ఐటీ సెక్టార్‌‌లో తగ్గుతున్న జాబ్స్​

ఐటీ సెక్టార్‌‌లో తగ్గుతున్న జాబ్స్​
  • 2024లో 40 శాతం తక్కువ జాబ్స్​

గత ఆర్థిక సంవత్సరంలో టాప్ ఐటీ కంపెనీలు 2.40 లక్షల జాబ్స్ ఇచ్చాయి. ఈసారి వీటి సంఖ్య 50 వేల నుంచి లక్షకు పడిపోతుందని అంచనా. జూన్​ క్వార్టర్​లో  భారతదేశ  టాప్ ఫైవ్‌‌ ఐటీ కంపెనీల్లో నికర ఉద్యోగుల సంఖ్య 21,838 తగ్గింది. ఒక్క టీసీఎస్​ మాత్రమే 500 మందిని నియమించింది. మిగతా నాలుగు కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య పెరగలేదు. 

న్యూఢిల్లీ: మనదేశంలోని పెద్ద ఐటీ కంపెనీలు నియమకాలను  తగ్గించేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవి దాదాపు 40శాతం తక్కువ జాబ్స్​ ఇస్తాయని అంచనా. డిమాండ్​పై స్పష్టత లేకపోవడం, టెక్నాలజీ సర్వీసుల్లో మందగమనం, గ్లోబల్​ మార్కెట్లలో ఇబ్బందుల కారణంగా  ఇవి జాబ్స్​ఇవ్వడానికి ఉత్సాహం చూపడం లేదు. స్టాఫింగ్ సంస్థ ఫెనో నుంచి వచ్చిన డేటా ప్రకారం, ఐటీ సేవల మేజర్లు 2024 ఆర్థిక సంవత్సరంలో 50 వేల నుంచి లక్ష మంది ఉద్యోగులను నియమించుకోవచ్చని అంచనా. మునుపటి సంవత్సరంలో ఈ కంపెనీలు 2.50 లక్షల మందికి జాబ్స్​ ఇచ్చాయి. 

ఈ లెక్కలను పోల్చిచూస్తే ఐటీ సెక్టార్​లో హైరింగ్​ ఎంత దారుణంగా పడిపోతోందో అర్థం చేసుకోవచ్చు. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో టాప్ ఐదు ఐటీ ఎగుమతిదారులు - టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌‌సీఎల్‌‌ టెక్, విప్రో,  టెక్ మహీంద్రా- నికర హెడ్‌‌ కౌంట్‌‌  21,838 తగ్గింది. పరిశ్రమలో నంబర్​వన్​గా ఉన్న టీసీఎస్​ ఉద్యోగుల సంఖ్య ఈ క్వార్టర్​లో సుమారు 500 పెరగగా, మిగిలిన నాలుగు కంపెనీల్లో మాత్రం గణనీయంగా తగ్గాయి.

గ్లోబల్ ​మార్కెట్లలో ఎదురుగాలులు

యూఎస్​, యూరప్ ​మార్కెట్లలో ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఐటీలో నియామకాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఐటీ సర్వీసుల్లో జాబ్స్​ 25–-30 శాతం తగ్గవచ్చని క్వెస్ ఐటీ స్టాఫింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ శివరామ్ అన్నారు.  ఈ సంవత్సరం కొన్ని కంపెనీలు  ఫ్రెషర్లకు అవకాశాలు ఇవ్వకపోవచ్చని అంచనా వేశారాయన.  తాజా గ్రాడ్యుయేట్ ఇంజనీర్లకు డిమాండ్ ఈ ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్​ నాటికి పుంజుకోవచ్చని అన్నారు. అప్పటికి డిమాండ్ కరోనా ముందు స్థాయికి దగ్గరగా ఉంటుందని వివరించారు. 

టీసీఎస్‌‌తో పాటు, ఐటీ కంపెనీలు ఈ సంవత్సరం 40 వేల మందిని తీసుకుంటాయని అంచనా. అయితే కంపెనీలు మాత్రం హైరింగ్​ ప్లాన్ల గురించి ఏమీ మాట్లాడటం లేదు. విప్రో మొదటి క్వార్టర్​లో ఫ్రెషర్లను తీసుకోలేదని కంపెనీ హెచ్​ఆర్​  చీఫ్​ సౌరభ్ గోవిల్ తెలిపారు.  రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ సమస్యలు యూఎస్​, యూరప్ ఎదుర్కొంటున్న స్థూల సవాళ్లను తీవ్రతరం చేశాయి. ఇవి రెండూ- భారతీయ ఐటీ పరిశ్రమకు అతిపెద్ద మార్కెట్లు.  కొన్ని ఐటీ కంపెనీల జూన్‌ క్వార్టర్ ​ఆదాయాల్లో తగ్గుదల కనిపించింది. ఈ లిస్టులో టీసీఎస్ కూడా ఉంది. 

భారతదేశపు రెండవ- అతిపెద్ద ఐటీ సేవల మేజర్, ఇన్ఫోసిస్, రెవెన్యూ గ్రోత్​ గైడేన్స్​ను పూర్తి సంవత్సరానికి నిలకడైన కరెన్సీలో 1-–3.5 శాతంకి తగ్గించింది.  దాని మునుపటి అంచనా 4–7శాతం ఉండేది.   ప్రాజెక్ట్ ర్యాంప్‌‌డౌన్‌‌ల కారణంగా ప్రాఫిట్​, రెవెన్యూ ఎస్టిమేట్స్​ను చేరుకోలేకపోయింది. టెక్నాలజీ, టెలికాం వర్టికల్స్ నిరాశపర్చాయి. టెక్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ సీపీ గుర్నానీ మాట్లాడుతూ ఏప్రిల్–-జూన్  గత ఐదేళ్లలో తాను చూసిన కఠినమైన క్వార్టర్​లలో ఒకటి అని అన్నారు. ప్రస్తుత సవాళ్లు "తాత్కాలికమైనవి" అని ఆయన కామెంట్​ చేశారు.

మిగతా కంపెనీలు కూడా..

భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్న యాక్సెంచర్, క్యాప్‌‌జెమినీ,  కాగ్నిజెంట్ వంటి గ్లోబల్ ఐటీ మేజర్‌‌లు కూడా ఇటీవలి క్వార్టర్​లో ఒక్కొక్కటి 5,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి.  దీనిపై  టీమ్‌‌లీజ్ డిజిటల్‌‌ చీఫ్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ సునీల్‌‌  మాట్లాడుతూ, "ఐటీ సేవల నియామకానికి ఇది చెడ్డ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. నిరాశాపూరిత సెంటిమెంట్ ఇక ముందు కూడా కొనసాగుతుందని అంచనా. 

సెక్టార్‌‌ గ్రోత్​ పెరుగుతుందన్న  సూచనలు  లేవు.  కొత్త ప్రాజెక్ట్‌‌ల రోల్ అవుట్‌‌పై స్పష్టత కొరవడటంతో కంపెనీలు తాజా నియామకాల కోసం తొందరపడటం లేదు” అని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం నుంచి నికర నియామకాలు 40 శాతం తగ్గవచ్చని అంచనా వేస్తున్నామని చెప్పారు. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడాది ఆగస్టు నాటికి కొత్త నియామకాల అవసరం దాదాపు 50శాతం తగ్గిందని సునీల్​ వివరించారు.