రోజూ తిడుతోందని అత్తను కొట్టి చంపింది...వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్‌‌‌‌లో దారుణం

రోజూ తిడుతోందని అత్తను కొట్టి చంపింది...వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్‌‌‌‌లో దారుణం

 వనపర్తి, వెలుగు : అత్త రోజూ తిడుతోందని ఆగ్రహానికి గురైన ఓ కోడలు కర్ర, పెనంతో కొట్టి హత్య చేసింది. అనంతరం సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ వృద్ధురాలి డెడ్‌‌‌‌బాడీపై గాయాలు కనిపించడంతో గట్టిగా నిలదీయగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఈ ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్‌‌‌‌ గ్రామంలో సోమవారం వెలుగు చూసింది. డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... 

నాగాపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన దొడ్డి ఎల్లమ్మ (75) అప్పుడప్పుడు కోడలు బొగురమ్మను తిడుతుండేది. ఈ క్రమంలో మందులు, ఇతర ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని ఎల్లమ్మ శనివారం బొగురమ్మను అడుగుతూ కోప్పడింది. దీంతో ఆగ్రహానికి గురైన బొగురమ్మ చేతికర్రతో అత్త ఎల్లమ్మపై దాడి చేసింది. 

ఆమె మరోసారి తిట్టడంతో పక్కనే ఉన్న పెనంతో ఎల్లమ్మ తల, వీపు, నడుంపైన కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఎల్లమ్మ అక్కడికక్కడే చనిపోయింది. దీంతో భయానికి గురైన బొగురమ్మ మంచంపైన, ఇంట్లో పడిన రక్తం మరకలను కడిగి, ఎల్లమ్మ డెడ్‌‌‌‌బాడీపై నిండుగా బట్టలు కప్పి పడుకోబెట్టింది. అనంతరం వయోభారంతో సాధారణ మరణంగా నమ్మించింది. ఆదివారం అంత్యక్రియలకు సిద్ధం చేసే టైంలో ఎల్లమ్మ వెన్నుపూస, తొడలపై గాయాలు కనిపించడంతో బొగురమ్మను నిలదీయగా తానే కొట్టినట్లు ఒప్పుకుంది. 

అనంతరం తన స్వగ్రామం బిజినేపల్లి మండలం గుడ్లనర్వకు పారిపోయింది. ఎల్లమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బొగురమ్మ కోసం గాలింపు మొదలుపెట్టారు. సోమవారం రేవల్లి ఆసుపత్రి వద్ద ఉందని సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి అరెస్ట్‌‌‌‌ చేసి, రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.