లిక్కర్ షాపులకు అదనంగా మరో గంట పర్మిషన్: ఆప్ సర్కారు ఉత్తర్వులు

లిక్కర్ షాపులకు అదనంగా మరో గంట పర్మిషన్: ఆప్ సర్కారు ఉత్తర్వులు

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఢిల్లీలో లిక్కర్ షాపుల టైమింగ్స్‌పై ఆంక్షలు విధించిన ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో మరో గంట అదనంగా షాపులు తెరిచేందుకు అనుమతి ఇస్తూ శుక్రవారం ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే వైన్ షాపులను తెరిచేందుకు అనుమతి ఉంది. అయితే తాజాగా ఆ ఉత్తర్వులను సడలిస్తూ శుక్రవారం నుంచి మరో గంట అదనంగా మద్యం దుకాణాలు ఓపెన్ చేసుకునేలా ఆప్ సర్కారు నిర్ణయం తీసుకుంది. అన్ని లిక్కర్ షాపుల్లోనూ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు చేసుకోవచ్చని ఢిల్లీ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో మొత్తం 863 లిక్కర్ షాపులు ఉన్నాయి. అందులో 475 దుకాణాలను నాలుగు రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఢిల్లీ టూరిజం అండ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, ఢిల్లీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఢిల్లీ కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ హోల్‌సేల్ స్టోర్ ఈ షాపుల్లో అమ్మకాలు జరుపుతున్నాయి. మిగిలిన లిక్కర్ షాపులను ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్నారు.

కాగా, కరోనా వైరస్ కట్టడి కోసం దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి 24 నుంచి దేశమంతటాా లిక్కర్ షాపులను మూసేశాయి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ ఆంక్షల సడలింపులో భాగంగా జూన్ తొలి వారంలో అనేక రాష్ట్రాలు తిరిగి  మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చాయి. అయితే లిక్కర్ షాపుల దగ్గరకు వెళ్లే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని ఆదేశించాయి. అయితే తొలుత మద్యం షాపులకు పరిమిత గంటల సమయం మాత్రమే తెరిచేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వాలు ఆ తర్వాత క్రమంగా టైమింగ్స్ పెంచుతూ వచ్చాయి.