దళితులకు భిక్షం కాదు.. మూడెకరాల భూమి ఇవ్వాలి

దళితులకు భిక్షం కాదు.. మూడెకరాల భూమి ఇవ్వాలి
  • మాజీమంత్రి, బీజేపీ నేత బాబూమోహన్

హైదరాబాద్: దళితులకు భిక్షం కాదు.. మూడెకరాల భూమి ఇవ్వాలని.. అలా అయితేనే దళితులందరికీ న్యాయం జరుగుతుందని మాజీమంత్రి, బీజేపీ నేత బాబూమోహన్ పేర్కొన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ మాదిరి రాష్ట్రంలోని దళితులందరకీ పది లక్షలు చొప్పున ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీల నిధులు మళ్లించబోమని అసెంబ్లీలో ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పారని బాబు మోహన్ విమర్శించారు. రాష్ట్రంలోని అందరికీ ఇస్తేనే దళితులపై కేసీఆర్ కు నిజమైన ప్రేమ ఉన్నట్లు అని ఆయన పేర్కొన్నారు. దళిత బంధు కాదు‌... దళితుల బతుకులు బంద్ చేయటమే కేసీఆర్ టార్గెట్ అని ఆయన ఆరోపించారు. 
ఎమ్మెల్యేలు చనిపోయి ఉప ఎన్నికలు వస్తే తప్ప నియోజకవర్గాలు అభివృద్ధి చెందని పరిస్థితి
ఎమ్మెల్యేలు చనిపోయి ఉపఎన్నిక వస్తే తప్ప నియోజకవర్గాలు అభివృద్ధి చెందని పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చారని బాబు మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏడేళ్ల కాలంలో ఎస్సీ‌ ఎస్టీలకు కోసం ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమైన నేపథ్యంలోనే దళిత బంధు పథకం తీసుకొచ్చారని విమర్శించారు. దళితులకు బిస్కెట్లు వేయటం‌ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగదని, బిక్షం కాదు.. మాకు మాడెకరాల భూమి ఇస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. ఏడేళ్ల తర్వాత కేసీఆర్ కు దళితులపై ప్రేమ కల్గినందుకు సంతోషం అన్నారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలవటం ఖాయమని తేలిపోయిందని, టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం న్యాయం, ధర్మానికి వేయాలని బాబు మోహన్ కోరారు.