సర్కారు బడి విలువ నాకు తెలుసు : సీఎం రేవంత్​

సర్కారు బడి విలువ నాకు తెలుసు : సీఎం రేవంత్​
  • సింగిల్ టీచర్ స్కూళ్లను మూసెయ్యం : సీఎం రేవంత్​
  • సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ తెరిచే అంశాన్ని పరిశీలిస్తం 
  • సర్కారు బడుల బలోపేతానికి 11 వేలతో మెగా డీఎస్సీ వేసినం 
  • 2 వేల కోట్లతో స్కూళ్లను బాగు చేయిస్తున్నం 
  • త్వరలోనే విద్యా కమిషన్​ ఏర్పాటు చేస్తం
  • 10 జీపీఏ వచ్చిన పిల్లల ఫీజును చెల్లించేందుకు అభ్యంతరం లేదు 
  • చదువుపై చేసే ఖర్చును పెట్టుబడిగానే చూస్తామని వెల్లడి
  • 10 జీపీఏ తెచ్చుకున్న గవర్నమెంట్ ​స్కూల్​ స్టూడెంట్స్​కు సన్మానం

హైదరాబాద్, వెలుగు : విద్యా సంస్థల్లో సమస్యల పరిష్కారానికి సిఫా ర్సుల కోసం త్వరలోనే విద్యా కమిషన్​ను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యా వ్యవస్థను, సర్కారు స్కూళ్లను నిరంతరం సమీక్షించి, బడులను పునర్నిర్మిస్తామని స్పష్టం చేశారు. విద్యా కమిషన్​తో పాటు వ్యవసాయ కమిషన్​నూ ఏర్పాటు చేసి, రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలిపారు. సర్కారు బడుల్లో 10/10 జీపీఏ వచ్చిన విద్యార్థులకు గురుకులాల్లో సీట్లు కావాలంటే తక్షణమే  కేటాయించాలని విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశంను ఆదేశించారు.

వారు వేరే చోట చదివితే ఆ ఫీజును సర్కారు భరించేందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. సోమవారం రవీంద్రభారతిలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్కారు స్కూళ్లలో చదివి 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్​గా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. టెన్త్​ టాపర్లను అభినందించారు. అనంతరం రేవంత్​ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వమే అధికారంగా నిర్వహిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, తమ బాధ్యతను గుర్తు చేసిందని చెప్పారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీపడి సర్కారు స్కూల్​విద్యార్థులు రాణించడం ప్రభుత్వానికే గర్వకారణమని అన్నారు. విద్యార్థులు తమ గౌరవాన్ని మరింత పెంచారని చెప్పారు.

రూ.2 వేల కోట్లతో స్కూల్​ బిల్డింగులకు రిపేర్లు

రాష్ట్రంలో11వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. శిథిలావస్థకు చేరిన స్కూల్ బిల్డింగ్స్​కు రిపేర్లు, బడుల్లో వసతుల కోసం రూ.2 వేల కోట్లతో పనులు చేపట్టినట్టు తెలిపారు. బడీడు పిల్లలను స్కూల్​లో చేర్చేందుకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.  సర్కారు బడుల్లో మిడ్​డే మీల్స్ నిర్వహణతో పాటు పిల్లలకు అందించే యూనిఫామ్స్​ కుట్టే పనులనూ మహిళా సంఘాలకే ఇప్పించామని తెలిపారు.

దీంతో పాటు సర్కారు బడుల నిర్వహణను ‘అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ’ల పేరుతో మహిళా సంఘాలకు ఇచ్చినట్టు చెప్పారు. సర్కారు బడుల్లో చదువుకొని వచ్చిన తనకు వాటి విలువ తెలుసునని అన్నారు. సర్కారు బడుల్లో పిల్లలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్ అందించే సెమీ రెసిడెన్షియల్ విధానంపై పరిశీలిస్తామని చెప్పారు. 

విద్య మీద పెట్టేది పెట్టుబడే 

 విద్య మీద ప్రభుతం పెట్టేది ఖర్చు కాదని, పెట్టుబడి అని సీఎం రేవంత్​ అన్నారు. విద్యపై పెట్టే పెట్టుబడి మన సమాజానికి లాభం చేకూర్చుతుందని చెప్పారు. ‘‘ఇటీవలే నేను ఓ స్టడీ రిపోర్టు చూశా. రెసిడెన్షియల్ స్కూల్స్  లో చేరే పిల్లలు చిన్నతనంలోనే కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలు తగ్గిపోతున్నాయని దాంట్లో చదివా. ఇది భవిష్యత్తులో పెను సవాల్​గా మారే అవకాశం ఉంది. అమ్మ ఒడి ప్రతి పిల్లోడికి తొలి స్కూల్. అందుకోసమే రెసిడెన్షియల్స్​ను ప్రోత్సహిస్తూనే, గ్రామీణ ప్రాంత స్కూల్స్​ నూ బలోపేతం చేస్తున్నం” అని చెప్పారు.

తమ సర్కారుకు ఎలాంటి భేషజాలు లేవని, ఎవ్వరు మంచి సలహాలు, సూచనలు ఇచ్చినా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్​ శ్రీ దేవసేన, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ ప్రతినిధులు రవీందర్ రెడ్డి, మాధవ రెడ్డి, రిటైర్డ్ ఏజీ ప్రకాశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పీఎం, సీఎంలంతా సర్కారు బడుల్లో చదివినోళ్లే 

ప్రధాని మోదీ, ఏపీలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబుతో పాటు తానూ సర్కారు బడుల్లోనే చదువుకున్నామని సీఎం రేవంత్​ చెప్పారు. ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్​ లుగా పనిచేస్తున్న 90% మంది గవర్నమెంట్​ స్కూల్స్​లోనే చదివారని అన్నారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ బడులపై శ్రద్ధ తగ్గిందని, అవి నిర్వీర్యమయ్యే పరిస్థితికి వచ్చాయని తెలిపారు. ‘‘టీచర్లు లేరని పిల్లలు రావడం లేదు. పిల్లలు లేరని టీచర్లను పెట్టడం లేదు. కోడి ముందా? గుడ్డు ముందా? అన్నట్టుగా ఈ సమస్య తయారైంది.

మౌలిక వసతులపై దృష్టి పెట్టకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చింది”అని అన్నారు. అన్ని తండాలు, గూడేల్లోని పిల్లలకూ నాణ్యమైన విద్య అందేలా అక్కడే స్కూళ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. సింగిల్ టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూళ్లను మూసివేయొద్దని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.