గ్రూప్​ 4కు చాలా మంది దూరమయ్యే చాన్స్​

గ్రూప్​ 4కు చాలా మంది దూరమయ్యే చాన్స్​
  • గ్రూప్​ 4కు డిగ్రీ ఉండాల్సిందే
  • ఇంటర్ అర్హతను డిగ్రీకి పెంచుతూ 2014లో నిర్ణయం
  • ఉమ్మడి ఏపీలోనే సర్వీస్​ రూల్స్​కు సవరణ
  • వాటిని అడాప్ట్​ చేసుకొని నోటిఫికేషన్​ ఇవ్వనున్న రాష్ట్ర సర్కారు

హైదరాబాద్, వెలుగు: గ్రూప్​4 పోస్టులకు ఇప్పటి వరకు ఇంటర్మీడియెట్​గా ఉన్న అర్హతను డిగ్రీకి మారుస్తూ  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో టీఎస్​పీఎస్సీ రిలీజ్ చేయనున్న గ్రూప్​4 నోటిఫికేషన్​లో మార్పులు చేస్తున్నారు. 2014 మే లో ఉమ్మడి ఏపీలోనే జిల్లా స్థాయి గ్రూప్​4 పోస్టులకు కనీస అర్హత డిగ్రీగా మారుస్తూ.. అప్పటి జీఏడీ స్పెషల్ సీఎస్​ ఎస్​కే సిన్హా ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ మినిస్టీరియల్​సర్వీస్​ రూల్స్1998కు సవరణ చేసినట్లు జీవోలో పేర్కొన్నారు. 

ఆ తరువాత కొన్ని రోజులకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి దాదాపు ఎనిమిదేండ్లుగా గ్రూప్ 2 మినహా గ్రూప్1, గ్రూప్​3, గ్రూప్ 4 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో నోటిఫికేషన్లు రాలేదు. దీంతో జూనియర్​అసిస్టెంట్, అసిస్టెంట్ కమ్​టైపిస్ట్, జూనియర్​స్టెనోగ్రాఫర్స్​ తదితర గ్రూప్​4 పోస్టులకు అర్హత ఇంటర్మీడియేటే ఉంటుందని అంతా భావించారు. కాగా 9,168 గ్రూప్ 4 పోస్టులకు ఆర్థిక శాఖ ఇటీవల అనుమతించింది. దీనిపై నోటిఫికేషన్​ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న టైమ్​లో సర్వీస్​రూల్స్​ మార్పులు తెరపైకి వచ్చాయి. దీంతో 2014 మే12వ తేదీన ఇచ్చిన క్వాలిఫికేషన్​సవరణ ఉత్తర్వులను తెలంగాణకు అడాప్ట్ చేసుకున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. 

చాలా మంది దూరమయ్యే చాన్స్​

రాష్ట్రంలో కొత్త జోనల్‌‌ విధానం అమల్లోకి రావడంతో ఇంతకు ముందు 80:20 నిష్పత్తిలో స్థానిక, జనరల్‌‌ కేటగిరీల్లో ఉద్యోగాలు భర్తీ చేయగా ఇప్పుడు 95:5 నిష్పత్తిలో చేపట్టనుంది. దీంతో జిల్లా స్థాయి గ్రూప్​4 పోస్టులకు అప్లై చేసుకునేందుకు లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. ఇందులో ఇంటర్మీడియెట్ అర్హత మాత్రమే ఉన్నవాళ్ల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. గ్రూప్​3 పోస్టులకు ఎలాగో డిగ్రీ క్వాలిఫికేషన్​ఉంది. కనీసం గ్రూప్​4 కు అయినా ఇంటర్​తో ఎజిలిబుల్​అనుకుంటున్న వారికి రాష్ట్ర సర్కార్​నిర్ణయం తీవ్ర నిరాశ పరిచింది. రాష్ట్ర ఏర్పాటు తరువాత ఇంటర్ క్వాలిఫికేషన్​తో వీఆర్వో రిక్రూట్​మెంట్​జరిగింది. 

కామన్​ సర్వీస్​ రూల్స్​పైనా దృష్టి

గ్రూప్​4 సర్వీసు నిబంధనలు కూడా లోకల్​అభ్యర్థులకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం మార్పులు చేస్తోంది.  కామన్ ​సర్వీస్​ రూల్స్ తెచ్చేందుకు ప్లాన్​ చేసింది. ప్రస్తుతం రిక్రూట్​మెంట్​టైమ్ లో సాధారణ నిబంధనలు అన్ని డిపార్ట్​మెంట్లకు ఒకే విధంగా ఉండనుండగా శాఖల వారీగా నియామకాలు పూర్తయి ఉద్యోగులు విధుల్లో చేరాక ఆయా శాఖలకు సంబంధించిన నిబంధనలు కూడా వర్తిస్తాయి. అయితే గ్రూప్​4 పోస్టులకు సర్వీస్​ రూల్స్​ఏ డిపార్ట్​మెంట్​లో రిక్రూట్​అయినా ఒకేలా ఉండేలా చూడనున్నారు.