
- స్టేటస్ కో కొనసాగిస్తున్నామని రక్షణ శాఖ వెల్లడి
- రాయిటర్స్ వి తప్పుడు కథనాలని వివరణ
న్యూఢిల్లీ: అమెరికాతో ఆయుధ, యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని ఇండియా నిలిపివేసినట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఇది వరకే చేసుకున్న డీల్స్‌పై స్టేటస్ కో కొనసాగిస్తున్నామని ప్రకటించింది. కొత్త ఒప్పందాలను మాత్రం పోస్ట్‌పోన్ చేశామని వివరించింది.
ఈ అంశంపై ‘రాయిటర్స్’ ప్రచురించిన కథనాన్ని తోసిపుచ్చింది. అమెరికా నుంచి ఆయుధాలు, యుద్ధ విమానాలు కొనుగోళ్లను నిలిపివేయాలని ఇండియా నిర్ణయించినట్లు ‘రాయిటర్స్’ వెలువరించిన కథనం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఇప్పటికే చేసుకున్న ఒప్పందాల్లో ఏదీ రద్దు చేయలేదని, కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం.. ఆయుధాలు, విమానాలు, క్షిపణులు ఇండియాకు వస్తాయని తెలిపింది. రాయిటర్స్ తప్పుడు కథనాన్ని ప్రచురించిందని అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయమై రాయిటర్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని మండిపడింది. ఇండియా, అమెరికా మధ్య 20 డిఫెన్స్ డీల్స్ యాక్టివ్‌గా ఉన్నట్లు పేర్కొన్నది.
టారిఫ్ వల్లే డీల్ రద్దు చేసుకున్నది: రాయిటర్స్
ఇండియాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% టారిఫ్‌కు నిరసనగా.. ఆ దేశం నుంచి ఆయుధాలు, యుద్ధ విమానాల కొనుగోళ్ల ఒప్పందాలను ఇండియా తాత్కాలికంగా నిలిపేసిందని రాయిటర్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. జనరల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్స్ తయారు చేసిన స్ట్రైకర్ కంబాట్ వెహికల్స్, రేథియాన్, లాక్‌హీడ్ మార్టిన్ డెవలప్ చేసిన జావెలిన్ యాంటీ-ట్యాంక్ మిసైళ్లు, ఇండియన్ నేవీ కోసం బోయింగ్ పీ8ఐ రీ కానైసెన్స్ విమానాలు అమెరికా నుంచి కొనాలని భావించిందని తెలిపింది.
ఈ డీల్ విలువ సుమారు రూ.31,500 కోట్ల వరకు ఉంటుందని రాయిటర్స్ తన కథనంలో వివరించింది. ఈ డీల్‌కు 2021లోనే అమెరికా విదేశాంగ శాఖ ఆమోద ముద్ర వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ డీల్‌పై ట్రంప్, మోదీ అధికారిక ప్రకటన చేశారు.