ఢిల్లీ లిక్కర్ స్కాం : నిందితుల రిమాండ్ 7 వరకు పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం  :  నిందితుల రిమాండ్ 7 వరకు  పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులు శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు,విజయ్ నాయర్,అభిషేక్ బోయినపల్లి  జ్యుడీషియల్‌ రిమాండ్ గడువు నేటితో ముగిసింది. ఈనేపథ్యంలో కస్టడీని పెంచాలని కోరుతూ సీబీఐ  కోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. దీంతో నిందితుల జ్యుడీషియల్ రిమాండ్ గడువును జనవరి 7 వరకు పొడిగించారు . ఢిల్లీ లిక్కర్ స్కాం లో  జనవరి 5న కేసుకు సంబంధించి ఈడీ మరో చార్జిషీట్ దాఖలు చేయనుంది.  

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇటీవలె ఈడీ రెండో చార్జిషీట్ ను దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో ఇండోస్పిరిట్ కంపెనీ నిర్వాహకుడు సమీర్ మహేంద్రు  పాత్రపై  మొత్తం 181 పేజీలతో ఈ కొత్త చార్జిషీట్ ను దాఖలు చేసింది. ఇందులోనూ  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత , మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి, ఎం.గౌతమ్, అరుణ్ రామచంద్ర పిళ్లై, బోయినపల్లి అభిషేక్ రావు పేర్లను  ఈడీ ప్రస్తావించింది. చార్జిషీట్ లోని 95, 96, 125వ పేజీల్లో కవిత పేరును  ఈడీ అధికారులు ప్రస్తావించారు. 

ఇదే కేసులో అంతకుముందు నవంబర్ 26న 3వేల పేజీలతో  ఈడీ మొదటి చార్జిషీట్ ను దాఖలు చేసింది. సమీర్ మహేంద్రు సహా ఆయనకు చెందిన నాలుగు కంపెనీలపై మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈ చార్జిషీట్ దాఖలైంది. ఇందులో ప్రముఖ లిక్కర్ వ్యాపారి, ఇండోస్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు పేరును ఏ1గా  చేర్చారు. ఏ2, ఏ3, ఏ4, ఏ5గా పలు కంపెనీల పేర్లను పేర్కొన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) సెక్షన్ 45 కింద సమీర్ మహేంద్రుతో పాటు మరో ఇద్దరి పేర్లను చార్జ్ షీట్‌‌లో పొందుపరిచినట్లు ఈడీ తరపు న్యాయవాది నవీన్ కుమార్ అప్పట్లో వెల్లడించారు.