బగ్గా అరెస్టుపై 3 రాష్ట్రాల పోలీసుల గొడవ

బగ్గా అరెస్టుపై 3 రాష్ట్రాల పోలీసుల గొడవ
  • ఉదయం అరెస్టు చేసిన పంజాబ్​ పోలీసులు
  • పంజాబ్​కు తరలిస్తుండగా అడ్డుకున్న హర్యానా ఆఫీసర్లు
  • వెనక్కు తెచ్చిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ : ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తజీందర్ పాల్ సింగ్ బగ్గా అరెస్టుపై మూడు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం నెలకొన్నది. రోజంతా అతడి కోసం పంజాబ్, ఢిల్లీ, హర్యానా పోలీసులు చేసిన హంగామా మీడియాలో హల్ చల్ చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​ను చంపుతానని సోషల్ మీడియా వేదికగా బెదిరించడంతో ఆప్ నేత సన్నీ అహ్లువాలియా ఏప్రిల్ 1న బగ్గాపై పంజాబ్​లోని మొహాలీలో కేసు పెట్టారు. ఈ కేసు విచారణకోసం పంజాబ్ పోలీసులు శుక్రవారం జనక్​పురిలోని బగ్గా ఇంటికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని తీసుకుని రోడ్డు మార్గం ద్వారా మొహాలీ బయల్దేరారు. తన కొడుకును పంజాబ్ పోలీసులు బలవంతంగా ఎత్తుకెళుతున్నారంటూ బగ్గా తండ్రి ప్రీత్ పాల్ సింగ్ కేసు పెట్టారు. బగ్గా జాడ కోసం రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు హర్యానా అధికారులకు సమాచారం ఇచ్చారు. ఢిల్లీ ద్వారకా కోర్టు అనుమతితో.. బగ్గాను తీసుకెళ్తున్న పోలీస్ కాన్వాయ్​ని కురుక్షేత్ర వద్ద హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. బగ్గా అరెస్టు అక్రమమంటూ ఢిల్లీ పోలీసులు సమాచారం ఇచ్చారని.. అతడిని వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పారు. పంజాబ్ పోలీసుల వెహికల్స్​ను కురుక్షేత్ర పోలీస్ స్టేషన్​కు తరలించారు. దీంతో పంజాబ్ పోలీసులు బగ్గా అరెస్టుపై హైకోర్టును ఆశ్రయించారు. తజీందర్ బగ్గాను తమకు అప్పగించాలని కోరుతూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిక్వెస్ట్​ను రిజెక్ట్ చేస్తూ కేసు విచారణను శనివారానికి వాయిదా వేసింది. కురుక్షేత్ర కోర్టులో ఢిల్లీ పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని బగ్గాను ఢిల్లీకి తరలించారు.

విచారణకు రాలే : పంజాబ్ పోలీసులు
జనాలను రెచ్చగొట్టే కామెంట్స్ చేశారనే ఆరోపణపై బీజేపీ ఢిల్లీ నేత తజీందర్​బగ్గాపై పంజాబ్​లోని మొహాలీలో కేసు నమోదైంది. ఏప్రిల్ 1న కేసు నమోదు కాగా.. విచారణకు రావాలంటూ ఐదుసార్లు నోటీసులు జారీచేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, బగ్గా మాత్రం ఒక్క నోటీసుకూ రెస్పాండ్​ కాలేదని పంజాబ్ ఏడీజీపీ చెప్పారు. దీంతో విచారణ కోసమే బగ్గాను అరెస్టు చేశామని చెప్పారు.