గుండెపోట్లు.. సోమవారమే ఎక్కువట

గుండెపోట్లు.. సోమవారమే ఎక్కువట

మాంచెస్టర్ (యూకె): గుండెపోటు.. ఎప్పుడు, ఎవరికి వస్తుందో డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. ఆరోగ్యంగా ఉన్నామని అనుకునే వాళ్లు కూడా హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయిన ఘటనలు ఎన్నో!  అయితే, గుండె పోటుకు గురయ్యే.. అదీ తీవ్రమైన గుండెపోటుకు గురయ్యే ముప్పు సోమవారమే ఎక్కువని ఐర్లాండ్​ వైద్యులు పేర్కొన్నారు. ఐదేళ్లలో పదివేలకు పైగా గుండెపోటు బాధితుల కేసులను పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించామని చెప్పారు. 

ఐదేళ్ల డాటా పరిశీలన..

ఐర్లాండ్​లోని బెల్​ఫాస్ట్​ హెల్త్​ అండ్​ సోషల్​ కేర్ ట్రస్టుతో కలిసి రాయల్​ కాలేజ్​ ఆఫ్ సర్జన్స్ ఈ స్టడీ నిర్వహించారు. ఇందులో భాగంగా 10,528 మంది గుండెపోటు బాధితుల హెల్త్​ డాటాను విశ్లేషించారు. 2013 నుంచి 2018 వరకు తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన రోగుల వివరాలను పరిశీలించారు. ఇలాంటి కేసులు సోమవారమే ఎక్కువగా నమోదయ్యాయని పరిశోధకులు తెలిపారు.

వారంలో తొలి రోజుకు, ఈ గుండెపోటు కేసుల పెరుగుదలకు సంబంధం ఉందని గుర్తించామన్నారు. దీనికి కారణం జీవ గడియారంలో మార్పులేనని బ్రిటీష్​ హార్ట్​ ఫౌండేషన్ మెడికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ నీలేశ్​ సామాని పేర్కొన్నారు.