత్త ఎత్తుగడ వేశారు.

గ్రామానికి మంజూరైన  యూనిట్లను ఊరిలోని దళితులందరూ  పంచుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. కొన్ని జిల్లాల్లో రూ.10 లక్షలను పది మందికి పంచుతుండగా, మరికొన్ని చోట్ల నలుగురు, ఐదుగురికి అడ్జస్ట్ చేస్తున్నారు. ఒక గ్రూప్ నకు యూనిట్ మంజూరు చేసి.. యూనిట్​ తీసుకున్న వారు మిగిలిన వారికి డబ్బులు పంచాలని అగ్రిమెంట్లు చేయిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీఆర్​ఎస్​ లీడర్లు చేస్తున్న ఈ ప్రయత్నాలపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

నీరుగారుతున్న లక్ష్యం..

హుజూరాబాద్​ ఉప ఎన్నికల ముందు 2021 ఆగస్టులో  రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీం కింద  ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందజేయాలని నిర్ణయించింది. ఆ సొమ్ముతో లబ్ధిదారులు 30 అంశాల్లో తమకు నచ్చిన వ్యాపారం/ యూనిట్​ ఎంపిక చేసుకునే అవకాశం కల్పించింది. ఆయా వ్యాపారాల ద్వారా దళితకుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేది సర్కారు లక్ష్యం.  రాష్ట్రంలో 20 లక్షల దళిత కుటుంబాలు ఉండగా  యేటా 2 లక్షల కుటుంబాలకు  లబ్ధి చేకూర్చేందుకు  రూ.20వేల కోట్లు వార్షిక బడ్జెట్ లో కేటాయిస్తామని ప్రకటించినా సాధ్యం కావడం లేదు.

సరిపడా ఫండ్స్ లేకపోవడంతో లక్ష్యం మేర యూనిట్లు గ్రౌండింగ్​ కావడం లేదు. రాష్ట్రంలో పైలట్​ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన హుజూరాబాద్​ నియోజకవర్గంతోపాటు ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగర్​కర్నూల్​ జిల్లా సారగొండ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్​ మండలాల్లో, యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో మాత్రమే పూర్తిస్థాయిలో ఈస్కీమ్​ అమలు చేస్తున్నారు. మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి మొదటి విడత100  యూనిట్లు మంజూరు చేశారు.  రెండో విడత నియోజకవర్గానికి 1100 యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించగా ఎమ్మెల్యేల నేతృత్వంలో ఎంపిక ప్రక్రియ, గ్రౌండింగ్​ సాగుతోంది.

అధికార పార్టీ సర్పంచులు, కౌన్సిలర్లతో పాటు  ఎమ్మెల్యేల అనుచరులే లబ్ధిదారులను ఫైనల్​ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇచ్చే లిస్టును మంత్రి ఎండార్స్​ చేసి, కలెక్టర్​కు పంపితే దళితబంధు సాంక్షన్​ చేస్తున్నారు. కాగా, ఎన్నికల్లో లబ్ధి కోసం ఎమ్మెల్యేలు ఒక్కో యూనిట్​ను ఐదు నుంచి పది మందికి పంచాలని సూచిస్తున్నారు. దీంతో లోకల్ లీడర్లు రంగంలోకి దిగి ఎంపికైన లబ్ధిదారుల బ్యాంక్​ అకౌంట్లలో పడ్తున్న రూ.10లక్షలను ఇతరులతో పంచుకోవాలని, మూడోవిడత వాళ్లకు మంజూరఅయినప్పుడు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇది కాస్తా గొడవలకు దారితీస్తోంది. రూ.10లక్షలు ఒకే కుటుంబానికి ఇస్తే ఏదైనా వాహనం కొనుక్కొనో, వ్యాపారం చేసుకునే ఉపాధి పొందవచ్చని, అలా కాకుండా లక్షో, రెండు లక్షలో  పంచుకుంటే ఎటూ కాకుండా పోతాయని వాపోతున్నారు. 

నిర్మల్ జిల్లాలో ఒక్కో గ్రామానికి రెండు, మూడు దళిత బంధు యూనిట్లు  మంజూరు కాగా, లోకల్​ లీడర్లు రంగంలోకి దిగి అందరికీ సమంగా పంచుతున్నారు. సారంగాపూర్ మండలం వంజరలో మొదటి విడత  మూడు, రెండో విడత మరో మూడు యూనిట్లు మంజూరయ్యాయి. ఈ ఆరు యూనిట్లను  85 కుటుంబాలకు సమంగా పంచేందుకు అంగీకారం కుదిర్చారు. సర్పంచ్ మొదట తన ఒక్కడికే  ఒక యూనిట్ కావాలని పట్టు పట్టినా, గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ నేతలు ఆతన్ని  ఒప్పించి అందరికీ పంచేలా నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ యూనిట్లు మంజూరు చేయాలని,   లేకపోతే ఊళ్లో ఎవరికీ ఇవ్వవద్దంటూ   కొన్ని చోట్ల తీర్మానాలు చేస్తున్నారు.   

మహబూబాబాద్​ మండలం కంబాలపల్లిలో  175 మాదిగ, 40  బుడగ జంగం, 20 మాల, 6 బైండ్ల కుటుంబాలున్నాయి.   గ్రామానికి​ 14 యూనిట్లను మంజూరయ్యాయి. ముగ్గురు ఒక్కో యూనిట్​ తీసుకోగా,  మిగిలిన 11 యూనిట్లను  22 మంది  రూ.5 లక్షల చొప్పున పంచుకోవాలని సూచించారు. డోర్నకల్ మండలం తొడాలగూడానికి  మంజూరైన 8 యూనిట్లను గ్రామంలో ఉన్న  80 కుటుంబాలకు   పంచాలని అధికార పార్టీ నేతలు నిర్ణయించారు.  

ఖమ్మం జిల్లాలో ఒక్కో దళితబంధు యూనిట్ ను ముగ్గురి  నుంచి ఐదుగురికి పంచుతున్నారు. మధిరలో  గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. అక్కడ  గ్రామాల వారీగా పార్టీకి వచ్చిన ఓట్లను బట్టి  పథకాలను పంచుతున్నారు.  100 ఓట్ల మెజార్టీ వచ్చిన గ్రామానికి ఒక దళితబంధు యూనిట్, రెండు గృహలక్ష్మి యూనిట్లను కేటాయిస్తున్నారు. పెనుబల్లి మండలం టేకులపల్లిలో ఆరు యూనిట్లు ఇచ్చి అందరూ పంచుకోవాలని బీఆర్ఎస్​ నేతలు చెప్పడంతో ఇటీవల దళిత మహిళలు అశ్వారావుపేట రోడ్డుపై రాస్తారోకో చేశారు. సత్తుపల్లి అంబేద్కర్​ నగర్​ లో ఒక్కో  యూనిట్​ను పది మంది పంచుకోవాలనడంపై  దళితులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఒక్కో కుటుంబానికి ఒక యూనిట్ మంజూరు చేయాలని డిమాండ్​ చేశారు. 

యాదాద్రి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఇంట్లో ఇటీవల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దళితబంధు యూనిట్లు ఊరికి రెండు, మూడే వస్తున్నాయని, దీంతో మిగిలిన దళితుల నుంచి వ్యతిరేకత వస్తోందని కొందరు ప్రస్తావించారు. దీంతో వచ్చిన యూనిట్లను అందరికీ సమానంగా పంచితే ఎలా ఉంటుందని కొందరు అభిప్రాయపడగా, ఇంకొందరు అలాగైతే అసలు లక్ష్యం నీరుగారుతుందని వారించినట్లు తెలిసింది.