దేశంలో డ్యాంలు పూడుకుపోతున్నయ్

దేశంలో డ్యాంలు పూడుకుపోతున్నయ్
  • 26%  తగ్గనున్న వాటర్ స్టోరేజ్​ కెపాసిటీ
  • 2050 నాటికి 3700 పెద్ద డ్యాంలపై ఎఫెక్ట్ పడే చాన్స్
  • యూఎన్ వర్సిటీ స్టడీలో వెల్లడి  
  • 150 దేశాల్లోని 47 వేల డ్యాంలపై అధ్యయనం 
  • ప్రపంచంలోని పెద్ద డ్యాంల కెపాసిటీ ఇప్పటికే 16% తగ్గినట్లు అంచనా

హమిల్టన్ (కెనడా):  మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని పెద్ద డ్యాంలు పూడుకుపోతున్నాయని, రిజర్వాయర్లలో వాటర్ స్టోరేజ్ కెపాసిటీ క్రమంగా తగ్గిపోతోందని యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీకి చెందిన సంస్థ వెల్లడించింది. ఇండియాలోని 3,700 పెద్ద డ్యాంలలో బురద పేరుకుపోవడం వల్ల 2050 నాటికి నీటి నిల్వ సామర్థ్యం దాదాపుగా 26% తగ్గిపోతుందని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద డ్యాంలలో తీసుకుంటే 25 శాతం స్టోరేజ్ కెపాసిటీ తగ్గుతుందని తెలిపింది. యూఎన్ యూనివర్సిటీకి చెందిన ‘ఇనిస్టిట్యూట్ ఫర్ వాటర్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ (యూఎన్ యూఐఎన్ డబ్ల్యూఈహెచ్)’ సంస్థ ఈ మేరకు150 దేశాల్లోని 47 వేల పెద్ద డ్యాంల డేటాపై అధ్యయనం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద డ్యాంల స్టోరేజ్ కెపాసిటీ ఇప్పటికే 16% తగ్గిపోయినట్లు గుర్తించింది. అయితే, ఆయా దేశాలు, ప్రాంతాలను బట్టి రిజర్వాయర్లలో బురద పేరుకుపోవడం, స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోవడం వేర్వేరుగా ఉన్నాయని, తమ రిపోర్ట్ లో గ్లోబల్, నేషనల్, రీజినల్ స్థాయిల్లో డేటాను పొందుపర్చామని రీసెర్చర్లు పేర్కొన్నారు. 

వివిధ దేశాల్లో ఇలా.. 

బ్రిటన్, పనామా, ఐర్లాండ్, జపాన్, సీషెల్స్ దేశాల్లోని డ్యాంలు అత్యధికంగా పూడుకుపోతున్నాయని యూనివర్సిటీ సంస్థ అంచనా వేసింది. ఈ దేశాల్లోని డ్యాంలు తమ ఒరిజినల్ స్టోరేజ్ కెపాసిటీలో 2050 నాటికి 35 నుంచి 50 శాతం దాకా కోల్పోతాయని తెలిపింది. అయితే, భూటాన్, కంబోడియా, ఇథియోపియా, గినియా, నైగర్ దేశాల్లో డ్యాంలు అతి తక్కువగా15 శాతం మాత్రమే పూడుకుపోనున్నాయని స్టడీలో వెల్లడైంది. ఇక అమెరికాలోని పెద్ద డ్యాంలు తమ ఒరిజినల్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీలో 34 శాతం, బ్రెజిల్ 23 శాతం, చైనా 20 శాతం సామర్థ్యాన్ని కోల్పోతాయని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా 50 వేల పెద్ద డ్యాంలు ఇప్పటికే 19% వరకూ కెపాసిటీని కోల్పోయాయని పేర్కొన్నారు. యూరప్​లోని 42 దేశాల్లో ఉన్న 6,651 పెద్ద డ్యాంలు ఇప్పటికే19% స్టోరేజ్ కెపాసిటీని కోల్పోయాయి. 2050 నాటికి ఈ నష్టం 28 శాతానికి పెరగనుంది. 

మనదేశంలో141 పెద్ద డ్యాంలు పాతవే

మన దేశంలోని పెద్ద డ్యాంలలో 141 డ్యాంలు 50 ఏళ్ల కిందట కట్టినవేనని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) 2015లో విడుదల చేసిన రిపోర్ట్ లో వెల్లడించింది. వీటిలో పావు వంతు డ్యాంలు మొదట ఉన్న వాటర్ స్టోరేజ్ కెపాసిటీలో ఇప్పటికే 30 శాతం సామర్థ్యాన్ని కోల్పోయాయని పేర్కొంది.