కాంగ్రెస్ కార్యకర్తలతో కిక్కిరిసిన రామ్లీలా మైదానం

కాంగ్రెస్ కార్యకర్తలతో కిక్కిరిసిన రామ్లీలా మైదానం

ఢిల్లీ రామ్ లీలా మైదానానికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మెహంగై పర్ హల్లా బోల్ ర్యాలీ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. రాహుల్ రాకతో సభా ప్రాంగణం ఒక్కసారిగా నినాదాలతో మార్మోగిపోయింది. కార్యకర్తలకు అభివాదం చేస్తూ రాహుల్ వేదిక వద్దకు చేరుకున్నారు. దేశంలో పెరిగిపోతున్న నిత్యవసరాల ధరలు, నిరుద్యోగం, జీఎస్టీ సమస్యలపై రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్,ఛత్తీస్ ఘడ్ సీఎం భుపేష్ బగేల్,మల్లికార్జున ఖర్గే,కేసీ వేణుగోపాల్,కాంగ్రెస్ ఎంపీలు,పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. తెలుగు రాష్టాల పీసీసీ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, శైలజ నాథ్ పాల్గొన్నారు. 

కాంగ్రెస్ నిర్వహిస్తున్న ర్యాలీకి ఎన్నికలతో సంబంధం లేదన్నారు మాజీ కేంద్ర మంత్రి జైరామ్ రమేష్. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్రానికి ఒక సందేశం ఇవ్వడానికే ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. 

ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరగనున్న ఈ నిరసన... దేశంలోనే అతిపెద్ద ర్యాలీలలో ఒకటిగా నిలుస్తుందని  కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈనెల 7 నుంచి కాంగ్రెస్ పార్టీ ‘‘భారత్ జోడో యాత్ర’’ పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్రను ప్రారంభించనుంది.