కొచ్చి పేలుళ్లతో ఢిల్లీ, ముంబైలో హై అలర్ట్

కొచ్చి పేలుళ్లతో ఢిల్లీ, ముంబైలో హై అలర్ట్

న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రం కొచ్చిలోని క్రిస్టియన్ గ్రూపు కన్వెన్షన్ సెంటర్‌‌లో బాంబు పేలుడు జరగడంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌‌ షా ఆదివారం ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌‌ కు ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడం కోసం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్​జీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) టీములను పంపుతున్నటు హోంశాఖ వర్గాలు తెలిపాయి. పేలుడు తర్వాత పరిస్థితిని సమీక్షించేందుకు అమిత్​షా కేరళ సీఎంతో మాట్లాడారని పేర్కొంది.

ఢిల్లీ, ముంబైలో ముఖ్యమైన భద్రత పెంపు

కేరళలో పేలుళ్ల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలోని సిటీలోని ప్రధాన మార్కెట్‌‌లు, చర్చిలు, మెట్రో స్టేషన్‌‌లు, బస్టాండ్‌‌లు, రైల్వే స్టేషన్లు ఇతర బహిరంగ ప్రదేశాల్లో భద్రతను పెంచామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ వైపు, హర్యానా వైపు సరిహద్దు ప్రాంతాల్లో బారికేడ్లు వేయాలని నిర్ణయించారు. 

పోలీసులు అంతా అప్రమత్తంగా ఉండాలని, అందిన ఏ సమాచారాన్ని విస్మరించవద్దని  ఉన్నతాధికారులు ఆదేశించారు. అలాగే ఢిల్లీ పోలీసు విభాగం కేంద్ర ఏజెన్సీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. పెట్రోలింగ్ పెంచినట్లు చెప్పారు. అదేవిధంగా, పండుగల సీజన్, రాబోయే క్రికెట్ మ్యాచ్‌‌ల నేపథ్యంలో ముంబై పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.  

అక్టోబరు 2న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన మహ్మద్ షానవాజ్ ఆలం, మరో ఇద్దరిని ఢిల్లీ స్పెషల్ సెల్​ పోలీసులు అరెస్టు చేశారు.  వారు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్​తో కలిసి పనిచేస్తున్నారు. వారు ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది.