కేంద్ర ఆర్డినెన్స్పై దుమారం..కేజ్రీవాల్- కేసీఆర్ భేటీకి కారణమేంటి

కేంద్ర ఆర్డినెన్స్పై దుమారం..కేజ్రీవాల్- కేసీఆర్ భేటీకి కారణమేంటి

ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్పై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ ఆర్డినెన్స్ బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వకుండా చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల మద్దతు కూడగడుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ .హైదరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కుదిస్తూ.. కేంద్రం తెచ్చిన  ఆర్డినెన్స్పై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ..ఢిల్లీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అయితే ఢిల్లీకి సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్లో ఏముంది..అసలు కేంద్రం ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చింది..?

కేంద్ర ఆర్డినెన్స్లో ఏముంది ..

ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్ రీజియన్లో పాలనాధికారం అసెంబ్లీకే ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చట్టాలు చేసే అధికారం కూడా ఢిల్లీ ప్రభుత్వానికే ఉంటుందని స్పష్టం చేసింది.  అధికారుల బదిలీలు, నియామకాల్లోనూ ప్రభుత్వానిదే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మే 11న తీర్పు ఇచ్చింది. సుప్రీం తీర్పును పక్కన పెడుతూ కేంద్ర ప్రభుత్వం మే 19న కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.  దీని ప్రకారం ఢిల్లీలో గ్రూప్ A అధికారుల పోస్టింగ్, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను తొలగిస్తూ..దాని స్థానంలో కొత్తగా నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ ఆథారిటీని ఏర్పాటుచేసింది. వీటికి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే హక్కు  లెఫ్టినెంట్ గవర్నర్‌కు కల్పించింది. 

ఆర్డినెన్స్  ఏం చేస్తుంది...

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఆర్డినెన్స్ 2023 కింద.. ఢిల్లీలో పనిచేస్తున్న డానిక్స్ (DANICS) కేడర్‌లోని  గ్రూప్- A అధికారుల సేవలు, బదిలీలు, వారిపై క్రమశిక్షణా చర్యలు, శాంతిభద్రతలు, భూములకు సంబంధించిన వ్యవహారాల  కోసం నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. DANICS అంటే ఢిల్లీ, అండమాన్ -నికోబార్, లక్షద్వీప్, డామన్, డయ్యూ, దాద్రా, నగర్ హవేలీ సివిల్ సర్వీసెస్ అని అర్థం. దీని ప్రకారం అన్ని గ్రూప్ A అధికారుల బదిలీ, నియామకాలు, శాంతిభద్రతలు, భూములకు సంబంధించి నిర్ణయాలను తీసుకునే హక్కు అథారిటీకి మాత్రమే ఉంటుంది. ఈ అథారిటీలో సభ్యులుగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ హోం శాఖ ఉంటారు. ఛైర్మన్ గా ముఖ్యమంత్రి ఉంటారు. ఈ అథారిటీ ఏ నిర్ణయం తీసుకున్నా..తుది నిర్ణయం మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్‌దే.

2015 నుంచే వివాదం..సుప్రీం ఏం చెప్పింది..

ఢిల్లీలో ప్రభుత్వం, ఎల్జీ అధికారాల పరిధిపై  2015 నుంచే వివాదం నడుస్తోంది. అయితే  కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పాలనాధికారాలను లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు కట్టబెట్టింది. అదే సమయంలో కొత్తగా ఏర్పడిన కేజ్రీవాల్ ప్రభుత్వం కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కానీ ఢిల్లీ హైకోర్టు మాత్రం కేంద్రం నిర్ణయాన్ని సమర్ధించింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్ అధ్యక్షతన గల ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం లెఫ్ట్ నెంట్ గవర్నర్, ఢిల్లీ ప్రభుత్వం మధ్య అధికారాల విభజిస్తూ మే 11వ తేదీన తీర్పు వెలువరిచింది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో శాంతిభద్రతల బాధ్యత మాత్రమే  లెఫ్ట్ నెంట్ గవర్నర్ ది అని..ఇతర శాసన, కార్యనిర్వాహక బాధ్యతలు ఢిల్లీ ప్రభుత్వానివే అని  తీర్పు ఇచ్చింది.  సుప్రీం తీర్పును పక్కన పెడుతూ కేంద్రం కొత్త ఆర్డినెన్స్ తెచ్చింది. 

కేంద్రం వాదనేంటి..

కేంద్రం, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఢిల్లీ నగరంలో అధికారాల సమతుల్యత కోసమే ఈ ఆర్డినెన్స్ తెచ్చామని కేంద్రం చెప్తోంది. ఢిల్లీపై  దేశమంతటికీ హక్కు ఉంటుందని...సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ  పరిపాలన గౌరవాన్ని దెబ్బతీశారని  కేంద్రం పేర్కొంది. దేశానికి ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, సుప్రీంకోర్టు వంటి అనేక అధికారిక సంస్థలు ఢిల్లీలోనే ఉన్నాయని...పలు దేశాల రాయబార కార్యాలయాలు ఢిల్లీలో ఉన్నాయని తెలిపింది. వివిధ దేశాల దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు ఢిల్లీలో నివసిస్తున్నారని....పరిపాలనలో తప్పిదం జరిగితే అది దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని..అందుకే ఆర్డినెన్స్ తేవాల్సి వచ్చిందని కేంద్రం వాదిస్తోంది. ఢిల్లీలో ఏ నిర్ణయం తీసుకున్నా ఢిల్లీ ప్రజలనే కాక..దేశంలో అందరి పౌరులపైనా ప్రభావం చూపుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 

ఆర్డినెన్స్ పాస్ అవుతుందా...?

కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఢిల్లీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల మద్దతు కూడగడుతోంది. అటు ఢిల్లీ సర్కార్ కు పలు పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. అయితే  ఆ ఆర్డినెన్స్కు సంబంధించిన బిల్లు.... లోక్ సభ, రాజ్యసభ రెండూ ఆమోదిస్తేనే చట్టంగా మారుతుంది. రాజ్యసభలో బీజేపీ ప్రభుత్వానికి 110 మంది ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలకు 128 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. లోక్ సభలో ఆర్డినెన్స్ బిల్ పాసైనా...రాజ్యసభలో విపక్షాలన్నీ ఏకమై ఆ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఓటువేసి ఓడిస్తే మాత్రం బిల్ వీగిపోతుంది. అందుకోసమే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. కేసీఆర్ మద్దతు కూడగట్టారు.