జైలులో ఢిల్లీ సీఎం​ దినచర్య ఇదే..

జైలులో ఢిల్లీ సీఎం​ దినచర్య ఇదే..

న్యూఢిల్లీ: లిక్కర్​ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్​ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్​ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్​ అర్వింద్​ కేజ్రీవాల్​కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఏప్రిల్​ 15 వరకు రిమాండ్​ విధిస్తూ సోమవారం రౌస్​ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆయనను పోలీసులు తీహార్​ జైలుకు తరలించారు. జైలులోని నంబర్​ 2 గదిలో ప్రత్యేక సెల్​ను ఆయనకు కేటాయించామని, అంతకుముందు కేజ్రీవాల్​కు వైద్య పరీక్షలు నిర్వహించామని జైలు అధికారులు తెలిపారు. కాగా, ఇదే కేసులో ఇప్పటికే అరెస్టయిన ఆప్​ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా, సంజయ్​సింగ్, విజయ్​నాయర్​, బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్​ జైలులోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్​ పాలసీ స్కాం కేసులో ఈ నెల 21న కేజ్రీవాల్​ను ఈడీ అధికారులు ఆయన ఇంట్లో అరెస్ట్​ చేశారు. మరుసటి రోజు రౌస్​ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా, మొదట 7 రోజులు, ఆపై 4 రోజులు కస్టడీకి కోర్టు అప్పగించింది. సోమవారంతో ఆ కస్టడీ ముగియగా, కేజ్రీవాల్​ను ఈడీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరిచారు.

విచారణకు సహకరించట్లే..

ఈడీ తరఫున అదనపు సొలిసిటర్​ జనరల్​ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. లిక్కర్​పాలసీ కేసు దర్యాప్తులో కేజ్రీవాల్​ పూర్తిగా సహకరించడంలేదని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు సంస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. ఈ కేసులో ఢిల్లీ సీఎం పాత్రపై ఇంకా దర్యాప్తు జరుగుతున్నదని, ఇందులో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తిస్తున్నట్టు తెలిపారు. విచారణ సందర్భంగా కేజ్రీవాల్​ తప్పించుకొనే సమాధానాలు ఇస్తున్నారని, సమాచారాన్ని దాచిపెడుతున్నారని చెప్పారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే డిజిటల్​ పరికరాల పాస్​వర్డ్​లను చెప్పట్లేదని కోర్టుకు తెలిపారు. ఏదడిగినా తెలియదనే జవాబే ఇస్తున్నారని చెప్పారు.

మంత్రుల పేర్లు వెల్లడించిన కేజ్రీవాల్

ఈ కేసులో నిందితుడైన విజయ్ నాయర్​ఎప్పుడూ తనకు రిపోర్ట్​ చేయలేదని, ఏదైనా ఉంటే మంత్రులు ఆతిశీ మార్లేనా, సౌరవ్​ భరద్వాజ్​కు మాత్రమే నివేదించేవాడని  కేజ్రీవాల్​ తెలిపారన్నారు. అయితే, తాను క్యాబినెట్​ మినిస్టర్స్​ బంగ్లాలో ఉండి.. చీఫ్​ మినిస్టర్​ క్యాంప్​ ఆఫీస్​ నుంచి పనిచేసినట్టు నాయర్ ఇచ్చిన​ స్టేట్​మెంట్​ వెల్లడిస్తున్నదని ఈడీ తెలిపింది. సీఎం క్యాంప్​ ఆఫీస్​నుంచి పనిచేసిన వ్యక్తి ముఖ్యమంత్రితోకాకుండా ఇతర మంత్రులకు ఎందుకు రిపోర్ట్​ చేస్తారని ఈడీ ప్రశ్నించింది. విజయ్​ నాయర్​ ఆప్​లో ఓ చిన్న వలంటీర్​ కాదని, మీడియా అండ్​ కమ్యూనికేషన్​కు హెడ్ అని ఈడీ పేర్కొన్నది. మద్యం తయారీదారులు, హోల్​సేలర్స్​, రిటైలర్స్, దినేశ్​ అరోరా, అభిషేక్​ బోయినపల్లిలాంటి మధ్యవర్తులతో నాయర్​ 10కిపైగా  సమావేశాల్లో పాల్గొన్నట్టు  తెలిపే ఆధారాలను కేజ్రీవాల్​కు చూపించినట్టు తెలిపింది. ఏ హోదాలో నాయర్​ ఈ సమావేశాలకు హాజరయ్యారని కేజ్రీవాల్​ను ప్రశ్నిస్తే, ఆయన సమాధానం దాటవేసినట్టు చెప్పింది. గోవా ఎన్నికల సమయంలో లిక్కర్​ పాలసీ ప్రయోజనాలు ఆప్​ పార్టీకి అందాయని సాక్ష్యాలు చూపినా.. కేజ్రీవాల్​ దాటవేసే సమాధానాలే చెప్పారని పేర్కొన్నది. ఆప్​లోని ఇతర సభ్యులకు సంబంధించి కేజ్రీవాల్​ తప్పుడు, విరుద్ధమైన సాక్ష్యాలను అందించారని తెలిపింది. లిక్కర్​ పాలసీ కేసులో కేజ్రీవాల్​ అత్యంత ప్రభావశీల వ్యక్తి అని,  ఆయనను లోతుగా విచారించాల్సి ఉన్నందును జ్యుడీషియల్​ రిమాండ్​కు పంపాలని ఎస్వీ రాజు కోరగా, 15 రోజుల రిమాండ్​ విధిస్తూ జడ్జీ కావేరీ బవేజా ఉత్తర్వులు ఇచ్చారు.

