కేంద్రానికి హర్యానా రైతుల డెడ్ లైన్ పూర్తి.. ముట్టడిలోనే జాతీయ రహదారి

కేంద్రానికి హర్యానా రైతుల డెడ్ లైన్ పూర్తి.. ముట్టడిలోనే జాతీయ రహదారి

కనీస మద్దతు ధరపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తాము వెనక్కి తగ్గబోమని హర్యానా రైతులు స్పష్టం చేస్తున్నారు. పొద్దుతిరుగుడు పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు సోమవారం రాత్రి 10 గంటల వరకు కేంద్రం తమతో చర్చలు జరపాలని, లేదంటే ఆందోళన కొనసాగిస్తామని హర్యానా ప్రభుత్వానికి  డెడ్​లైన్​ పెట్టాయి. కాగా గడువు ముగియడంతో ఏం జరుగుతుందోనని ఆందోళనలు నెలకొన్నాయి.  తదనంతరం నిర్ణయాలను కిసాన్ మోర్చా నేతలకు వివరిస్తామని రైతు సంఘాలు తెలిపాయి.

కాగా ఎంఎస్​పీపై స్పష్టత కోరుతూ కురుక్షేత్రలో మహాపంచాయత్‌ను నిర్వహించిన అనంతరం రైతులు ఢిల్లీ-చండీగఢ్ హైవేను దిగ్బంధించారు. భారతీయ కిసాన్ యూనియన్  పిలుపునిచ్చిన "ఎంఎస్​పీ దిలావో, కిసాన్ బచావో మహాపంచాయత్"  జాతీయ రహదారి-44కి సమీపంలోని పిప్లీ ధాన్యం మార్కెట్‌లో జరిగింది. మహాపంచాయతీ అనంతరం రైతులు హైవేపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు ఢిల్లీ నుంచి కురుక్షేత్ర బైపాస్ మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించారు. భారతీయ కిసాన్​ యూనియన్​ నాయకుడు రాకేష్​ టికాయత్ తో పాటు, ఒలింపిక్ పతక విజేత రెజ్లర్​ బజరంగ్​పునియా తదితరులు మహా పంచాయత్​లో పాల్గొన్నారు.  హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ల నుంచి కూడా రైతులు ఈ సభకు హాజరయ్యారు.

డిమాండ్లపై చర్చించే వరకు పోరాటం...

మహాపంచాయత్‌లో రైతు నాయకుడు కరమ్‌సింగ్ మథనా మాట్లాడుతూ.. తమ డిమాండ్‌లపై చర్చించేందుకు  ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశం ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. సీఎం తమతో చర్చలకు రాలేదన్నారు. అందుకే రహదారిని దిగ్భందించామని తెలిపారు. సమస్య పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం బీకేయూ నేతలతో చర్చలు జరుపుతోందని కురుక్షేత్ర డిప్యూటీ కమిషనర్​ శంతను శర్మ తెలిపారు.  నిరసనలు విరమించాలని కోరినట్లు చెప్పారు.