ఆల్ట్ న్యూస్ కు పాక్, సిరియా నుంచి విరాళాలు

ఆల్ట్ న్యూస్ కు పాక్, సిరియా నుంచి విరాళాలు
  • కీలక విషయాలు వెల్లడించిన ఢిల్లీ పోలీసులు

ఢిల్లీ : ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ ‘ఆల్ట్ న్యూస్’ స‌హ వ్యవస్థాప‌కుడు, జర్నలిస్టు మహమ్మద్ జుబేర్ కేసు విచారణలో ఢిల్లీ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఆల్ట్‌ న్యూస్‌ కార్యకలాపాలను నిర్వహించే ప్రావ్దా మీడియాకు పాకిస్తాన్, సిరియాతో పాటు ఇతర గల్ఫ్‌ దేశాల నుంచి విరాళాలు వచ్చినట్లు తమ విచారణలో తేలిందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అనేక సాక్ష్యాలను జుబైర్  ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. మతపరంగా వ్యక్తుల భావోద్వేగాలను దెబ్బతీసేలా గతంలో ట్వీట్ చేసినందుకు జుబైర్‌ను గత నెల జూన్ 27న (సోమవారం) ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

నాలుగు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో జుబైర్ ను ఢిల్లీలోని పాటియాలా హౌజ్‌ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ప్రావ్దా మీడియాకు జుబైల్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని, ఈ సంస్థకు పాకిస్తాన్‌, సిరియా, దుబాయి, షార్జా, సింగపూర్‌, అబుదాబీతో పాటు పలు అమెరికా రాష్ట్రాల నుంచి రూ.2లక్షలకు పైగా విరాళాలు అందినట్లు తెలిపారు. జుబైర్‌ అరెస్టు తర్వాత అతడికి మద్దతుగా చాలా మంది ట్వీట్లు చేశారని, అయితే ఆ ఖాతాలు కూడా విదేశాలకు చెందినవే అని పేర్కొన్నారు.  

బెయిల్‌ నిరాకరణ
కేసు తీవ్రత దృష్ట్యా అతడికి బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం జుబైర్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. జుబేర్ కు మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.