చింతకాని మండలంలో ఇండ్లలోనే దళితబంధు యూనిట్లు

చింతకాని మండలంలో ఇండ్లలోనే దళితబంధు యూనిట్లు
  • నడపడం రాక నిరుపయోగంగా జేసీబీలు, హార్వెస్టర్లు
  • స్కిల్డ్​ వర్కర్లకు పెరిగిన డిమాండ్​
  • లబ్ధిదారులకు ట్రైనింగ్​ ఇస్తున్న ఆఫీసర్లు

దళిత బంధు పథకం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో యూనిట్లు ఇండ్లకే పరిమితమవుతున్నాయి. స్కిల్డ్ వర్కర్లు లేకపోవడంతో ప్రధానంగా హార్వెస్టర్లు, జేసీబీలు చాలా వరకు షెడ్లలోనే ఉంటున్నాయి. యూనిట్లు సెలక్ట్ చేసుకున్న లబ్ధిదారులకి అలాంటి పెద్ద వెహికల్స్​ నడిపిన అనుభవం లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు లబ్ధిదారులు వెహికల్స్​ నడపడానికి ఆపరేటర్లను పెట్టుకుంటున్నారు. ప్రస్తుతానికి యూనిట్లతో ఆదాయం వచ్చే సంగతెలా ఉన్నా ఆపరేటర్ల జీతం ఖర్చు మాత్రం మీద పడుతోంది. 

ఖమ్మం, వెలుగు : చింతకాని మండలానికి చెందిన నాగేశ్వరరావు దళితబంధు స్కీమ్​ కింద మరో ఇద్దరితో కలిసి జేసీబీ యూనిట్ తీసుకున్నాడు. స్థానికంగా స్కిల్డ్ వర్కర్​ దొరకకపోవడం, సొంతంగా జేసీబీ నడిపిన అనుభవం లేకపోవడంతో బీహార్​కు చెందిన వ్యక్తిని ఆపరేటర్​గా తీసుకున్నాడు. అతనికి నెలకు రూ.30 వేల శాలరీతో పాటు ఒక రూమ్, రెండు పూటల భోజనం పెట్టాలన్నది కండీషన్. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో అతనితోపాటు మరొక బీహార్ ​వ్యక్తిని కూడా తీసుకోవాల్సి వచ్చింది. దళితబంధు యూనిట్ల పంపిణీ తర్వాత ఇతర రాష్ట్రాలకు చెందిన స్కిల్డ్ వర్కర్లకు డిమాండ్ ఏర్పడింది. వాళ్ల కింద పనిచేస్తూ కొందరు వర్క్​ నేర్చుకుంటున్నా అందుబాటులో ఉన్న వెహికల్స్​కు తగిన సంఖ్యలో మాత్రం వర్కర్లు లభించడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ​వీపీ గౌతమ్ చింతకాని మండలం నామవరం, తిరుమలాపురం, తిమ్మినేనిపాలెంలో పర్యటించారు. ఆ సమయంలో యూనిట్లు లబ్ధిదారుల ఇండ్లలోనే ఉండడాన్ని గుర్తించారు. వాటిని సద్వినియోగం చేసుకునేలా లబ్ధిదారులను మోటివేట్ చేయాలని, సరైన ట్రైనింగ్ ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు.  

మొత్తం 3,462 మంది లబ్ధిదారులు

చింతకాని మండలంలో అర్హులైన 3,462 మంది లబ్ధిదారులకు వారి అకౌంట్లలో రూ.10 లక్షల చొప్పున జమ చేశారు. 80 శాతానికి పైగా యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. వీటిలో ట్రాన్స్​పోర్ట్ రంగానికి చెందిన యూనిట్లు ఎక్కువగా ఉన్నాయి. జేసీబీలు 169, హార్వెస్టర్లు 92, ట్రాక్టర్లు 285, గూడ్స్ వెహికల్స్​332, కార్లు 203, మొబైల్ టిఫిన్​సెంటర్లు 32, ప్రొక్లెయిన్లు 5, కాంక్రీట్ మిక్సర్లు 5 గ్రౌండింగ్ అయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఇంకా పూర్తిస్థాయిలో వరి కోతలు ప్రారంభం కాకపోవడంతో కొంతమంది హార్వెస్టర్లు ఇతర జిల్లాలకు, ఏపీకి తీసుకెళ్లారు. సగానికి పైగా హార్వెస్టర్లు గ్రామాల్లోనే ఖాళీగా ఉంటున్నాయి. గతంలో ఖమ్మం జిల్లాలో వరికోతల కోసం తమిళనాడు, కర్నాటక నుంచి కూడా హార్వెస్టర్లు వచ్చేవి. ఇప్పుడే ఇక్కడే మెషీన్లు ఎక్కువయ్యాయి. లచ్చగూడెం ఒక్క గ్రామంలోనే 16 హార్వెస్టర్ యూనిట్లు మంజూరు చేశారు. దీంతో అందరికీ పని దొరుకుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర జిల్లాలకు తీసుకెళ్లాలంటే పూర్తి స్థాయిలో పని తెలిసిన స్కిల్డ్ వర్కర్లు కనీసం ఇద్దరు కావాల్సి వస్తుండడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. 

పని తెలిసిన వాళ్లకు ఫుల్ డిమాండ్

గతేడాది ఒక హార్వెస్టర్ ​ఆపరేటర్ ​దగ్గర వర్క్​నేర్చుకున్నా. ఇప్పుడు సొంత ఊర్లోనే చాలా హార్వెస్టర్లు వచ్చాయి. నాకు రూ.20 వేల వరకు శాలరీ ఇస్తున్నారు. డిమాండ్​ బట్టి సీనియర్లకు రూ. 30 వేల వరకు ఇస్తున్నారు.  - పోటు వెంకటేశ్వర్లు, హార్వెస్టర్ ​ఆపరేటర్, చింతకాని

150 మందికి ట్రైనింగ్ ఇచ్చాం

దళితబంధు యూనిట్లు తీసుకున్న వారికి తగిన ట్రైనింగ్ ఇస్తు న్నాం. నాగులవంచ, సీతంపేటలో 150 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. మిగిలిన వారికి కూడా క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. లబ్ధిదా రులు ట్రైనింగ్ తీసుకొని సొంతంగా వెహికల్స్​ నడుపుకొంటే లాభదాయకంగా ఉంటుందన్న విషయాన్ని వారికి అర్థమయ్యేలా వివరిస్తున్నాం. - తోట కిషన్ రావు, జిల్లా రవాణాశాఖ అధికారి