ప్రపంచంలోనే అత్యంత పొల్యూటైన సిటీ ఢిల్లీ

ప్రపంచంలోనే అత్యంత పొల్యూటైన సిటీ ఢిల్లీ

పొల్యూషన్‌కు ఢిల్లీ కేరాఫ్‌ అడ్రసైపోతోంది. చలికాలమైందంటే చాలు సిటీలో చలికి బదులు కాలుష్యమెట్లుంటదోనని వణకాల్సి వస్తోంది. రాజధాని నగరంలో పొల్యూషన్‌ విపరీతమైతోందని ఇప్పటికే సర్వేలు, రిపోర్టులు హెచ్చరించగా తాజాగా ‘వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 2019’ రిపోర్టు కూడా ఇదే చెప్పింది. బాగా పొల్యూటైన రాజధాని నగరాల్లో ఢిల్లీనే టాప్‌లో ఉందని వెల్లడించింది. ప్రపంచంలో బాగా కలుషితమైన టాప్‌ 30 నగరాల్లో 21 మన దేశంలోనే ఉన్నాయంది. మోస్ట్‌ పొల్యూటెడ్‌ దేశాల్లో ఇండియా 5వ స్థానంలో ఉందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 5 వేల నగరాల్లో పొల్యూషన్‌ను అంచనా వేసి ఈ నివేదికను గ్రీన్‌ పీస్‌, ఐక్యూఎయిర్‌ రూపొందించాయి.

ఢిల్లీ తర్వాత లాహోర్‌, ఢాకా

మైక్రో పొల్యూషన్‌ (పీఎం 2.5) ఎక్కువున్న ప్రపంచంలోని టాప్‌ 200 సిటీల్లో 90 శాతం ఇండియా, చైనాల్లోనే ఉన్నాయని రిపోర్టు వెల్లడించింది. కాలుష్యం ఎక్కువున్న నగరాల వారీగా ఢిల్లీ తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్‌లోని లాహోర్‌, బంగ్లాదేశ్‌లోని ఢాకా, ఇండియాలోని కోల్‌కతా, చైనాలోని లిన్‌యి, తియాంజిన్‌, జకార్తా, ఇండోనేసియా ఉన్నాయంది. వీటి తర్వాతి ప్లేస్‌లో కరోనా వైరస్‌ వ్యాపించిన చైనాలోని వుహాన్‌ సిటీ ఉందని చెప్పింది. తర్వాత చెంగ్డూ, బీజింగ్‌ ఉన్నాయని పేర్కొంది. మోస్ట్‌ పొల్యూటెడ్‌ దేశాల్లో బంగ్లాదేశ్‌ టాప్‌లో ఉందని.. తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్‌, మంగోలియా, అఫ్ఘానిస్థాన్‌, ఇండియా ఉన్నాయంది. చైనా 11వ ప్లేస్‌లో ఉందని చెప్పింది.

చైనాలో 117 నగరాలు

చైనాలో పీఎం 2.5 స్థాయి 2018తో పోలిస్తే 2019లో 20 శాతం వరకు తగ్గినా టాప్‌ 200 పొల్యూటెడ్‌ నగరాల్లో 117 ఆ దేశానివే ఉన్నాయని నివేదిక చెప్పింది. ఇండియాలో కూడా పీఎం 2.5 పొల్యూషన్‌.. డబ్ల్యూహెచ్‌వో స్థాయి కన్నా 500 శాతం పెరిగిందని పేర్కొంది. పీఎం 2.5 పొల్యూషన్‌లో ఓఈసీడీ దేశాల్లో దక్షిణ కొరియా టాప్‌లో ఉందని.. టాప్‌ 1000 సిటీల లిస్టులో 105 ఇక్కడివే ఉన్నాయని వివరించింది. యూరప్‌లో పోలాండ్‌వి 39, ఇటలీలో 31 నగరాలున్నాయని పేర్కొంది. మిడిల్‌ ఈస్ట్‌, ఆఫ్రికా దేశాల డేటా అందలేదని చెప్పింది.

తక్కువ సైజు.. మహా డేంజర్‌

2.5 మైక్రాన్ల కన్నా తక్కువ సైజున్న (మనిషి వెంట్రుకలో 30వ వంతు) కాలుష్య కారకాలు గాలి కాలుష్య కారకాల్లో చాలా డేంజర్‌. గాలి నుంచి శ్వాసక్రియ ద్వారా మనిషి రక్తంలోకి ఇవి ఈజీగా కలిసిపోతాయి. వీటి వల్ల ఆస్తమా, లంగ్‌ క్యాన్సర్‌, గుండె రోగాలు సహా ఇంకెన్నో జబ్బులు వస్తాయి. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం పీఎం 2.5 స్థాయి ఏ 24 గంటల్లో చూసినా క్యూబిక్‌ మీటర్‌కు 25 మైక్రోగ్రాములకు మించొద్దు.

పీఎం 2.5 వల్లే అలాంటి మరణాలు

తక్కువ వయసులోనే మరణించడమనేది పీఎం 2.5 పొల్యూటెంట్స్‌ ఎక్కువవడం వల్లే జరుగుతుందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఇలాంటి పొల్యూషన్‌ వల్ల ఏటా 70 లక్షల మంది మరణిస్తున్నారంది. చైనాలో ఏటా 10 లక్షల మంది యావరేజ్‌ జీవితకాలం కన్నా ముందే చనిపోతున్నారని చెప్పింది. ఇసుక తుపానులు, సేద్యం, పరిశ్రమలు, పెట్రోల్‌, డీజిల్‌ నుంచి, అడవుల్లో అంటుకున్న కార్చిచ్చుల నుంచి ఈ పీఎం 2.5 పొల్యూటెంట్స్‌ పుట్టుకొస్తాయంది.

దేశంలోని 21 పొల్యూటెడ్‌ నగరాలు  

ఘజియాబాద్‌, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌, గ్రేటర్‌ నోయిడా, బంధ్వారి, లక్నో, బులంద్‌షహర్‌, ముజఫర్‌నగర్‌, బగ్‌పట్‌, జింద్‌, ఫరీదాబాద్‌, కొరౌట్‌, భివండీ, పాట్నా, పల్వాల్‌, ముజఫర్‌పూర్‌, హిసార్‌, కుటైల్‌, జోధ్‌పూర్‌, మొరాదాబాద్‌