పోలింగ్​పై ఎండల ఎఫెక్ట్.. లోక్ సభ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్​లో తగ్గిన ఓటింగ్ శాతం 

పోలింగ్​పై ఎండల ఎఫెక్ట్.. లోక్ సభ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్​లో తగ్గిన ఓటింగ్ శాతం 
  • గత ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్​తో పోలిస్తే 4.4% తగ్గుదల 
  • 26న సెకండ్ ఫేజ్​లో 13 రాష్ట్రాల్లోని ఎంపీ సీట్లకు ఓటింగ్ 
  • ఆయా రాష్ట్రాల్లో పెరగనున్న టెంపరేచర్లు, హీట్ వేవ్స్ 
  • ఎండలతో పోలింగ్ శాతం తగ్గొచ్చని పార్టీలు, ఈసీ ఆందోళన

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడ్తుండటం, పలు రాష్ట్రాల్లో హీట్ వేవ్స్ సైతం కొనసాగుతుండటంతో లోక్ సభ ఎన్నికలపై భారీగా ఎఫెక్ట్ పడుతోంది. ఈ నెల 19న జరిగిన ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో ఎండల కారణంగా ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గిపోయింది. ఎన్నికలు 7 ఫేజ్ లలో జరగనుండగా.. తొలి విడతలోనే ఓటింగ్ శాతం తగ్గడం అభ్యర్థులను, ఆయా పార్టీలను, ఎన్నికల సంఘాన్ని కలవరానికి గురి చేస్తోంది.

తొలి విడతలో 21 రాష్ట్రాలు/యూటీల్లోని 102 ఎంపీ సీట్లకు పోలింగ్ జరిగింది. అయితే, 2019 ఎన్నికల్లోనూ ఫస్ట్ ఫేజ్​లో ఇవే నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 69.9% పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 65.5% మాత్రమే నమోదైంది. ఫస్ట్ టైం ఓటర్లలో నిరుత్సాహం, వలసలు, తదితర కారణాలతో పాటు ఎండలు మండుతుండటం కూడా ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి కారణమని విశ్లేషకులు చెప్తున్నారు.

ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో రెండో విడతలో ఈ నెల 26న 13 రాష్ట్రాలు/యూటీల్లోని 88 ఎంపీ సీట్లకు పోలింగ్ జరగనుంది. వీటిలో బెంగాల్, బిహార్, యూపీ, కర్నాటక రాష్ట్రాల్లో పోలింగ్ జరిగే రోజు హీట్ వేవ్స్ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ ఇదివరకే అలర్ట్ జారీ చేసింది. దీంతో తమిళనాడు, రాజస్థాన్, చత్తీస్ గఢ్, కేరళలోని పలు నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతంపై ఎండలే ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.

ఎండలు పెరిగితే తగ్గుతున్న పోలింగ్ 

గత లోక్ సభ ఎన్నికల్లోనూ ఎండలు పెరిగినప్పుడు ఓటింగ్ శాతం తగ్గినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఉదాహరణకు బిహార్​లోని నవద, గయ లోక్ సభ నియోజకవర్గాలకు ఈ నెల 19న పోలింగ్ జరగగా, ఆ రోజు టెంపరేచర్లు 40 డిగ్రీలు దాటిపోయాయి. ఫలితంగా గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గిపోయింది. ఇక్కడ 2019లో ఏప్రిల్ 11న నవదలో 35 డిగ్రీలు గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, అప్పుడు ఓటింగ్ శాతం 52.5కు పరిమితమైంది. ఈ నెల 19న గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీలు నమోదు కాగా, పోలింగ్ 41.5 శాతానికి తగ్గిపోయింది. అలాగే గయ సెగ్మెంట్ లో 2019 ఎన్నికలప్పుడు 35 డిగ్రీల టెంపరేచర్ ఉండగా, ఓటింగ్ 56 శాతం నమోదైంది. ఈసారి ఇక్కడ టెంపరేచర్ 42 డిగ్రీలకు పెరగగా, ఓటింగ్ 52 శాతానికి పడిపోయింది.

సీఈసీ రాజీవ్ కుమార్ రివ్యూ 

లోక్ సభ ఎన్నికల్లో మరో ఆరు విడతలు పోలింగ్ జరగాల్సి ఉండటం, రోజురోజుకూ ఎండలు పెరుగుతూ ఉండటంతో ప్రస్తుత పరిస్థితిపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ శాతం పడిపోకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీరు, ఫ్యాన్ల వంటి సౌలతులు కల్పించాలని ఆదేశించారు.

26న మైసూరులో టూరిస్ట్ ప్లేస్​లు క్లోజ్ 

కర్నాటకలో లోక్ సభ ఎన్నికలు ఈ నెల 26న, వచ్చే నెల7న రెండు విడతల్లో జరగనున్నాయి. ఈ రెండు రోజుల్లో ప్రభుత్వం సెలవును ప్రకటించింది. ఈ నెల 26న శుక్రవారం రావడంతో చాలా మంది వీకెండ్ టూర్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో ఓటింగ్ శాతం పెంచేందుకు మైసూరు జిల్లా పాలక యంత్రాంగం చర్యలను చేపట్టింది. ఈ నెల 26న టూరిస్ట్ ప్లేస్​లను క్లోజ్ చేయనున్న ట్టు ప్రకటించింది. ఓటు వేసి వచ్చే వారికి డిస్కౌంట్ ఇస్తామని పలు హోటల్స్ ప్రకటించాయి.