ఢిల్లీలో ఎల్లో అలర్ట్.. 13 రైళ్లు ఆలస్యం

ఢిల్లీలో ఎల్లో అలర్ట్.. 13 రైళ్లు ఆలస్యం

ఢిల్లీవాసులను చలి పులి వణికిస్తోంది. దేశ రాజధానితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో 1.4 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోవడంతో చలికి జనం గజగజ వణుకుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 9 డిగ్రీల మేర పడిపోయింది. ఈ సీజన్‭లో ఇంత కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో ఢిల్లీలో ఇవాళ్టి నుంచి మరో 6 రోజుల పాటు ఐఎండీ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈ ఉదయం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల సెల్సియస్‌గా, లోధి రోడ్డులో 1.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మరోవైపు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టంగా అలముకొన్న పొగమంచు కారణంగా... 13 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ఇండియన్‌ రైల్వేస్‌ ప్రకటించింది. 

రానున్న ఐదు రోజుల్లో ఢిల్లీ సహా పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో మంచు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది. వాయువ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలిగాలుల వల్ల ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గడిచిన పదేళ్లలో ఇంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది తొలిసారి అని ఐఎండీ అధికారులు వెల్లడించారు.