వడ్లు అమ్ముకునేందుకు పడిగాపులు.. కొనుగోళ్లలో జాప్యం

వడ్లు అమ్ముకునేందుకు పడిగాపులు.. కొనుగోళ్లలో జాప్యం

 

  • వడ్లు అమ్ముకునేందుకు పడిగాపులు
  • కొనుగోళ్లలో జాప్యం.. ట్రక్ షీట్​లోనూ భారీ కోతలు
  • సమయానికి లారీలు రాక రైతులపైనే భారం
  • కాంటాపెట్టి వడ్లు పంపినా.. మిల్లుల వద్ద కొర్రీలు
  • తడిసిందని భారీగా తరుగు తీస్తున్న మిల్లర్లు
  • లారీ లోడు పోతే మినిమమ్ మూడు బస్తాలు కట్
  • బస్తాకు రూ.3 చొప్పున లారీ డ్రైవర్ల వసూళ్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వడ్లు అమ్ముకునేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నరు. కొనుగోళ్లు మొదలై నెల దాటినా ఇబ్బందులు తప్పడం లేదు. సెంటర్లలో వడ్లు కాంటా పెట్టినా.. బస్తాలు మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కాంటా వేయగానే ట్రక్ షీట్లు ఇవ్వకుండా కేవలం చిన్న స్లిప్ మాత్రమే ఇస్తున్నారు. దీంతో వడ్లు అమ్మినా.. రైతుల బాధ్యత తీరడం లేదు. ఎక్కడ వాన వచ్చి తూకం వేసిన బస్తాలు తడుస్తాయోననే ఆందోళన చెందుతున్నారు.  మరోవైపు మిల్లుకు వెళ్లిన లారీల అన్‌‌లోడింగ్‌‌ ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో లారీలు వస్తాయన్న నమ్మకం కుదిరే వరకు సెంటర్లలో వడ్లు కాంటా పెట్టడం లేదు. దీంతో వేయింగ్ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతోంది. దీంతో రైతులు రాత్రనక పగలనక వడ్ల కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నారు. తీరా.. కాంటా వేసిన బస్తాలు మిల్లు వద్దకు చేరేసరికి ఎండకు మాయిశ్చర్ పడిపోయి బరువు తగ్గుతున్నాయి.  దీంతో మిల్లుల వద్ద, సెంటర్లలో రైతు ట్రక్‌‌షీట్‌‌లో కోత విధిస్తున్నారు. 

మిల్లుల వద్ద కొర్రీలు..

రైస్ మిల్లుల వద్దకు లోడు చేరగానే వడ్లు నాణ్యంగా ఉన్నా.. రంగు మారాయని, తడిసి ఆరాయని తరుగు తీస్తున్నారు. లేదంటే మిల్లర్లు బస్తాలు దించుకోమని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో రోజుల తరబడి లారీలు మిల్లుల వద్దే ఉంటున్నాయి. ఇక చేసేది లేక ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు, సొసైటీల సిబ్బంది మధ్యవర్తిత్వంతో కొంత తరుగుకు ఒప్పించి తీసుకుంటున్నారని రైతులు బహిరంగంగానే చెప్తున్నారు. లోడు మిల్లుల వద్దకు రాగానే బస్తాలను బట్టి మినిమం మూడు నాలుగు బస్తాలు మిల్లర్లు కోత పెడుతున్నారు. దీంతో కొనుగోలు సెంటర్​లో వేసిన తూకం.. మిల్లు వద్ద తగ్గిందని రెండు క్వింటాళ్ల వరకు తగ్గించి ట్రక్‌‌ షీట్‌‌ రాస్తున్నారు. ఫలితంగా రైతులు రూ.4 వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది. సాధారణంగా తూకం వేసి చాలా రోజులు ఆపితే వడ్లు బరువు తగ్గుతాయి. ఇలా రైతులు నష్టపోతున్నరు. కొన్ని జిల్లాల్లో కేవలం దొడ్డు రకాలే మిల్లర్ల వద్దకు పంపితే దించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దొడ్డు రకం లోడ్‌‌లు రెండు, సన్నరకం లోడు ఒకటి పంపితేనే మిల్లర్లు దించుకోవడానికి ఒప్పుకుంటున్నారని ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు చెప్తున్నారు. దీంతో తూకాలు ఆలస్యమై రైతులు ఇబ్బంది పడుతున్నారు. .

బస్తాకు రూ.3 వసూలు

ఓ వైపు సెంటర్లలో వడ్లు కాంటా పెట్టిన తర్వాత లారీలు రాక రైతులు నష్టపోతుంటే.. మరోవైపు లారీలు వచ్చిన తర్వాత బస్తాకు రూ.3 చెల్లించాల్సిందేనని డ్రైవర్లు ఒత్తిడి తెస్తున్నారు. టైమ్​కు తీసుకెళ్లకుంటే మిల్లర్లు అన్​లోడ్​ చేసుకుంటలేరన్న భయంతో, వర్షాల నుంచి కాపాడుకోవడం కోసం లారీ డ్రైవర్లు అడిగినంత ఇవ్వాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నరు.  అధికారుల పర్యవేక్షణ లేక పోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.