రైతులకు రూ.50 కోట్ల క్రాప్ లోన్లు ఇవ్వాలి : కుంభం శ్రీనివాస్ రెడ్డి

రైతులకు రూ.50 కోట్ల క్రాప్ లోన్లు ఇవ్వాలి : కుంభం శ్రీనివాస్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులకు రూ.50 కోట్ల క్రాప్ లోన్లు ఇవ్వాలని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నల్గొండలోని సహకార బ్యాంకు పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్ రూ.2940.29 కోట్ల టర్నోవర్ తో లాభాల బాటలో పయనిస్తోందని తెలిపారు. డీసీసీబీకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు వచ్చేందుకు కృషి చేసిన అధికారులు, పాలకవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.3,500 కోట్లకు చేరుకునేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు.

గత ఆర్థిక సంవత్సరం రూ.2,300 కోట్లు ఉండగా, దానిని రూ.598.16 కోట్లకు పెంచుకున్నట్లు తెలిపారు. ఈ బ్యాంకు రాష్ట్రంలో గతంలో 8వ స్థానంలో ఉండగా, నేడు రెండో స్థానంలో ఉందన్నారు. పంట రుణం ఎకరానికి రూ.లక్ష ఉండగా, దానిని రూ.లక్షా 50 వేల వరకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. డీసీసీబీ వైస్ చైర్మన్ ఏసి రెడ్డి దయాకర్ రెడ్డి, బ్యాంక్​సీఈవో శంకర్ రావు, డైరెక్టర్లు, అధికారులు, సహకార సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు.