డేటాబేస్ లీక్: ఆన్ లైన్ లో జియో యూజర్ల కరోనా రిజల్ట్స్

డేటాబేస్ లీక్: ఆన్ లైన్ లో జియో యూజర్ల కరోనా రిజల్ట్స్

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో కొవిడ్–19 సింప్టమ్ చెకర్ టూల్ ను ఈ ఏడాది మార్చి నెలలో ప్రారంభించింది. తన యూజర్లకు కరోనా సోకినట్లయితే గుర్తించడానికి ఈ టూల్ హెల్ప్ అవుతుందని జియో భావించింది. అయితే ఈ టూల్ డేటాబేస్ లోని యూజర్ల కరోనా రిజల్ట్స్ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. ఆన్ లైన్ లో పాస్ వర్డ్ లేకుండానే జియో యూజర్స్ కరోనా రిజల్ట్స్ ను చూసే ప్రమాదం ఏర్పడింది. భద్రతా లోపాల వల్లే టూల్ డేటాబేస్ లోని ఇన్ఫర్మేషన్ లీక్ అయిందని ‘టెక్ క్రంచ్’ రిపోర్డ్ తెలిపింది. ఓ సెక్యూరిటీ రీసెర్చర్ ఈ నెల 1వ తేదీన సెక్యూరిటీ ల్యాప్సెస్ ను కనుగొన్నారు. బగ్ గురించి తెలియడంతో జియో తన డేటాబేస్ ను ఆఫ్​ లైన్ లోకి మార్చింది. గత నెల17 నుంచి ఇప్పటివరకు డేటాబేస్ లో లీక్ అయిన మిలియన్ల కొద్దీ లాగ్స్ ను జియో ఆఫ్​లైన్ లో ఉంచనుంది.

అలర్ట్ అయిన జియో
టెక్ క్రంచ్ రిపోర్ట్ ప్రకారం.. లీక్ అయిన డేటాబెస్ లో ఎవరు టెస్ట్ చేయించుకున్నారు? (సెల్ఫ్​ లేదా రిలేటివ్స్ ?, వారి వయస్సు, జెండర్ తో సహా), అలాగే సైనప్ టైమ్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసిన వారి వివరాలు ఉన్నాయి. టూల్ అడిగిన ప్రశ్నలకు సంబంధించి యూజర్లు ఇచ్చిన జవాబులూ ఇందులో నిక్షిప్తం అయి ఉన్నాయి. అలాగే యూజర్లకు వచ్చిన లక్షణాలు, హెల్త్ కండీషన్స్, వారు ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారనే విషయాలూ భద్రపరచి ఉన్నాయి. కొన్ని కేసుల్లో యూజర్ల లొకేషన్ (ఉదాహరణకు ముంబై, పూణే) సమాచారం కూడా డేటాబేస్ లో ఉంది. ఇంకొన్ని రికార్డుల్లో కొందరు నార్త్ అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన వారి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. డేటాబేస్ లీకేజీ వ్యవహారం తెలియగానే రిలయన్స్ జియో సంస్థ అలర్ట్ అయింది. సదరు డేటాబేస్ ను ఆఫ్ లైన్ లోకి మార్చింది. ‘మేం వెంటనే చర్యలు తీసుకున్నాం. వెబ్ సైట్ పర్ఫామెన్స్ ను మానిటర్ చేయడమే లాగింగ్ సర్వర్ పని. తమకు కరోనా లక్షణాలు ఉన్నాయా లేదా అనేది యూజర్లు సెల్ఫ్ చెక్ ద్వారా తెలుసుకోవడానికే ఈ టూల్ ఉద్దేశించబడింది’ అని రిలయన్స్ జియో అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో చెప్పారు.