వర్ధన్నపేట మున్సిపల్ చైర్ పర్సన్ ఇంటి ముట్టడి

వర్ధన్నపేట మున్సిపల్ చైర్ పర్సన్ ఇంటి ముట్టడి

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాలో గత మూడు నెలల నుంచి కరెంట్ రావడం లేదు. దీంతో మంగళవారం తండా వాసులు మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ ఇంటిని ముట్టడించారు. ఈసందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు డీడీలు కట్టమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ లేక నీటి సమస్య కూడా నెలకొందని వాపోయారు. గతంలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ఆఫీసర్లు ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు.

నీటి కోసం ధర్నా..

వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో తాగునీటికి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మంగళవారం  వరంగల్, ఖమ్మం హైవేపై ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు ఇస్తున్నామని గొప్పలు  చెబుతున్న ఎమ్మెల్యే ఒకసారి కాలనీకి వచ్చి చూడాలన్నారు. సమస్యను కౌన్సిలర్ కు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. విషయం తెలుసుకున్న కమిషనర్ వారంలో నీటి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.