ఎన్నికలు పూర్తయ్యే దాకా.. సునీత

లోక్​సభ ఎన్నికలు పూర్తయ్యేదాకా కేజ్రీవాల్​ను జైలులో ఉంచడమే బీజేపీ లక్ష్యమని ఢిల్లీ సీఎం భార్య సునీతా కేజ్రీవాల్​ఆరోపించారు. కేజ్రీవాల్​కు కోర్టు జ్యుడీషియల్​ రిమాండ్​ విధించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రౌస్​ అవెన్యూ కోర్టునుంచి బయటకొస్తూ ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘కేజ్రీవాల్​ను 11 రోజులు విచారించారు. కోర్టు ఆయన్ను దోషిగా ప్రకటించలేదు. అయినా ఎందుకు జైల్లో పెట్టారు?’ అని ప్రశ్నించారు.

జైలులో ఢిల్లీ సీఎం​ దినచర్య ఇదే..

తీహార్​ జైలులో ఇతర ఖైదీలతోపాటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ దినచర్య ప్రారంభం అవుతుంది. ఉదయం 6.30 గంటలకు నిద్ర లేస్తారు. టీ, బ్రెడ్​ అల్పాహారంగా ఇస్తారు. స్నానం తర్వాత విచారణ ఉంటే కోర్టుకు లేకుంటే తన లాయర్లతో మీటింగ్​లో పాల్గొంటారు. ఉదయం 10.30–11.00 గంటల మధ్య పప్పు, ఓ కూరతోపాటు అన్నం లేదా 5 రోటీలతో భోజనం అందించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన తన సెల్​లోనే ఉంటారు. 3.30 గంటలకు కప్పు టీ, రెండు బిస్కెట్లు తీసుకుంటారు. సాయంత్రం 4 గంటలకు మళ్లీ తన లాయర్లకు కలుసుకునే అవకాశం ఉంటుంది. సాయంత్రం 5.30 గంటలకు డిన్నర్​ చేసి, మళ్లీ రాత్రి 7 గంటలకు తన సెల్​లోకి వెళతారు. వార్తలు, వినోదం, క్రీడలతో సహా 18 నుంచి 20 చానళ్లు చూసేందుకు అనుమతి ఇచ్చారు. కేజ్రీవాల్​కు 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు.

పుస్తకాలు కోసం కేజ్రీవాల్​ వినతి

ప్రత్యేక ఆహారం, మందులు, పుస్తకాలు, మతపరమైన లాకెట్​ సదుపాయాలు కల్పించాలని కోరుతూ కేజ్రీవాల్​ తరఫు లాయర్లు మెమో దాఖలు చేశారు. భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్​ మినిస్టర్​ డిసైడ్స్​ పుస్తకాలు జ్యుడిషీయల్​ కస్టడీలో చదివేందుకు అనుమతించాలని కోర్టును కోరారు.