అభివృద్ధి కోసమే అప్పులు

అభివృద్ధి కోసమే అప్పులు
  • నీళ్లు, కరెంటుకే ఎక్కువ ఖర్చు అయితాంది
  • మన కంటే కేంద్రమే ఎక్కువ అప్పులు చేసున్నది
  • ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్

ఎల్కతుర్తి, వెలుగు : తెలంగాణ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. సాగునీరు, కరెంటుకే ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నామని చెప్పారు. తద్వారా భారీగా సంపద సృష్టి జరుగుతోందన్నారు. రాష్ట్రం కంటే కేంద్రమే ఎక్కువ అప్పులు చేసిందని ఆరోపించారు. ఆయా అప్పులను ఏం చేశారో మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్ పూర్ గ్రామంలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమానికి వినోద్ కుమార్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఎమ్మెల్యేవొడితల సతీష్​కుమార్, జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్​కుమార్​తో కలిసి గ్రామంలో పర్యటించారు. విలేజ్ పార్క్, సర్కారు స్కూల్​ను పరిశీలించారు.

అప్పులకు లెక్కుంది...

రాష్ట్రంలో చేసిన అప్పులకు తమ వద్ద లెక్కలు ఉన్నాయని వినోద్ కుమార్ వెల్లడించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమపై అనవసరంగా నిందలేస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాన మంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజనలో దేశవ్యాప్తంగా 20 గ్రామాలు ఎంపిక చేస్తే, అందులో తెలంగాణ నుంచి 19 గ్రామాలు ఉన్నాయన్నారు. ఇది కాదా అభివృద్ధి? అని ప్రశ్నించారు. సెల్ ఫోన్లతో యువత పెడదారి పడుతోందని, వారిని క్రీడల వైపు మళ్లించేందుకే ప్రతీ గ్రామంలో ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ‘మన ఊరు–మన బడి’కి రూ.7వేల కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. త్వరలో ప్రతీ గ్రామంలో  ‘ఈ-లైబ్రరీ’ ఏర్పాటు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోందన్నారు.

గోపాల్ పూర్ లోనే రూ.5కోట్ల 34 లక్షలు ఖర్చు

ఎమ్మెల్యే సతీశ్​కుమార్ మాట్లాడుతూ.. ఒక్క గోపాల్ పూర్ గ్రామంలోనే ఏడాదిలో రూ.5కోట్ల 34లక్షలు ఖర్చు చేశామన్నారు. జీలుగుల– ఇందిరానగర్ రోడ్డు నిర్మాణం పూర్తయిందని, కోతులనడుమ– కొత్తపల్లి రోడ్డును మళ్లీ నిర్మించేందుకు అనుమతులు వచ్చాయన్నారు. జడ్పీ చైర్మన్​సుధీర్​కుమార్​మాట్లాడుతూ.. రాష్ట్రానికి రావాల్సిన రూ.14వందల కోట్ల ఈజీఎస్ ఫండ్స్ పెండింగ్​లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్​ భాస్కర్​రావు  తదితరులున్నారు.