
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరోమారు నిరాశ ఎదురైంది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు ఆగస్ట్ 27 వరకూ పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌ను కింగ్ పిన్‌గా పేర్కొంటూ ఈడీ అధికారులు ఈ ఏడాది మార్చి 21న అరెస్టు చేశారు. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినా సానుకూల తీర్పు రాలేదు. అయితే.. సుప్రీంకోర్టు జోక్యంతో లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. తర్వాత ఆయన జూన్ 2న మళ్లీ కోర్టు ముందు లొంగిపోయారు. ఈడీ కేసులో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ సీబీఐ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. దీంతో.. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉన్నారు.
సీబీఐ తనను వేధింపులకు గురిచేస్తున్నదని ఇప్పటికే కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ‘‘లిక్కర్ స్కామ్ కేసులో 2023 ఏప్రిల్ లో నన్ను విచారణకు పిలిచినప్పుడు సీబీఐకి పూర్తిగా సహకరించాను. కానీ ఈ కేసు దర్యాప్తు పేరుతో సీబీఐ నన్ను నిరంతరం వేధిస్తున్నది. ఇది చాలా తీవ్రమైన అంశం. నా అరెస్టు పూర్తిగా అక్రమం, రాజ్యాంగ విరుద్ధం. ఏ కేసులోనైనా రిమాండ్ ఉత్తర్వులు సాధారణం. కానీ ఇవి న్యాయ ప్రక్రియను దెబ్బతీసేందుకు దారితీస్తాయి. ఇప్పటికే కేసు విచారణ, ఆధారాల సేకరణ పూర్తయింది. అయినా సీబీఐ ఇలా వ్యవహరించడం సరికాదు” అని గతంలో కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.
లిక్కర్ స్కామ్కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను మొదట ఈడీ అరెస్టు చేసింది. ఆ కేసులో జైల్లో ఉన్న ఆయనను జూన్ 26న సీబీఐ అరెస్టు చేసింది. ట్రయల్ కోర్టులో హాజరుపరచగా.. మూడ్రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించడంతో పాటు ఈ నెల 12 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తన అరెస్టుతో పాటు ట్రయల్ కోర్టు ఉత్తర్వులను కూడా సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్లో ఉంది.