ఢిల్లీలో 45 రోజులు ప్రైవేటు వైన్ షాపులు బంద్

ఢిల్లీలో 45 రోజులు ప్రైవేటు వైన్ షాపులు బంద్
  • మద్యం రిటైల్ వ్యాపారం నుంచి వైదొలగనున్న ఢిల్లీ ప్రభుత్వం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి ప్రైవేటు వైన్ షాపులు 45 రోజులపాటు మూతపడనున్నాయి. గత జులైలో ఢిల్లీ రాష్ట్ర కొత్త మద్యం విధానం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విధానం ప్రకారం మద్యం రీటైల్‌ వ్యాపారం నుంచి ప్రభుత్వం వైదొలగనుంది. వచ్చే నవంబర్‌ 16వ తేదీ నుంచి ఢిల్లీ నగరంలో అన్ని మద్యం షాపులను ఓపెన్‌ టెండర్‌లో ప్రైవేట్‌ వ్యక్తులకు కేటాయించనున్నారు. ఈ క్రమంలో ఇపుడు రాష్ట్రంలో ఉన్న 276 ప్రైవేట్‌ మద్యం షాపులను మూసేస్తారు. ప్రైవేటు మద్యం షాపులు మూసేసినా ఇపుడు ఉన్న దాదాపు 450 మద్యం షాపుల నుంచి అమ్మకాలు కొనసాగిస్తారు. 
షాపుల మూత వల్ల ఇబ్బందులు రాకుండా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 40 శాతం మద్యం  మద్యం దుకాణాల ద్వారా డిమాండ్‌ తగ్గట్లు సరఫరా పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న మద్యం దుకాణాల కోసం ఢిల్లీ నగరంలో 32 జోన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఒక్కో జోన్‌ను 8 నుంచి 10 వార్డులుగా విభజించి.. పోటీ ఉండేలా ఒక్కో వార్డులో కనీసం మూడు, నాలుగు షాపులకు అనుమతించాలని నిర్ణయించారు. ప్రస్తుతం 40 శాతం వైన్ షాపులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండగా.. మెజారిటీ షాపులు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. 
అయితే ప్రభుత్వ షాపుల్లో జనం కోరిన బ్రాండ్లు లేవనే ఫిర్యాదులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం స్పందించి కొత్త విధానం ప్రకటించింది. ఒకే వార్డులో ప్రైవేట్‌ వ్యక్తులకు ఇస్తే.. వారు పోటీ పడి ప్రజలకు కావాల్సిన బ్రాండ్లతో పాటు ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఇచ్చే అవకాశముందని భావిస్తూ మద్యం వ్యాపారం నుంచి వైదొలగాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం ప్రకటించింది.