జీవితాంతం కలిసే ఉంటామని… రాజ్యాంగం సాక్షిగా పెండ్లి

జీవితాంతం కలిసే ఉంటామని… రాజ్యాంగం సాక్షిగా పెండ్లి

కొత్త పద్ధతిలో రాజస్థాన్ దళిత జంట పెండ్లి 

పూజారి లేడు.. మంత్రాలు లేవు.. పెండ్లి రూల్స్ అన్నీ బ్రేక్

పెళ్లంటే మంత్రాలు, బాజా భజంత్రీలు ఉండడం కామన్‌‌‌‌! తన ఇంటికి వచ్చే ఇల్లాలిని పదిలంగా చూసుకుంటానని వరుడు చేసే ప్రమాణాలూ ఉంటాయి. కానీ, ఓ దళిత జంట అవేవీ లేకుండానే పెండ్లి చేసుకుంది. ‘రాజ్యాంగం సాక్షిగా’ జీవితాంతం కలిసుంటామని అడుగులు వేసింది. ఒకప్పుడు దళిత  కుటుంబాలకు చెందిన పెండ్లికొడుకులు గుర్రమెక్కి బరాత్‌‌‌‌లు తీస్తే దాడులు జరిగిన ఏరియా అది. ఆ ప్రాంతంలో పెండ్లికూతురే రథంపై ఊరేగుతూ వరుడి ఇంటికి వచ్చింది. బంధుమిత్రుల సమక్షంలో ఇద్దరూ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ పెండ్లి చేసుకున్నారు. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ పెండ్లి సోమవారం రాత్రి రాజస్థాన్ ఆల్వార్ సిటీ సమీపంలోని కరోలి గ్రామంలో జరిగింది. కరోలికి చెందిన అజయ్ జాతవ్ హైదరాబాద్‌‌‌‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు.

అతడు, పొరుగూరు తులేదాకు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ బబిత పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే సామాజిక స్పృహ ఎక్కువగానే ఉన్న వీరిద్దరూ తమ పెండ్లి అందరికీ ఆదర్శంగా నిలవాలని భావించారు. ఇద్దరి ఇంట్లోనూ పెద్దలను ఒప్పించారు. పెండ్లికి రెడీ అనుకున్నాక వీరు ఇన్విటేషన్ నుంచే తమ ప్రత్యేకతను చాటుకున్నారు. హ్యాండ్ కర్చిఫ్​లపై ఆహ్వానిస్తూ అక్షరాలను ప్రింట్ చేశారు. పెండ్లి తంతు ముగిశాక వాటిని ఉతుక్కుని కర్చిఫ్​లుగా వాడుకోవచ్చన్నమాట.  ఒక పక్క అంబేద్కర్, మరో పక్క బుద్ధుడి ఫొటో పెట్టిన రథంపై అమ్మాయి ఊరేగింపుగా కరోలికి వచ్చింది.  పెండ్లి సందర్భంగా వీరు ఎకో ఫ్రెండ్లీ పద్ధతులూ పాటించారు. ఎక్కడా ప్లాస్టిక్‌‌‌‌ను వాడలేదు. భోజనాలు స్టీలు కంచాల్లో పెట్టారు. మట్టి గ్లాసుల్లో  నీళ్లిచ్చారు. అతిథుల నుంచి ఎలాంటి కానుకలు  తీసుకోలేదు. పెండ్లికొచ్చిన ప్రతి గెస్ట్ కూ ఒక రాజ్యాంగం ప్రతిని అందజేశారు. అంతేకాదు.. వెయ్యి కుటుంబాలున్న కరోలిలో ఓ లైబ్రరీ ఏర్పాటు కోసం ఇద్దరూ రూ. 30 వేల విరాళమిచ్చారు. లైబ్రరీ నిర్వహణకు కూడా సాయం చేస్తామని తెలిపారు.