తప్పెవరిదో తేల్చుకుందాం.. బండికి వినయ్ భాస్కర్ సవాల్

తప్పెవరిదో తేల్చుకుందాం.. బండికి వినయ్ భాస్కర్ సవాల్

కోచ్ ఫ్యాక్టరీ విషయంలో ఎవరిది తప్పో భద్రకాళి అమ్మవారి సాక్షిగా తేల్చుకుందామని బండి సంజయ్‭కు..  ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సవాల్ విసిరారు. ఎన్నికలు వస్తేచాలు భాగ్యలక్ష్మి టెంపుల్ అడ్డాగా పాలిటిక్స్ చేయడం బండికి అలవాటైందని విమర్శించారు. దమ్ముంటే తెలంగాణ బీజేపీ నేతలు తన సవాల్‭ను స్వీకరించాలన్నారు. భద్రకాళి అమ్మవారి సాక్షిగా ఎవరిది తప్పో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని పిలిచారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలు తమ గుండెపగిలిపోయేలా చేశాయన్నారు. ప్రజలంతా మరో పోరుకు సిద్ధమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.  40 ఏళ్ల కోచ్ ఫ్యాక్టరీ సాధన పోరాటాన్ని నీరుగార్చేలా చేశారని ఆయన మండిపడ్డారు. బీజేపీకి చట్టాలు, ప్రజాస్వామ్యం పై నమ్మకం లేదని విమర్శించారు. చట్టాలను విస్మరించడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం ఇక్కడి ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు. బీజేపీ,- కాంగ్రెస్‭లు తెలంగాణ పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. 

ఇక ఓరుగల్లు అంటే పోరాటాల నిలయం అని వినయ్ భాస్కర్ అన్నారు. BRS ఆధ్వర్యంలో మరో పోరుకు సిద్దమవుతున్నామని చెప్పారు. దశలవారిగా తమ పోరాటాలు వుంటాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పైనా ఆయన మండిపడ్డారు. స్వరాష్ట్రంలో తాము సాధించుకున్న వనరులను దోచుపోవడానికి చంద్రబాబు కొత్త కుట్రలు చేస్తున్నారని వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.