తండ్రిని చంపించిన కూతురు.. పట్టించిన పోస్టుమార్టం రిపోర్ట్

తండ్రిని చంపించిన కూతురు.. పట్టించిన పోస్టుమార్టం రిపోర్ట్
  • మర్డర్​ కేసును ఛేదించిన కుషాయిగూడ పోలీసులు.. ఐదుగురి అరెస్ట్​

కుషాయిగూడ, వెలుగు:  పోస్టుమార్టం రిపోర్టుతో బయటపడ్డ మర్డర్​ కేసులో నిందితులను కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ ​చేశారు. భార్య, కూతురు(17), కొడుకుతో కలిసి కాప్రాలో ఉండే రామకృష్ణ ఓ గ్యాస్​ఏజెన్సీలో వర్కర్​గా పనిచేసేవాడు. గతేడాది రామకృష్ణ కుటుంబం నారాయణగూడలో ఉన్న టైమ్​లో వాచ్​మన్​ కొడుకు భూపాల్(20), రామకృష్ణ కూతురితో సన్నిహితంగా ఉండేవాడు. ఆమె భూపాల్​కి డబ్బు ఇవ్వగా బైక్​, కెమెరా, డ్రెస్​లు కొన్నాడు. ఈ విషయం తెలుసుకున్న రామకృష్ణ.. భూపాల్​కు వార్నింగ్ ​ఇచ్చాడు. అయినా భూపాల్​ మారకపోవడంతో  మైనర్​ అయిన తన కూతురితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని నారాయణగూడ పోలీసులకు రామకృష్ణ కంప్లయింట్​ చేశాడు. దీంతో పోక్సో యాక్ట్​ ప్రకారం భూపాల్​ను అరెస్ట్​ చేసి రిమాండ్​కి తరలించారు. ఈ ఏడాది జులైలో జైలు నుంచి విడుదలైన భూపాల్.. ​తీరు మార్చుకోకపోగా, రామకృష్ణ కూతురుని మళ్లీ కలవడం మొదలు పెట్టాడు. ఆమెతో సన్నిహితంగా ఉంటూ, ఫ్రెండ్స్​తో కలిసి రామకృష్ణను చంపేందుకు స్కెచ్ వేశాడు.  గత జులై 19న సాయంత్రం రామకృష్ణ ఇంటి వద్దకు వెళ్లిన భూపాల్ అతడి కూతురికి స్లీపింగ్​ పౌడర్ ​ఇచ్చాడు. దానిని ఆమె ఇంట్లో చికెన్​ కర్రీలో కలిపింది. అది తిన్న రామకృష్ణ, తల్లి, అన్న నిద్రలోకి వెళ్లారు. అర్ధరాత్రి 1 గంటకు  భూపాల్​తో పాటు అతడి ముగ్గురు ఫ్రెండ్స్​ ఇంట్లోకి వెళ్లి నిద్రపోతున్న రామకృష్ణపై బ్లాంకెట్​తో నోరు మూసి, గొంతుపై కత్తితో పొడిచారు.  అలజడి కావడంతో రామకృష్ణ భార్య, కొడుకు లేచి చూశారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన రామకృష్ణను హాస్పిటల్​కి తీసుకెళ్లగా.. డాక్టర్లు పరిశీలించి చనిపోయాడని నిర్ధారించారు. రామకృష్ణ భార్య కంప్లయింట్​తో పోలీసులు కేసు నమోదు చేసి.. డెడ్​బాడీని పోస్ట్​మార్టం కోసం హాస్పిటల్​కి తరలించారు.  రామకృష్ణ ప్రమాదవశాత్తు చనిపోలేదని, హత్యకు గురైనట్లు పోస్టుమార్టం రిపోర్ట్‎లో తేలింది. దీంతో పోలీస్​స్టేషన్​కు రామకృష్ణ భార్యను పిలిచి విచారించారు. కూతురిని కాపాడుకోవడానికే అబద్దం చెప్పాల్సి వచ్చిందని ఆమె పోలీసుల వద్ద ఒప్పుకుంది. దీంతో పోలీసులు శుక్రవారం రామకృష్ణ కూతురు(17)తో పాటు ప్రధాన నిందితుడు భూపాల్, అతడి ఫ్రెండ్స్​  ​ప్రశాంత్​(19), గణేష్​ (20), విజయపాల్​ (45)ను అరెస్ట్ చేశారు. కత్తి, సెల్ ఫోన్లను, స్లీపింగ్​పిల్స్, బైక్​ను సీజ్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్​కి తరలిస్తామని  కుషాయిగూడ ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ తెలిపారు.