ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రాజీనామా

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రాజీనామా

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తన పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపారు. 2016 డిసెంబర్ 31న లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన బైజల్.. దాదాపు ఐదున్నరేళ్లుగా ఆ పదవిలో కొనసాగారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో గతంలో చాలాసార్లు విబేధాలు ఏర్పడ్డాయి. క‌రోనా స‌మ‌యంలోనూ వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి.

 

గతంలో వీకెండ్ క‌ర్ఫ్యూను ఎత్తేయాల‌ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్ణ‌యం తీసుకుంటే అనిల్ బైజ‌ల్ వ్య‌తిరేకించారు. కేసుల సంఖ్య త‌గ్గ‌లేద‌ని, వీకెండ్ క‌ర్ఫ్యూ ఎత్తేయ‌డం కుద‌ర‌ద‌ని వ్య‌తిరేకించారు. రైతు ఉద్య‌మ స‌మ‌యంలో పోలీసుల త‌ర‌పున వాద‌న‌ల‌ను వినిపించేందుకు కేజ్రీవాల్ స‌ర్కార్ ఓ లాయ‌ర్ల బృందాన్ని ఎంపిక చేసింది. ఈ ప్యానెల్‌ను బైజ‌ల్ వ్య‌తిరేకించారు. మ‌రో ప్యానెల్‌ను సూచించారు.

సీఎం కేజ్రీవాల్ త‌న బంధువుల కోసం రూ.50 కోట్ల విలువైన భూదందాల‌ను ప‌రిష్క‌రించార‌ని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని మాజీ మంత్రి క‌పిల్ మిశ్రా ఆరోపించారు. మంత్రి స‌త్యేంద్ర జైన్ నుంచి కేజ్రీవాల్ రూ.2 కోట్లు లంచం కూడా తీసుకున్నార‌ని క‌పిల్ మిశ్రా ఆరోపించారు. దీనిపై అనిల్ బైజ‌ల్ కు క‌పిల్ మిశ్రా ఫిర్యాదు చేశారు. దీంతో సీఎం కేజ్రీవాల్ పై విచార‌ణ చేప‌ట్టాల‌ని ఏసీబీని అనిల్ బైజ‌ల్ ఆదేశించారు.

ఎవ‌రీ అనిల్ బైజ‌ల్..?
అనిల్ బైజ‌ల్ 1969 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అట‌ల్ బిహారీ వాజ్‌పాయ్ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో బైజ‌ల్ కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శిగా విధులు నిర్వ‌ర్తించారు. ఈ స‌మ‌యంలోనే ఆయ‌న కిర‌ణ్ బేడీపై చ‌ర్య‌లు తీసుకున్నారు. జైళ్ల శాఖ నుంచి ఆమెను త‌ప్పించి, సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ త‌ర్వాత ఢిల్లీ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ డిప్యూటీ సెక్రెట‌రీగానూ ప‌ని చేశారు. 2016 లో ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.
 

మరిన్ని వార్తల కోసం..

దశలవారీగా దళితబంధు అమలు చేస్తాం

వివాదంగా మారిన గుడిసెల తొలగింపు